నిశ్శబ్ద సంగీతం

చిన్నప్పట్నుంచీ నాకు శబ్దాలు పడేవి కావు.కాస్త గట్టిగా ,బిగ్గరగా అరచినా,మాట్లాడినా ఒళ్ళు మండేది.

అలా గొంతు చించుకుని అరవాలా ప్రతి దానికి అనిపించేది.
వంటింట్లో గిన్నెలు పడి చప్పుడయినా,
పెనం,మూకుడు వంటి పాత్రలు తోమేటప్పుడు గరుకు వాటితో బరబరా
గీకినా ఆచప్పుడు వినడానికి దుస్సహంగా
వుండేది.
నా యీ అతిసున్నితత్వానికి మా యింట్లో
వాళ్ళు కూడా చికాకు పడేవారు.
టివి,రికార్డర్ పాటలు సౌండ్ ఎక్కువ పెట్టనివ్వనని విసుక్కునేవారు.
నాబాధ పడలేక నేను పనిమీద బయటకు
వెళ్లినప్పుడు వాళ్ళ కి కావల్సిన విధంగా పెట్టుకుని నేను రాగానే తగ్గించి వినేవారు.
ఇలా యింట్లో సాధించినా బయట నామాట వినే నాధుడు లేకపోవడం వల్ల నా సమస్యలు ఎక్కువ య్యాయి.
మేము ఉద్యోగ రీత్యా బెంగాల్ రాష్ట్రంలో
వుండేవాళ్లం.
అక్కడ ప్రతి దానికీ మైకులు పెట్టడం సర్వ
సాధారణం.
సంవత్సరం పొడవునా వచ్చే భోగీ,సంక్రాంతి, హోళి,జ్యేష్ట, ఆషాఢమాసములో వచ్చే అమ్మవారి పూజలు, వినాయక చవితి, ప్రముఖంగా బెంగాల్ వాసులు ఆరాధించే
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు, దీపావళి, కాళీ పూజ, మధ్యలో వృత్తి పనిముట్ల దేవుడు విశ్వకర్మ పూజ యివేకాక పెళ్లి, పుట్టిన రోజు అన్నిటికీ చెవులు దద్దరిల్లేలా
మైకులు లేక పోతే తోచదు.
మా దురదృష్టం కొద్దీ మాకు  కేటాయించిన
రైల్వే క్వార్టర్ పక్కన వున్న మైదానం అందరికీ
సమయానుసారంగా వుపయోగపడుతుంది.
చెవుల్లో దూదులు పెట్టుకుని వున్నా ప్రయోజనముండదు.
ధ్వని కాలుష్యం మిగిలిన వారికన్నా నా పై
తన ప్రభావం విపరీతంగా చూపిస్తుంది.

అప్పటి కీ ఎంత మంది డాక్టర్ లకు నా బాధ
మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
సరే..బెంగాల్ లో హోమియోపతి కి ఆదరణ
ఎక్కువ కదా అక్కడోసారి చూద్దామని కొంచెం
పేరు న్న కుర్ర హోమియో పాత్ ని కలసి నాసొద వెళ్లబోసుకున్నాను.
ఇక్కడ హోమియోపతి డిస్పన్సరి ల గురించి
కొంచెం చెప్పాలి.
సాధారణంగా ఇంట్లోనే ఒక కొట్టుగది ని డిస్పెన్సరిగా మారుస్తారు.
అక్కడ పక్కనె ఒకటో రెండో టేబుళ్లుంటాయి
రోగులకోసం.
చుట్టూ బీరువాల మధ్య డాక్టర్ కుర్చీ, ఎదురుగా టేబుల్, దానిమీద అందంగా వున్న
మందులపెట్టి,దాన్లో రకరకాల చిన్నచిన్న సీసాలు ఏవో గుర్తులు పెట్టి వుంటాయి.
ఒక పక్క లావుపాటి హోమియో ఉద్గ్రంధాలు,మందులు కట్టడం కోసం వీలుగా
తయారు చేసిన కాగితాలు...
ఒక్కో పేషెంట్ ని రకరకాలైన ప్రశ్నలు వేసి, రోగనిర్ధారణ అయ్యాక చెక్కపెట్టి లోవున్న
మందులు తయారు గా వున్న కాయితాల్లొ
కట్టి యిస్తాడు.
ఈ ప్రక్రియ ఒక్కొక్క పేషెంట్ ని చూడటానికి పావు గంట పడుతుంది.
సరే నా వంతు వచ్చేక నాగొడవ విన్నాక,
ప్రశ్నావళి సంధించేడు.
అన్నిటికీ జవాబులు బుద్ది మంతుడయిన
విద్యార్థి లా చెప్పేను.
అంతా విన్నాక ఓ సారి తల గోక్కుని,కళ్ల
జోడు తీసి తుడుచుకుని శూన్యం లోకి
చూసి...
ఇది న్యూరో ప్రాబ్లం అన్నాడు.
ఇదేదో కాన్సర్ అన్నట్లు.
నేను దిగాలుగా అతన్నే చూస్తూ కూర్చున్నాను.
పాల ముంచినా....నీదే భారం అన్నట్లు.
ఎదురుగా వున్న గ్రంథ రాజాల్లో ఒక లావుపాటి పుస్తకం తీసి ,కళ్లజోడు సవరించుకుని అరగంట సేపు చదివేడు.

