బతుకు పాఠం

శుక్రవారం పోస్ట్- 11

"బతుకుపాఠం
@@@@@@

"కొన్ని పాటలు కొన్ని గాత్రాల్లో వింటూ వుంటే మనకు తెలియకుండా నే కళ్లమ్మట నీళ్లు ధారగా కారిపోతుంటాయి.
ఆ మాధుర్యానికి లేదా గాత్రానికి..సాహిత్యానికి..అందులో భావ సౌందర్యానికి మన మనసు ఆర్ద్రత తో నిండి కళ్ల వెంట భాష్పాల రూపంలో ప్రవహిస్తాయి.
అలాగే అపూర్వమైన నటన చూసినా కళ్లు చెమరుస్తాయి.
మనిషిలో విభూతి యే రూపంలో పరాకాష్ఠ కు చేరినా యీ అవస్థ తప్పదు.
అందుకే సినిమా లో,టివి నాటకాలు చూస్తూ మనవాళ్ళు జీవించేస్తారు..వాళ్ల కష్టాలు..బాధలు తమకే అపాదించుకుని తెగ ఫీలవుతారు." సుబ్బారావు మాటలు చెవిలో పడుతునాయి.

పద్మారావు నగర్  పార్కులో కూర్చున్నాం యిద్దరం. 
సుబ్బారావు కథల్రాస్తాడు.
నాతో తన కథల గురించి చర్చిస్తాడు.
నాకున్న పరిజ్ఞానంతో నాకు తోచిన సలహాలు చెప్తాను.

ఆ సందర్భంలో పై స్పీచ్ యిచ్చేడు.
నేను పరధ్యాసగా వూకొడుతునాను.
"ఈ ధూర్జటి మాహా గడుసు వాడోయ్.చెయ్యాల్సిందంతా చేసి యింకా తమకం తీరక రోసీరోయదు...అంటూ శివుడి కాళ్లట్టీసుకున్నాడు,తన కోరికల్ని నాశనం చెయ్యమని..."
కాని నా చూపంతా ఎదురు బెంచీ మీద కూర్చున్న పదేళ్ల కుర్రాడి మీద వుంది.
వాడు వెక్కుతూ చదువుతునాడు.

పార్క్ లో అందరూ యెవరి గోలలో వాళ్లున్నారు.
బానపొట్ట అంకులాంటీలు సిమెంట్ చప్టా వాకింగ్ పాత్ మీద రకరకాల విన్యాసాలతో జాగింగ్ చేస్తునారు.
ముందు రాత్రి పార్క్ బెంచీ కింద యీనిన నల్ల కుక్క పిల్లలు ఒకదానిపై వొకటి యెక్కి పాలకోసం దాని పొదుగు మీద దాడి చేస్తునాయి.
సంఘసేవిక యెవరో బన్నులు,పాల పేకట్ పట్టుకు నించుని వాటిని అదలిస్తోంది .
మధ్య మైదానం లో యోగా టీచర్ స్థూలదేహులకు సూక్ష్మయోగాన్ని నేర్పుతునాడు.
మరొకాయన అదేపనిగా రామ్దేవ్ బాబా ప్రాణాయామాన్ని తన పద్దతి లో ఆచరిస్తు నాడు
ఇంకొకాయన చేతులు పక్క వాళ్ల మొహాలకు తగిలేంతగా పైకి విసుర్తునాడు.
సుగర్,బీపీ లు తగు మాత్రపు ఖర్చుతో చూసేందుకు,అవసరమైన సామగ్రి తో బల్ల పెట్టుకున్న మనిషి, వచ్చేపోయే వారిని గమనిస్తు నాడు.
పార్క్ బయట కొర్రలు,రాగులు,జొన్నలు,సిరి ధాన్యాల వర్తకుడు ఆరోగ్యం కాపాడుకోమని మైకులో హెచ్చరిస్తునాడు.

ఆ కుర్రాడి తల్లి దగ్గర కొచ్చి యేదో బతిమాలుతోంది.
వాడు బుర్ర అడ్డంగా వూపుతునాడు. 

ఉండబట్టలేక ,సుబ్బారావు తో కలసి సంగతి తెలుసు కుందామని వెళ్లేము.
మామూలు కథే.
ఆమె పనిమనిషి.. మొగుడు తాగుబోతు.. పిల్లడికి చదువు పిచ్చి..
ఇంట్లో రోజూ యుద్ధం..
చదువు మీద కుర్రాడి శ్రద్దకు సుబ్బారావు కళ్ళు చెమర్చడం ..
అప్రయత్నంగా జేబులో దూరిన చెయ్యి ఐదు వందల నోటు తీయటం జరిగాయి.
నేను కూడా నావంతు గా రెండు వందల నోటు తల్లి కిచ్చి వాడిని గవర్నమెంట్ బడిలో చేర్పించమని , వాడి చదువు యెట్టి పరిస్థితి లోను ఆపొద్దని చెప్పి పంపేము.చుట్టూ చేరిన జనాలు కూడా యధాశక్తి చెయ్యి వేసేరు.

@@@@
మర్నాడు మాసుబ్బడికి రవీంద్రభారతి లో పుస్తకావిష్కరణ వుందంటే అఫీసు నుంచి కాస్త ముందుగా వచ్చి, మావాడి కోసం యెదురు చూస్తూ పబ్లిక్ గార్డెన్ లో కూర్చుని చూస్తుంటే  కనపడ్డ దృశ్యానికి కళ్లు తిరిగాయి.
అక్కడ కొద్ది దూరంలో నిన్న పద్మారావు నగర్ పార్క్ లో కనపడ్డ తల్లీకొడుకులు.!!
కొడుకు యేడుస్తూ చదువుతుంటే...తల్లేదో సముదాయిస్తోంది..
జనాలు మెల్లిగా వారికి దగ్గరిగా వస్తుండటం కనపడింది.

Comments