జ్ఞాన బోధ

"శుక్రవారం పోస్ట్-12
జ్ఞానబోధ.
@@@@#

"మా అమ్మావాళ్లిలాగే వుండే వార్రా!"
అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్న కృష్ణుళ్లా మొహం పెట్టేడు బుజ్జి.

అర్జునుడి ...అదే విస్సు గాడి మొహం పాలిపోయి వుంది.
ఇద్దరూ పెరట్లో బెంచీ మీద కూర్చున్నారు.
"మొన్న మా అమ్మ పక్కన పడుకోనివ్వలేదురా మా నాన్న .. నిద్దర్లో కాళ్లతో పొట్ట మీద తంతానని..."

"అప్పుడే యేమయింది..అదో,వాడో రానీ..మనకెవరూ ముద్దు కూడ చెయ్యరు."
విస్సి గాడు యేడుపు మొహం పెట్టేడు.

విస్సిగాడికి ఏడేళ్ల ప్పుడు వాళ్లమ్మకి రెండవ కాన్పు వచ్చింది.
నెలలు నిండాయి.
ఇవాళో రేపో అన్నట్టుంది.
ఈ శిఖరాగ్ర సమావేశానికి అదే కారణం.
కొద్ది రోజులుగా విస్సిగాడికి తన పట్ల పెద్దల ప్రవర్తన లో మార్పు కనపడుతోంది.
అమ్మని పూర్వంలా ఎప్పుడు పడితే అప్పుడు కావిలించుకోనివ్వటం లేదు.
'దూరం..దూరం..'.అని గదమాయిస్తునారు.
అన్నం కూడా అమ్మమ్మ కలిపి పెడుతోంది.
ఏదేనా అడిగితే_
"నీ కెందుకురా! భడవకానా!" అని దాటేస్తుంది.
నాన్న కూడా ఆఫీసు నుంచి రాగానే అమ్మ దగ్గరే కూర్చొని కబుర్లు చెప్తాడు.
పూర్వం తన స్కూల్ విశేషాలన్నీ అడిగి మరీ తెలుసుకునీవాడు.
మళ్లీ దుఃఖం వచ్చింది వాడికి.
కళ్లెర్రగా వున్నాయి.వాటి నిండా కారడానికి  సిద్దంగా నీళ్లు...
ఎమైనా తన ప్రాముఖ్యత యింట్లో బాగా తగ్గిపోయింది..
ఎంతసేపు వచ్చేవారికి స్వాగత సత్కారాలు చెయ్యడం లో బిజీ గా వున్నారంతా.
కృష్ణుడు మళ్లీ నోరు విప్పేడు.
" మా వాళ్లు కూడా కిందటి సంవత్సరం మా తమ్ముడు పుట్టినప్పుడు యిలాగే చేసారు.
పుట్టేక వాణ్ణి ముద్దు చేస్తారు.
మన మాట వినే వినరు."

విస్సిగాడికి పుట్టబోయే తమ్ముడు మీద కోపం వచ్చింది.
ఇంకా రాకుండానే తనని సాధిస్తునాడు.
ఏం చెయ్యాలి?
"విస్సూ" అమ్మమ్మ గొంతు విని, యిద్దరు లేచి యిళ్ల వేపు నడిచారు.

ఆ రాత్రి విస్సు అన్య మనస్కంగా వున్నప్పుడు నాన్న పిలుపు వినిపించింది.
లేచి గదిలోకి నడిచాడు.
తల్ఇ మంచం మీద పడుకుని తన వైపు నవ్వుతూ చూస్తోంది.
నాన్న కూడా నవ్వుతునాడు.
తను దగ్గరకు రాగానే యెత్తుకుని,అమ్మ పక్కన కూర్చోబెట్టాడు.
తన స్కూల్ వివరాలు అడిగాడు.ఆఫీసునుంచి తనకోసం తెచ్చిన టాయ్ గన్ చూపించాడు.
విస్సుకి లాటరీ దొరికినట్లుంది.
అన్నీ మరచిపోయి తన తల రాస్తూ మాటలు వింటున్న తల్లి పొట్టపై చెయ్య వేసాడు.
నాన్న యేం అన్లేదు.
" విస్సూ! రేపు మనింటికి చిన్న పాప వస్తుంది కదా..మరి నువ్వు పెద్ద వాడివికదా..నీకు యెన్నో తెలుసు..వాళ్లకి కొత్తకదా..నువ్వు వాళ్లతో చక్కగా ఆడు కోవాలి.. వాళ్లకి యెలా వుండాలో నేర్పించాలి..
యేడుస్తే వూరుకోబెట్టాలి.
నువ్వలాచేస్తే నీకు సర్ప్రయిజ్ గిఫ్ట్ యిస్తాను...సరేనా"
అసలే సంతోషంలో వున్న విస్సు అన్నిటికీ తలవూపేడు..
పక్కకు తిరిగిన తన తండ్రి కళ్లు తుడుచుకోవడం కూడా గమనించ లేదు.
తల్లి కళ్లలో ప్రేమ నీటి రూపం లో ధారగా కారిపోసాగింది.
వాడికి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుంది.

వీళ్ల గీతోపదేశ కార్యక్రమం తండ్రి చాటుగా విన్న సంగతి విస్సుబాబుకెప్పుడూ తెలియదు.

Comments