చిట్కా

అవేళ తెలిసిన వాళ్ళు ఫ్లాట్ తీసుకున్నారంటే గృహప్రవేశం కి వీలుపడక మా వీలు చూసుకుని ఆరోజు వెళ్లాం.
ఇల్లు బావుంది.
నాకైతే ఇండిపెండెంట్ గా వున్న ఇల్లే నచ్చుతుంది..
కానీ ప్రస్తుత పరిస్థితులు ను బట్టి ఫ్లాట్‌ కే వోటెయ్యక తప్పదు.
గాలీ,వెలుతురు ధారాళంగా వస్తునాయి.
లిఫ్ట్ వుంది.
నీటి యెద్దడి లేదు ట.
మరింకేం.
చుట్టుప్రక్కల చిన్న చిన్న దుకాణాలు, కూరగాయలు దొరుకుతాయి.
ఇల్లంతా చూసేము.
అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి.
హాల్ మధ్య లో కేన్ వుయ్యాల..
బాల్కనిలో తులసి కోట తో పాటు గులాబీ, మందార ,క్రోటన్ మొక్కలు గోలెంలో..
దేవుడు గది కూడా చూడముచ్చటగా వుంది.
పెద్ద సైజు టేకువుడ్ కేబినెట్ లో వివిధ దేవతలు సర్వాలంకారభూషితులై కొలువుదీరి వున్నారు.
కొంచం పిచ్చాపాటి అనంతరం ఇంటావిడ సైగ నర్దం చేసుకుని యింటాయన లేచేడు.
కొక్కానికి తగిలించిన సంచి పుచ్చుకొని
"ఇప్పుడే వస్తాను"
అంటూ బయల్దేరాడు. బయటకు వెళ్లకుండా దేవుడి గదిలో దూరి క్షణం లో బయటకు వచ్చి ,మా వంక చెయ్యూపి కనుమరుగయ్యాడు.
నాకు సందేహం ..
దేవుడికి దండం పెట్టు కోవడానికి వెళ్లుంటాడా?
ఏదో పనున్నట్లు లేచి నడుస్తూ దేవుడు గదిలోకి తొంగి చూసేను.
అప్పుడు కనపడిందది.
దేవుడి కేబినెట్ పక్కనే బ్లాక్ బోర్డు.
ముందు చూసినప్పుడు పట్టించుకోకుండా వదిలేసాను దాన్ని.
ఆశ్చర్యకరంగా దానిపై సామాన్ల లిస్ట్ రాసుంది.
ఏ స్తోత్రాలో,సూక్తులో రాయకుండా దేవుడు గదిలో సామాన్ల లిస్ట్ ఏమిటి చెప్మా? అనుకున్నాను.
సరే..
నాకేదైనా సందేహం వస్తే తీరేవరకూ నిద్ర పట్టదు...
పుట్టుకతో వచ్చిన బుద్ది మరి..
ఆయన వచ్చాక నా సందేహం వెలిబుచ్చాను.
ఆయన చిన్నగా నవ్వి-
"అయ్యా!వయసు పెరిగే కొద్దీ మనకు మతిమరుపు రావడం సహజం.
చెప్పిన సామాను తేకపోతే వాళ్లకిబ్బంది.
అందువల్ల మనకి రెండోసారి ఏ కరివేపాకు కోసమో వెళ్లక తప్పదు.
అందువల్ల మేము రాత్రే మర్నాడు అవసరం అనుకున్న సామాన్ల,పన్ల లిస్ట్ ఆ బ్లాక్ బోర్డు మీద రాసి,యిద్దరం ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటాము.
పొద్దున్నే బజార్ కెళ్లేముందు దేవుడుకో దణ్ణం పెడ్తూ పనుల వివరాలు చూసుకొని ఆ ప్రకారం....
మరో విషయం..
పెళ్లిళ్లు,బాలసారలు,అన్నప్రాశన లు,వడుగులు తేది లు కూడా రాసుకుంటే మరి మర్చిపోయే బాధుండదు.ఒకసారి దెబ్బతిన్నాం లెండి..."
బావుంది కదూ!

Comments