రావిచెట్టు

రావి చెట్టు( నా ఖరగ్పూర్ జ్ఞాపకాలు)
@@@@
కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగినా చాలా ఆశ్చర్యకరంగా వుంటాయి. వాటికి హేతువు వెతికి పట్ట్టుకోలేము.
అలాంటిదే 1970 లనాటి యీ సంఘటన.
మా రైల్వే క్వార్టర్ లో నా చిన్నప్పుడు పెద్ద రావిచెట్టు యింటి పక్కనే  వూడలతో సహా  వెడల్పు గా విస్తరించి వుండేది.

ఆ చెట్టు పక్కనే మరో క్వార్టర్.. అందులో యూపీ వాళ్ళు పిల్లజెల్లాతో పెద్ద కుటుంబం కలిసే వుండీవారు.
ఆ జనాభాకి తోడు ఆవులు..దూడలు..
వాటికోసం పెరట్లో పాక..
వీళ్ల కోసం పార్టి షన్ తో పెద్ద హాలు లాంటి గది.
అయితే ఆగది,పాక రావి చెట్డు నానుకొనే వుండేవి.
ఎండాకాలం విస్తరించి న కొమ్మల నీడ హాయిగానే వుండేది.
పిల్లలంతా చెట్టు దగ్గర అడుకునే వాళ్లం.
శిశిరం లో రాలిన పండుటాకులు వూడ్చి పోగుచేసి, పుల్లలు వేసి చలిమంటలు వేసుకునే వాళ్లం.
వసంతంలో బోడిగా మారిన చెట్టు లేత ఆకుపచ్చ ఆకులు వంటినిండా తొడుక్కుని కనులకింపుగా వుండేది.
అయితే మేము పెద్ద వాళ్లమయ్యాక వొకసారి కురిసిన వానకు,తుపాను కు అ చెట్టు కొమ్మ విరిగి పడి యూపీ వాళ్ల హాలు పై కప్పు ధ్వంసమయింది.
ఎవరికి దెబ్బలు తగల్లేదు కానీ వాళ్లు బాగా భయపడి పోయారు.
అయితే వాళ్లు వేలిముద్రల వాళ్లవడం వల్ల వాళ్లకేమయినా దరఖాస్తులు కావలసివస్తే మా నాన్న గారు వ్రాసిపెట్టేవారు.
ఆయన హడావుడి గా మానాన్న గారి దగ్గరకు వచ్చి
పరిస్థితి వివరించి చెట్టు కొట్టేయించమని రైల్వే వారికి దరఖాస్తు పెట్టమన్నాడు.
మా నాన్నగారు సరేనన్నారు.
ఆయన అదే సంవత్సరం రిటైరవుతారు.
అప్పటికే బిపి,సుగరు తో బాధపడుతున్నారు.
రైల్వే అధికారులు దరఖాస్తు రాగానే మనుషులను పంపేరు.
వాళ్లు వచ్చి ముందు విస్తరించి వున్న కొమ్మలు కొట్టడం ప్రారంభించారు.
అదే రోజు సుగర్ వ్యాధి యెక్కువై మా నాన్న గారు రైల్వే ఆస్పత్రిలో చేరారు.
మొత్తం చెట్టు పూర్తిగా కొట్టడానికి వారం రోజులు పట్టింది.
ఈ వారం లోగా మా నాన్న గారి పరిస్థితి విషమించి ఆయన పాదాన్ని తొలగించడం జరిగింది.
ఆ కోమా లోనే ఆయన పోయారు.
అతని దేహాన్ని యింటికి తీసుకు వచ్చిన రోజే చెట్టు మొదలు కూడా తొలగించడం యాదృచ్చికంగా జరిగింది.

ఇన్నేళ్లయినా అప్పటి దృశ్యాలింకా సజీవంగా కళ్లముందు మెదుల్తునే వున్నాయి.

Comments