అపుత్రస్య…

నెల రోజులైంది యీ సికింద్రాబాద్‌ లో స్ధిర పడి.
మా నాన్న గారి ఆబ్దికపు రోజొచ్చింది.
పూర్వం బెంగాల్ లో వున్నరోజుల్లో కూడా తద్దినాలకి నాకు ఎటువంటి ఇబ్బంది ఎదురవలేదు.
కారణం మంత్రం చెప్పే బ్రహ్మ డే ఇద్దరు భోక్తల్ని తెచ్చుకొని గంటారెండుగంటలాలస్యమైనా వచ్చే వాడు.
కానీ ఆంద్ర..సారీ తెలంగాణా ప్రాంతంలో నాకు ఈ విషయంలో ఎదురవబోయే యిబ్బందులు గురించి ముందుగానే మా అన్నయ్య, మా చినబావమర్ది హెచ్చరించారు.
కాబట్టి ముందుగా మఠాల వేట ప్రారంభించాను.
మా వాడు రాఘవేంద్ర మఠమొకటి మల్కాజగిరి దగ్గర వుందని చెప్పడం వల్ల అక్కడి కే బయలుదేరేను.
దార్లో  ఒకాయన. నా దృష్టి నాకర్షించడంతో అటువైపు నడిచేను.
అరవై డబ్బయ్యేళ్లుంటాయతనికి.దుస్తులు మాసిపోయి వున్నాయి. కళజోడుకి ఒక వేపు తాడు కట్టి వుంది. కళ్లు మాటిమాటికీ తుడుచుకుని బెక్కుతూ రోడ్డు పక్కన వున్న రావిచెట్టు మొదల్లో కూచున్న దైవోపహతుడ్లా కనిపించేడాయన.
అందరూ ఎవరి బిజీలో వారు వురకలపరుగుల మీదున్నారు.
ఆయన దగ్గరగా నడిచి నెమ్మదిగా విషయం రాబట్టేను
పాతకధే.
ప్రయివేటు వుద్యోగం-ఒక్కడే కొడుకు -ప్రేమ పెళ్లి -ఇటీవలే భార్యావియోగం-ఇంట్లో అనాదరణ-ఉన్నదేదో ముందే హస్తగతం చేసుకుని ఏదో వంకతో బయటకు తోలేసార్ట.
రెండు రోజులైందట అన్నం తిని.
జేబులో మఠం కోసం ఇవ్వాల్సిన ఐదువందల రూపాయలున్నాయి.
ఏదైనా వృధ్దాశ్రమం లో చేరమని ఉచిత సలహా యిచ్చి ఆ ఐదువందలు అతనికి యిచ్చి వెనక్కి తిరిగేను.
మఠంపని రేపుచుద్దామని.
అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా మరి సపుత్రస్య…

Comments