విడ్డూరం
*******
మనకన్నీ వింతలే! విడ్డూరాలే!
ప్రతిసారీ రుతువులు మారినప్పుడు కొత్తే.
" ఇలాంటి ఎండలు జన్మలో ఎరగం!
*ఇదేం వర్షం రా నాయనా! ఊళ్లకి ఊళ్లు ముంచేస్తూ!"మాతాతల్నాడెరగం ఇంత చలి!
ప్రతీ సారి వినే మాటలే!
కానీ అప్పటి కప్పుడు నాలిక అశ్చర్యం ప్రకటిస్తుంది.
అలాటిదే ఆవకాయ ప్రహసనం.
రిటైరయ్యాక , పిల్లలు కూడా స్థిరపడ్డాక,సుగరు,ప్రెషరు అనే అక్కచెల్లెళ్ళ తో స్నేహమయ్యాక -
"ఈసారి ఆవకాయ పెట్టవద్దు.బజార్లో,స్వగృహ,జంధ్యాల తదితరులు పెట్టే ఆవకాయ లెలాగూ ఉన్నాయి. మళ్లీ ఈ వయసులో మనం కష్టపడి అన్ని రకాలు పెట్ట నక్కర్లేదు.
ఎవరికి కావలిస్తే వాళ్లు కొనుక్కుంటార్లే" అన్నాను.
అవిడఏమన్లేదు.
" నీకూ కష్టం, శ్రమ తగ్గుతుంది " అన్నాను.
మా ఇద్దరిలో ఆవిడకే ఆవకాయ అవసరం ఎక్కువ.
సరే బజార్లో మామిడి కాయల రాక ప్రారంభమైంది.
రాలుడు పిందెలు,పగిలిన కాయలు,లోకల్ పుల్లకాయలు వచ్చాక కలెక్టర్ (తోతాపురి),నీలాలు,ఇంకా పేరు తెలియని వెరైటీలు ఆకుపచ్చగా ఊరిస్తూ కనపడ్డాయి.
మా అమ్మి తో అన్నాను గానీ
" ఇంకా ఎండలు ముదరాలి." అంది.
మేం సాధారణంగా ఎండావకాయ అంటే బెల్లం అవకాయ పెడతాము.
మొదట్నుంచీ అదే అలవాటు. కారం ఆవకాయ సొక్కదెవరికీ.
ఆదీ కలెక్టర్ కాయ కావాలి.
ముక్కలు గుండలో కలిపి కాస్త ఊరాక ముక్కలు,ఊట విడివిడిగా ఎండ బెట్టడం ఒక డ్యూటీ.
వారం ఎండాక వాటిని చిన్నముక్కలుగా తరిగి ఊటలో కలిపేసి వర్షాలు పడ్డాక వాటిని తినడం అనవాయితీ.
అంతవరకు అగలేము కాబట్టి విడిగా కత్తెర ముక్కలు పెడతారు. అవి ఎండ బెట్టనఖర్లేదుపోయినా ఒకరోజు ఊటలో నానేక తినవచ్చు.
ఐదారు రోజులు గడిచాక,కొత్తావకాయ అన్నం పోస్ట్ లు చూసాక మాట వరసకు అన్నట్లు యథాలాపంగా-
ఎండలు బాగా ఉన్నాయి. కాయలు బాగా కనిపిస్తున్నాయి. పెద్ద లెవెల్లో పూర్వం లాగ కాక పోయినాఏదో పదికాయలు పెడ్దామా ఆనవాయితీ తప్పకుండా." అన్నాను.
"నీ కిష్టం లేకపోతే వద్దులే!"
అని యాడ్ చేసాను ఎందుకైనా మంచిదని.
"వద్దన్నారుగా." అంది
నర్మగర్భంగా.
"నిజమే అనుకో.కానీ జనాలు...ఊదర..."
సరే.రేపు మొండా కి వెళ్లి కాయలు ,గుండలు తెచ్చి ఓ పది కాయలు తీపావకాయ ,కోరుపచ్చడికి తీసుకుందాం " అన్నాను.
"అల్లుడు మనవరాలు తీపి ఇష్టపడరు.వాళ్లకి ఐదారు పుల్ల కాయలతో కారం ఆవకాయ పెడదాం."అందావిడ.
"సరే"అన్నాను.
మొన్న సోమవారం బజార్లో ఇరవై కాయలు,ఆవ,మిర్చి,బెల్లం ఇత్యాది ఆవకాయ సామగ్రి తీసుకువచ్చి ఆవకాయ మహోత్సవాలు జరపడమైంది.
Comments
Post a Comment