రంగు క(వ)ల

శుక్రవారం పోస్ట్-10

 రంగు క (వ)ల
@@@@@@@@
నే వెళ్లేసరికి వీరభద్రం నరసింహావతారం లో వున్నాడు.
'ధూం ధాం 'లాడుతునాడు.
ఏమైందనడిగాను.

"మరడక్కు.అందరూ చిన్న పిల్లలు..నేను మాత్రం అందరికీ తాతని..అంకుల్ని..వెధవ్వేషాలు కాకపోతే చిన్న పిల్లలు అంకులని పిలిచారంటే అర్దముంది.ఏభై యేళ్ల వాళ్లకి, మనవల్నెత్తుకు తిరిగే వాళ్లకి కూడా అంకుల్నేనా?
ఫ్లాట్ లోవున్న వయసు మళ్లిన ఆడవాళ్లు కూడా అదే కూత.సుబ్బరంగా పేరు పెట్టి పిలవొచ్చుగా.
రిటైర్ అయిన వాళ్లందరూ ముసలాళ్లేనా?
బట్టతల,బానపొట్టా,నెరిసిన జుత్తు  అంకుల్ కి కొలమానాలా?"

వాడి వాలకం చూస్తే భయం పుట్టింది.
"సర్లేరా..ఇప్పుడేమయిందని.."
వాణ్ణి శాంత పరిచే ప్రయత్నం చేసాను.
"అసలీ అంకులాంటీ పిలుపుల్ని బేన్ చేసి పారీయాలి." బుసలు కొడుతూ అన్నాడు.
"సరే పద.అలా బయటకు వెళ్దాం" అంటూ జబర్దస్తీగా లాక్కు వెళ్లాను.

దారి పొడుగునా సణుగుతునే వున్నాడు.

అగ్నిహోత్రావధాన్లు లా మండిపోతునేవున్నాడు.

"నాకేం బట్టతలా?బానపొట్టా?
చెంపల దగ్గర కాస్త నెరిసిందంతే.ఆఖరికి అపార్ట్మెంట్ ప్లంబరు,వాచ్మన్ కూడా 'అంకుల్సారం'టారు.
ఛఛ..యీ మనుషులు మారరు."

"రంగేసుకోరాదూ"
...అనబోయా.

"ఆగక్కడ..ఆ రంగులు..దండగలు నాకు గిట్టవు.."

అంతలో 'ధబ్ 'మన్న శబ్దం వినిపించింది.
వెనకాల వస్తున్న పల్లెటూరి ముసలాయన సైకిల్ బేలన్స్ తప్పి మా అగ్నిహోత్రావధాన్లు కాళ్ల మధ్య దూరిపోయింది.

పెద్దగా దెబ్బలవీ తగల్లేదు గానీ
సైకిలాయన దండం పెట్టి అంటాడు
"సారీ!అంకుల్సారూ!"

"పర్లేదు తాతా.వయసొచ్చేక కళ్లు దెబ్బతింటాయి ట్రాఫిక్ లో .జాగ్రత్త"
అన్నాడు వీరభద్రం.

ఆ మాటకి యెక్కడ్లేని పౌరుషం తో,కోపంగా-
"సాల్సాసేలోవో! నా కళ్లకేటయింది.వుప్పుడు కూడ అద్దాల్నేకండా సూదిలోకి దారం యెక్కీంచిగల్ను.
ఏతనుకుంటునావేటో!"
అని రయ్యి మంటూ సైకిలెక్కి ఝామ్మని వెళిపోయాడు.
" చూసేవా..వాడిక్కూడా ముసిలాడి వనగానే కోపం వచ్చింది. "
తలాడిస్తూ-"నిజమేనోయ్..వున్న మాటంటే వులుకెక్కువంటారు..."అయినా నాకో సంగజ్జెప్పు.
నువ్వసలు వాళ్ల మాటలకి అంతలా రియాక్ట్ అవటం దేనికి?
నిజానికి మనం వయసు మళ్లిన వాళ్లమే గదా!
ఇపుడు కొత్తగా కుర్రాడిలా పిలిపించుకోవడం సాధ్యమెలా అవుతుంది.
అయినా నీకు పెద్దరికమిచ్చి గౌరవిస్తునపుడు బాధ పడ్డం సబబా!

"వెళ్లవయ్యా..అదంతా నాకు తెలుసు.. నా బాధ..నాకన్న ఐదారేళ్లు చిన్నవాళ్లు కూడా నన్ను అంకుల్ అనడమే."
అప్పుడు నేనన్నాను.-

"నీకో విషయం చెప్పనా!
మా వియ్యపురాలు ,మనవరాల్తో పాటు నన్ను కూడా తాతగారు అనే సంభోదిస్తూ-
"మరేం అనుకోకండి.నాకు తాతగారు ముచ్చట చిన్నప్పుడు తీరలేదు.అందుకే మనవరాల్తో పాటు మిమ్మల్నీ అలాగే పిలుస్తాను" అన్నారు.
పిలుపులో అంత పట్టించుకోడానికేముంది చెప్పు." అన్నాను.
మావాడు నా వంక ఆశ్చర్యంగా 
చూసేడు.

మళ్లీ యింటిదారి పట్టేవరకు సముదాయిస్తునే వున్నాను.
కలర్ చేసుకోమని మరోసారి హెచ్చరించేను.

వారం గడిచాక మళ్లీ వాడింటికి వెళ్లినపుడు వాడు నన్ను చూసి భోరుమన్నాడు.
ఏమైందంటే-
నా సలహా ఆచరించి చూద్దామని గార్నియర్ డై తెప్పించి, శుభ్రం గా వేసుకుని,చక్కగా తయారై వరండాలో కూర్చుని పేపర్ చదువుతుంటే, బట్టలార వేయడానికి బయటకొచ్చిన యాభై యేళ్ల వనజాక్షి పొన్నుదురై -
"ఏంటంకుల్ పొద్దున్నే సంక్రాంతి కొత్త అల్లుడ్లా తయారయి కుర్చున్నారు" అని కిసుక్కున నవ్విందట.
'ఫస్ట్ యింప్రెషన్ ఈజ్ ది బెస్ట్ యింప్రెషన్.'
వీరభద్రుడి వేదన వర్ణనాతీతం.

నీతి:రంగులు,పూతలు,ముసుగులూ లేకుండా వయసుకు తగినట్టు హుందాగా వుంటే సమస్యలే వుండవేమో!

Comments