అంతసేపు నేను గది గోడల బూజులు, వెలిసి పోయి వున్న ఫొటోలు చూసేను.
కాసేపటికి తపస్సమాధి లోంచి లేచిన ఋషి
లా తలెత్తి నన్ను చూసి-
"దొరికింది"
అన్నాడు.
నేను ఆత్రుతగా ఎంసెట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ న్న విద్యార్ది లా అతని వంక చూసేను.
ఇదిగో యిదే మందు అని వేలితో పుస్తకంలో
చూపించేడు.
ధెరిడియన్ 200
దాని కింద రోగ లక్షణాలు, దాని నివారణ రాసుంది.
సరిగ్గా నాకు సరిపోతుంది.
లేచి పక్కనేవున్న బీరువా లోంచి వెతికి ఒక
చిన్న సీసా నాకు చూపించి నోరు తెరవమని
ఒక రెండు చుక్కలు నాలిక పైన వేసాడు.
కొంచెం భగ్గు మంది.
"మైకు పెట్టి న రోజు యీ మందు రెండు చుక్కలు నాలిక పైన వేసుకుంటే నీకుయిక
సౌండ్ ఫోబియా వుండదు.
అయితే యీ మందు త్వరగా హరించుకు
పోతుంది కాబట్టి నిలవ వుంచుకో బడదు.
అవసరమైన ప్పుడు ముందుగా కొని
దగ్గర పెట్టుకో"

అని చెప్పి సీసా నా కిచ్చేసి ఫీజు తీసుకుని
తర్వాత పేషెంట్ ని అటెండయ్యాడాయన.
హమ్మయ్య
ఇన్నాళ్లకి నా సమస్య తీరింది.
చాలా హుషారుగా యీల వేసుకుంటూ
జేబులో సీసాని అదిమి పట్టుకుని యింటి
దారి పట్టాను.

ఇంటి కొచ్చేసరికి పెద్ద గొంతు లో పాటలు
వినిపించాయి.గమ్మత్తుగా నాకాశబ్దం చికాకు పెట్టలేదు.మందు పని చేసినట్టేనన్నమాట.
నేనింట్లో అడుగు పెట్టగానే వాల్యూమ్‌
తగ్గించబడింది.
నేను నవ్వుతూ_"ఫరవాలేదు. మీక్కావలసిన
వాల్యూమ్ లో వినండి."అన్నాను.
అందరూ నావేపు ఆశ్చర్యకరంగా చూసేరు.
అప్పుడు సావధానంగా వాళ్ళ కి జరిగింది వివరంగా చెప్పేను.ఇపుడు నాకెలాంటి  ఇర్రిటేషన్ శబ్దం వల్ల కలగలేదని అన్నాను.

అందరూ నాతో పాటు సంతోషించారు.

ఇంతలో బయటనుండి "పోస్ట్"
అన్న కేక వినిపించింది.
బయటకు వచ్చి పోస్ట్ మేన్ యిచ్చిన కవరందుకున్నాను.
కవర్ చింపి పేపర్లు బయటకు తీసి చదివేను.
అది నా అపాయింట్మెంట్ ఆర్డర్.
రైల్వే లో అనౌన్సర్ గా రైళ్ళ రాకపోకలు చెప్పే
వుద్యోగం.

Comments