మాతృ వందనం

ఆంధ్రదేశంలోని వున్న అనేకానేక వూళ్లలో అదో వూరు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెభ్బయివొక్క యేళ్లయిన సందర్బంగా అందరితో పాటు ఆ
వూరు కూడ తగురీతి స్వాతంత్ర్య దినోత్సవ
వేడుకలు జరపుకోడానికి ఆయత్తమవుతోంది.

అక్కడ వున్న ప్రభుత్వ పాఠశాల లే కాకుండా
ప్రయివేటు బళ్లలో కూడా సిబ్బంది తో పాటు
చదువు 'కొంటు' న్న విద్యార్దినీ విద్యార్దులు
తెగ హడావుడి పడుతున్నారు.
అలాంటి ఒక బడి లో-
ఉదయం ఎనిమిది గంటల సమయం.
బడి ప్లేగ్రౌండ్ లో అందరూ తెగ హడావుడి గా
పన్లు చేస్తున్నారు.
రంగుల తోరణాలు ,రంగవల్లులు ఎక్కడ చూసినా
కనులపండుగలా కనిపిస్తున్నాయి.
జెండాకొయ్య తెల్ల రంగు వేసుకోని తళతళా
మెరిసిపోతూ  నాదేకదా యీ రోజు అని ఠీవిగా
తల ఎగరేసుకుంటూ నిలబడింది.
పక్కనే వున్న టేబుల్ మీద మువ్వన్నెల పతాకం,ఆపక్కనే ప్లాస్టిక్ బుట్టలో పువ్వులు
మమ్మల్నెప్పుడు మీదకి ఎక్కిస్తారని అడుగుతున్నట్లు చూస్తున్నాయి వచ్చే పోయే
వారందరినీ.
ఒక పక్క డ్రిల్ మాస్టారు స్కౌట్ బాయ్స్ తో
ఆరోజు చేయబోయే కవాతు అభ్యాసం
చేయిస్తూ బిజీ గావున్నారు.
హెడ్ మాస్టర్ అందరికీ ఆదేశాల ఇస్తూ హడావుడి పడిపోతున్నారు.
మహిళా అధ్యాపికలు ఆరోజు జరగబోయే నాటికల,
నృత్య ప్రదర్శన ల రిహార్సల్స్ తరగతి గదుల్లో చేయిస్తున్నారు.
మైక్ పనివారు వాళ్ళ సరంజామా తో కుస్తీ పడుతున్నారు.

అప్పుడు అకస్మాత్తుగా జరిగిందది.

ఒక పధ్నాలుగు సంవత్సరాల కుర్రాడు,సన్నగా
చువ్వలా వున్నాడు..ఒంటి మీద ఖాకి నిక్కరు
తప్ప మరేమీ లేదు.
మెరుపు లా వచ్చి అక్కడ టేబుల్ మీద వున్న
త్రి వర్ణ పతాకాన్ని అందుకుని మెరుపు కన్నా
వేగంగా బయటకు పరుగు తీసేడు.
అసలేం జరిగిందో గ్రహించేలోగా రెప్పపాటు
కాలంలో జరిగిన సంఘటన కు తేరుకుని
అతని వెనకాల పరుగులు తీసేరు డ్రిల్ టీచర్ మరో
యిద్దరు కుర్రాళ్లు.
అప్పటి కే అతను వాళ్ళ కు అందనంత దూరంలో వున్నాడాకుర్రాడు.
లేడిలా ,సుశిక్షితుడైన సైనికుడిలా వడివడిగా
పరిగెత్తే అతని వెనకాల అనుసరిస్తూ పరిగెడుతునారు స్కూల్ వాళ్ళు.
సందులు గొందులు దాటి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న
స్లమ్ ఏరియా లో దూరేడతను.
అదంతా ఒక వైతరణి లా వుంది.
మిని నరకంలా ..అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా
దారి తెన్ను లేకుండా ..
మనుషుల తో సహజీవనం చేసే ఆవులు, కోళ్ళు, పందులు, మేకలు.. వాటి మలమూత్రాలు...
వరసవావి లేని గుడిసెలు...
పరిగెత్తే కుర్రాడు ఒక షెడ్ ముందు ఆగాడు.
అది శిధిలావస్థలో వుంది.
అక్కడ నేలమీద ఒక నిర్జీవ శరీరం పడుకోబెట్టబడి
వుంది.
అమె వంటి పైనున్న వస్త్రం ఆమె శరీరాన్ని పూర్తిగా
కప్ప లేక పోతోంది.
అంతవరకు పరిగెత్తుకు వచ్చిన ఆకుర్రాడు తన
చేతిలో వున్న మువ్వన్నెల పతాకాన్ని పూర్తిగా
విప్పి ఆమె దేహం మీద నిలువు నా కప్పేడు.
ఆ కుర్రాడి కళ్ళ లో నీళ్ళు ధారగా కారుతున్నాయి.
ఎక్కడినుంచో మైకులో ఎవరో నాయకుడి
ప్రసంగం వినిపిస్తోంది.
తమ ప్రభుత్వం వచ్చేక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పేద,బడుగువర్గాల అభ్యున్నతికి
మొదలుపెట్టిన పధకాలు ,వివరాలు గణాంకాలు
గుక్క తిప్పుకో కుండా వల్లిస్తున్నాడు.
అంతవరకు ఆ కుర్రాడిని అనుసరిస్తూ వచ్చిన
స్కూల్ వారు ఆ దృశ్యం చూసి నోట మాట రాక
నిశ్చేష్టులై నిలబడి పోయారు.

Comments

  1. కధలు రెండూ రెండు ఆణి ముత్యాలు..బహుమతి వీటికివ్వడమే సబబుగా ఉన్నది అనిపించేలా ఉన్నాయి కథాంశాలు.ఒక్క మాట మాత్రం రాయకుండా ఉండలేకపోతున్నా.నిడివి చాలా చిన్నగా ఉన్నది రెండు కధల వీ కూడా.రైట్ అప్ లాగా ఉన్నాయనిపించింది..క్షమించండి నా అభిప్రాయము ఇది..శుద్ధ తప్పు కూడా కావచ్చు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.నిడివి నాలుగు అరటావులని చెప్పేరు.

      Delete

Post a Comment