అడ్డం తిరిగిన కథ

శుక్రవారం--పోస్ట్ కార్డ్ పోస్ట్

అడ్డం తిరిగిన కథ
@@@@@@@@

నాకు తెలిసినాయన ఇంద్రలోక్ హాస్పిటల్ లో చేరారని చూడ్డానికి విజిటింగ్ అవర్స్ లో వెళ్లేను.
కార్పొరేట్ హాస్పిటల్ నీటుగా ధగధగ మెరిసిపోతోంది నాకేం కొరత అన్నట్టు.

ఆయనేవార్డులో వున్నారో రిసెప్షన్ లో కనుక్కుని అటెండర్నడిగి లిప్టులో రెండో అంతస్తు చేరాను
దేవకన్యల వంటి నర్సులు యూనిఫాం లో మిసమిస లాడుతూ తిరుగుతున్నారు.పెద్ద
డాక్టర్లు కూడా కుబేరపుత్రుల్లా 
హడావుడి గా ,కాస్త గంభీరంగా అక్కడ క్కడా కనపడుతునారు.
కుర్ర డాక్టర్లు తెల్లకోట్లేసుకుని కొత్తగా చలామణిలో కొచ్చిన రెండువేల రూపాయల నోట్లలా ఫెళఫెళ్లాడుతూ తిరిగేస్తునారు.

డబ్బున్న మారాజుల్లాటి పేషెంట్ లు ..కళతప్పిన లక్ష్మీపుత్రుల్లా బెడ్ లపై నీరసంగా పడుకున్నారు.
మందులు,పూలు,పళ్ల వాసనలు కలగలిసిన గమ్మత్తు పరిమళాలు వెదజల్లుతున్న వాతావరణం నిజంగానే యింద్రలోకాన్ని తలపింపజేస్తోంది..
వాకబు చేస్తూ ఆయన పడుక్కున్న బెడ్ చేరాను.
అప్పటికే వాళ్లవాళ్లు,బంధువులు, స్నేహితులు చుట్టూ వున్నారు.
నిలబడ్డానికి కూడా జాగా లేదు.
ఓ సారి చెయ్యూపి,హాజరు వేయించుకుని,చుట్టూ కలయజూసాను.
అన్ని బెడ్ల దగ్గరా యీగల్లా జనం.
అయితే చివర మూలనున్న బెడ్ దగ్గర యెవరూ లేరు.
ఆయన మాటిమాటికీ కళ్లువిప్పి చూసి మళ్లీ నిరాశగా కళ్లు మూసుకుంటున్నాడు.
నాకు జాలి కలిగింది.
అప్రయత్నంగానే అటువేపు నడిచాను.
నా అలికిడికి కళ్లు తెరచి నా వేపు చూసాడాయన.
"మీ వాళ్లెవరూ రాలేదా?" అన్న నాప్రశ్నకి  గట్టుతెగిన ఆయన మాటల సారాంశం..
అతని కొడు,కోడలు,మనవడు వున్నార్ట.కానీ యెవరూ తనని పట్టించుకోరట.యేవేవో చేప్తునేవున్నాడు..
అంతలో వాళ్ల అబ్బాయి వచ్చేడు.
గబగబ తండ్రి దగ్గర కు వచ్చి తనకట్టే సమయం లేదని యెక్కడికో వెళ్లాల్సుందని మాటిమాటికీ వాచి చూసుకుంటూ ముళ్లమీద నిల్చున్న వాడ్లా బయలు దేరి వెనుతిరిగాడు.
నాకెందుకో అతనికి బుద్ధి చెప్పాలనిపించింది.
నేను అతని వెనక బయలుదేరి అనుసరించేను.
లిప్ట్ దగ్గర అతన్ని ఆపి ఆవేశంగా నేననదల్చుకున్న నాలుగు మాటలు అనేసాను.
అతను మాటాడకుండా నా మాటలు విని,యిలా అన్నాడు
"సర్..అతను మా నాన్న కాదు.యెవరో మతి పోయిన మనిషి.రోడ్డు మీద నా స్కూటర్ కి అడ్డం పడితే నేను తీసుకు వచ్చి యిక్కడ అడ్మిట్ చేసేను.
అతని మాటలు బట్టి అతనికి మతిస్థిరం లేదని తెలిసింది..
వాళ్ల వాళ్ల ను వెతికేందుకే యిప్పుడు వెళ్తునాను"
నేను నిరుత్తరుడినయ్యాను.

Comments