భయం

శుక్రవారం పోస్ట్ -4  భయం

వనజ నూటపదోసారి విసుక్కుంది.
అన్నయ్యని తోడుగా తీసుకు రానివ్వని పరిస్థితులను తిట్టుకుంది.
ఇంకో గంటలో కాలేజ్ చేరాలి.పరీక్ష మొదలు కాకుండా చేరాలి.
తనతో తోడుగ వచ్చే మంజులకు వంట్లో బావులేక పోవడంతో వంటరిగానే తనకు వెళ్ళవలసి వస్తోంది.
ఇంటి నుంచి కాలేజ్  గంట దూరంలో వుంది.
రోజూ వెళ్ళే బస్ తప్పిపోయింది. ఆటో వాళ్ల సమ్మె కారణంగా ఆటోలు నడవడం లేదు.
తొందరగా నడుస్తోంది.
వెనకాల అడుగుల చప్పుడు..
వెనక్కి చూసేసరికి ప్రాణం పోయినంత పనయింది.
ఆరడుగుల పొడవు.. దట్టమైన గడ్డాలు,మీసాలు,ఎర్రని కళ్లు..రౌడీ వెధవలా వున్నాడు.
నగరంలో జరుగుతున్న అత్యాచారాలన్నీ కళ్లముందు గిర్రున తిరిగాయి.
గబగబ నడవసాగింది.
అడుగుల చప్పుడు కూడా అనుసరించి వస్తోంది.
దార్లో నిర్జనంగా వుండే సందులో మీద పడితే...
చిన్నప్పుడే కరాటే నేర్చుకోమని పోరు పెట్టిన అన్నయ్య మాటలు విననందుకు లక్షసార్లు తనని తాను తిట్టు కుంది.
తల్లి వయసులో రంభలా వుండేదట.వయసుపైబడ్డా యిప్పటికీ ముసలి లెదా ప్రౌఢ రంభ లాగే వుంటుంది.
తను కూడా తల్లి పోలికే.
అందుకే తండ్రికి, అన్నకీ భయం.
చిన్నప్పట్నుంచీ తోడు లేకుండా యెక్కడికీ పంపేవారు కాదు.
మనుషులు పలచగా అక్కడక్కడా కనిపిస్తునారు.
ప్రియాంకా రెడ్డి,నిర్భయ,టేకు లక్ష్మిలు కనిపిస్తునారు.
గుండెల్లోంచి వణుకొస్తోంది.
క్షేమంగా తను యింటికి చేరగలదా!
కనిపించని వేనవేల దేవతలకి యిష్టానుసారం మొక్కుకుంది.


సందు దగ్గర పడుతోంది.
పరుగులాంటి నడకతో సందు దాటేసి 'అమ్మయ్య'
అనుకుంది.
వెనక్కి తిరిగి చూసింది..
పదడుగులదూరంలో తన వంకే నవ్వుతూ చూస్తున్న యెర్రకళ్లు.
కసితీ రా తిట్టుకుంటూ గబగబ నడచి కాలేజ్ గేట్ లోకి ప్రవేశించింది.
అప్పటికి కుదుపడి హాయిగా వూపిరి పీల్చు కుంది.
తన గేటు లోకి దూరిన వెంటనే వెనక్కి తిరిగాడా యెర్రకళ్ల గడ్డాల బూచి.
మూడు గంటలు గడిచాక-
పరీక్ష రాయడం పూర్తయిన తరువాత బయటకు వచ్చిన వనజ కు కనపడ్డాడు వనజ అన్నయ్య బైక్ తో సహా.

నవ్వుతూ వెళ్లి బైక్ యెక్కింది.
దార్లో తనని వెంబడించి న గడ్డాల బూచి గురించి చెప్పగానే వనజ అన్నయ్య నవ్వుతూ-
" వచ్చాడా! వాడు నా ప్రెండే..నాకివాళ వీలుకాక  వొక్కతీవి వెళ్లాల్సి వస్తుందని వాడ్ని నీ బాడీ గార్డ్ గా పంపేను".
అన్న మాటలు విని నిర్ఘాంతపోయింది వనజ.

Comments