శుక్రవారం పోస్ట్-14

అనాధ ప్రేత సంస్కారేణ..

షరాఫ్ ఖానావారి  వీధిలో పెద్ద అరుగుల యెడమ వేపు యింటి అరుగుల మీద కూర్చున్నారు జోగిశాస్త్రి,సుబ్బావధాన్లు పిలుపుల కోసం యెదురుచూస్తూ.
ఇద్దరికీ చదువు వంటబట్డలేదు.
పోనీ నాలుగు మంత్రాలు నేర్చుకున్నా పౌరోహిత్యం చేసుకు బతుకుతారని యింటి వాళ్లు నాగం భట్టు దగ్గర శిష్యరికం చెయ్యమన్నారు.
కానీ ఆ సంస్కృత పదాలు
రెల్లి వాళ్లతో సహవాసం చేసే వీళ్లకి కొరక బడలేదు.
'మీ ఖర్మ'
అన్జెప్పి తద్దినం భోక్తల కింద వీళ్లని నియోగిస్తూ చిన్నాచితకా   పన్లవీ తన అద్వర్యంలో చేయిస్తునాడాయన.

ఆ రోజు మహా శివరాత్రి.
ఆయన చాలా బిజీ గా వున్నాడు.
రుద్రాభిషేకం చేయించడానికి స్థానిక ఎమ్మెల్యే రమ్మన్నాడు.
భారీ దక్షిణ వుంటుంది.
జోగీ,సుబ్బు లిద్దరూ వీధి వేపే చూస్తునారు.
ఆపక్క మరొకాయన జంధ్యాలు వడుకుతునాడు.
వీళ్లిద్దరికీ ఆ విద్య కూడ పట్టుబడలేదు.
ఇద్దరికీ నిరీక్షణ మహా విసుగ్గా వుంది.
తమ మీద తమకే కోపంగా వుంది.
రోడ్డు మీద జనాల్నందర్నీ ఆకారణంగా కొట్టవతల పారీయాలనుంది.
తమనిలా పుట్టించిన దేవుణ్ణి కడిగీయాలనుంది.
ఎవరో వచ్చారు.
"జోగి నాధం బాబు,సుబ్బాబు మీరేనా?" అడిగాడు వచ్చినాయన.
".మేమే,"
మీరిద్దరూ దాసన్న పేట రాజారావు గారింటికి వెళ్లండి.వాళ్ల నాన్న గారు పోయారు. మోయడానికి యిద్దరు తక్కువగా వుంటే మీ గురువుగారు మీ యిద్దరినీ వెళ్లమన్నారు. 
వెంటనే బయలుదేరి వెళ్లండి.
అక్కడ శ్మశానంలో మీ పనయ్యాక పేరిశాస్త్రి గారు మీ యిద్దరి కీ వెయ్యి రూపాయలిస్తారు."
అన్చెప్పి వెళ్లిపోయాడాయన.

ఒకరి మొహాలు వొకరు చూసుకుంటూ అరుగు దిగి వుసూరుమంటూ దాసన్న పేట వేపు నడవ సాగేరు మిత్ర ద్వయం.
కడుపులో ఖాళీ గాబరా పెడుతోంది.
మాఘ మాసపుటెండ చురుక్కు మంటోంది.
గావంచాతో చెవట్లు తుడుచుకుంటూ గుమ్చీ దాటి,అయ్యకోనేరు వేపు చూసేరు.
తనకేం పట్టనట్టు నంగనాచిలా నవ్వుతోంది.
చదువు కోనందుకు నిజంగా బాధ పడుతున్నారిద్దరు..
స్కూల్ కెళ్తున్న యూనిఫాం పిల్లలు, బేగ్ లు తగిలించుకుని రకరకాల వాహనాల్లో ఆఫీసులకు పోతున్న జనాలని చూస్తే యీర్ష్యగా వుంది.
అప్పుడు చదువుకొని వుండుంటే యిప్పుడీ శవాలమోత తప్పేది కదా!
అయినా బయటి వాళ్లతో మోయించడవేవిటి?
ఇంటివాళ్లందరూ సచ్చేరా?
ఆస్తులు కావాలి గాని బరువులు,బాధ్యతలు అక్కర్లేదు.
వెధవ జనాలు..వెధవ మనస్తత్వాలు..
గమ్యం దగ్గిర పడింది.
దూరంగా యింటి ముందు జనాలు..
పాడె సిద్ధంగా వుంది.
తీసికెళ్లే వాహనం కూడా రెడీగా పక్కన నిలబడుంది.
ముసలాయన.. తొంభై యేళ్లుంటాయి.
కొడకులిద్దరూ ఆస్ట్రేలియా లో వుంటారు.
వాళ్లకి రావడానికి వీలవలేదట.
వాళ్ల చిన్నాన్న వరసాయనే అన్నీ చేస్తాట్ట.
ఇంక రావాల్సిన వాళ్లెవరూ లేకపోవడం తో వెంటనే కార్యక్రమం మొదలెట్టేరట.
అయితే పాడె పట్టుకునేందుకు యిద్దరు తక్కుయ్యారట.
మిగిలిన యిద్దరు కూడా తమ లాంటి అరువు బాపతు గాళ్లేనట.
ముసలాయన పట్ల జాలి కలిగింది యిద్దరికీ.
ఎంత వుంటేనేం..కొడుకులెంత గడిస్తేమాత్రమేం లాభం?
చివరి క్షణాల్లో అనాధ ప్రేతమయ్యాడు.
ఆ కార్యం లో పాలుపంచుకున్న పుణ్యం చాలు.
ఇన్నాళ్ళు చదువుకోనందుకు పడిన తపన తుడిచి పెట్టుకు పోయింది.
కులవృత్తి కి సాటి వచ్చేదేముంది.
పాడె మీద చేతులు వేసిన యిద్దరి కళ్లలో భవిష్యత్తు వెలుగుల దారులు కనిపిస్తున్నాయి.

Comments