భయం

,చిన్నప్పట్నుంచీ కవిత్వం కన్నా కధలు రాయడం నాకిష్టం.
అదీకాక కందం రాయ లేని వాడు కవి కాలేడనే నానుడి వుండనేవుంది.
ఓహెన్రీ కొస మెరుపు కధలు చదివాక ప్రభావితుడ్నై 1978 లో మొదటి మినీకధ రాసి పురాణం వారి ఆంధ్రజ్యోతి వారపత్రికకు పంపేను.
అది అచ్చయి నన్ను రచయత గా నిలబెట్టింది.
చిన్నప్పుడు మామ్మల ద్వారా విన్న రాజకుమారి మాంత్రికుడుకధల వల్ల సాధువుల న్నా,బైరాగులన్నా భయం..
చీకటిలో దయ్యాల భయం..
పెద్దయ్యాక రకరకాల భయాలు..
ఆ భయాల్లోంచి పుట్టుకొచ్చిన కధ యిది.
చలికాలం.
మినర్వాలో సెకెండ్షో చూసి యింటికి వస్తున్నాను.
చలి పులిలా గజగజవణికిస్తోంది.పేంటు జేబులో రెండు చేతులూ దూర్చుకున్నా ఆగటంలేదు.సిగరెట్ వెలిగించి దమ్ము లాగుతూ నడవసాగేను.
మూడులాంతర్లు దాటేక మాయింటి సందు తిరిగేను.
వీధంతా నిర్మానుష్యంగా వుంది.
చోరాగ్రేసర చక్రవర్తులూ,బ్రాకెట్ నిశాచరులూతప్ప తతిమ్మా జనవంతా నిద్రించే సమయం.
కొంచెం భయం వేసింది.
గబగబ అడుగులు వేసేను.
సుసర్ల వారి యిల్లుదాటేను.
అప్పుడు వినిపించింది నా వెనక అడుగుల శబ్దం.
గుండెలు గబగబా కొట్టుకునే శబ్దం నాకే స్పష్టంగా వినిపిస్తుంది.
నన్ను తన్ని చేతి వాచి, వుంగరం లాక్కుంటే...
నడకవేగం పెంచాను.
ఇల్లు దగ్గరవుతోంది.
సిగరెట్ గబగబ పీల్చి పడేసిమా యింటి గుమ్మం మెట్లు ఒక్క అంగలో ఎక్కి తలపు దబదబా బాదేను.
ఎవరో వస్తున్నా అన్న మాట విన్నాక హమ్మయ్య అనుకుంటూ వెనక్కి తిరిగి ధైర్యంగా చూసేను.
అంతవరకూ నా వెనకే అంత స్పీడ్ గా వచ్చిన ఆకారం గభాల్న ముందుకు వంగి నే కాల్చిపారేసిన సిగరెట్ ఆప్యాయంగా అందుకుని పెదిమల మధ్య పెట్టుకుంది.

Comments