సుందర మ్మత్తయ్య

పెద్దవాడు పద్మనాభరావు ఒంగోలు కోర్టులోనే లాయరిప్పుడు. రెండోవాడు  రమణమూర్తి ఐఎల్టిడిలో స్టెనోగా చేస్తూ అర్థాంతరంగా ఉద్యోగం వదిలేసి పొన్నూరులో ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుకుంటున్నాడు. మూడోవాడు భానుమూర్తిది అచ్చంగా తల్లి పోలిక. రూపంలోనే కాదు.. మాటా మంచి తీరులో కూడా. ఒంగోలులో అప్పర్ ప్రైమరీ స్కూలు వరకు నా క్లాస్ మేట్  వాడు. లాయరుగారి ఆశ్రయం పోయిన తరువాత మా నాన్నగారి ప్రోద్బలం మీద సుందరమ్మత్తయ్య మా ఇంటికి ఎదురుగానే ఉంటూ కుట్టుపనిలో ట్రైనింగయింది. ఒక్క కుట్టు పనే కాకుండా అత్తయ్య విస్తళ్లు కుట్టడం, ఊరగాయ పచ్చళ్లు పెట్టడం.. అమ్మడం, పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ముందుగానే తినుబండారాలు అవీ తయారుచేసి చవుక ధరకు దుకాణాలకు ఇవ్వడంలాంటి రకరకాల పనులు క్షణం తీరికలేకుండా చేస్తూనే ఉండేది. డబ్బు ఖర్చు విషయంలో ఎంత లోతుగా ఆలోచించేదో ఇప్పుడు తలుచుకుంటే అబ్బురం కలక్కమానదు. నాలుగోవాడు జగన్మోహన్ కు ఓ సారి కడుపులో పురుగు చేరి ఎంత తిన్నా అరక్క చివరికి జీవశ్ఛవంలా తయారయాడు. మా నాన్నతో సహా ఎవరు ఎంత మందలించినా గవర్నమెంటు ఆసుపత్రికి తప్పించి ఒక్క సారైనా ప్రయివేట్ డాక్టర్ చూపించిన పాపానపోయింది కాదు. చివరికి ఆమె చేసిన గృహవైద్యంతోనే జగన్ మోహన్ మళ్లీ మనుషుల్లో పడింది; కానీ, సుమారు నెలరోజులు వాడు పడ్డ హైరానా బైటవాళ్లం మేము కూడా చూసి భరించలేకపోయాం. మరి తల్లై ఉండీ మా సుందరమ్మత్తయ్య ఎలా తట్టుకుందో .. తనకే తెలియాలి! ఆ సమయంలో మా అత్తయ్య పిసినారితనాన్ని చూసి తిట్టిపొయ్యనివాళ్లు లేరు. కొడుక్కు రోగమొస్తే ఖరీదైన మందిప్పిచ్చేందుక్కూడా సందేహించే కాపీనంతో ఆమె ఎన్నెన్ని విమర్శలకు గురయిందో ఆ రోజుల్లో! 

కూతురు వసుంధర పెదవి మీద తెల్ల మచ్చ కనబడితే ఆ బొల్లిని ఆరంభంలోనే అడ్డుకోడానికి ఆమె పడ్డ యాతన చూస్తే అమలో ఉన్నది కాపీనం కాదు.. ముందుచూపనిఅర్థమవుతుందిప్పుడు. అసలే మధ్యతరగతి దిగువ కుటుంబం. దిక్కూ మొక్కూలేని సంసారం. ఎంత అందం ఉండీ ఏం చేసుకోనూ? పెళ్లిళ్ల దగ్గరకొచ్చేసరికి ఆడది అంగట్లో బేరానికి తయారైన బెల్లం సరుకే అవుతుంది కదా! అనాకారితనం కనబడితే దీని జీవితానికి ఓ అధరువు ఏర్పడేనా? ఏర్పడ్డా అది సక్రమంగా  వెళ్లదీసేదయి  ఉండాలి కదా! అందుకే ఈ తాపత్రయం. సుందరమ్మ అత్తయ్య ఆ తరహా నిరాశ గొలిపే మాటలు ఏనాడూ నోటితో బైట అనకపోవచ్చును. కానీ, ఆమె నైజం ఎరిగిన మాకు ఎదిగిన తరువాత  సులువుగా బోధపడిన ఆమె జీవిత సూత్రం- ఎవరి మీదా ఏ ఫిర్యాదూ చెయ్యకుండా వీలైనంత వరకు దొరికిన దానితోనే సర్దుకుని పోవడంలోనే అందరి ప్రాణానికీ సుఖం! అని.

Comments