గందరగోళం

గందరగోళం
@@@
విశాఖపట్నం..

మా బంధులింట్లో పెళ్లికి భావుక సదస్సు నుండి తిరిగి వచ్చిన మూడు రోజుల్లోనే బయల్దేరి వెళ్లాం.

సుజాతా నగర్ దాట్ల కన్వెన్షన్ హాళ్లు ఎయిటీఫీట్ రోడ్ దిగగానే జోడు గుర్రాల్లా నిలబడి కనపడ్డాయి.

అయిదేసి అంతస్తుల భవనాలు...లిఫ్ట్.. ఎయిర్ కండిషన్డ్ వివాహ వేదికలు..
మూడవ ఫ్లోర్లో డైనింగ్ హాల్, నాల్గవ ఫ్లోర్ కల్యాణ మండపం, పై ఫ్లోర్ లో రెండు వరసల్లో అన్ని సదుపాయాలతో అరడజను గదులు..

ఒకే కాంపౌండ్ లో రెండు న్నాయి.

అవాళ రెండు పెళ్లిళ్లు జరుగు తునాయి.మాఘ శుద్ధ పూర్ణిమ..మహా మాఘి...

మొదటి దాంట్లో మా వాళ్ళు ,రెండో దాంట్లో యెవరో వైశ్యులు..
బంగారు నగల(?) జిగజిగలు...
పట్టు చీరల గరగరలు...
సెంటు వాసన ఘుమఘుమలు..
చిన్న పిల్లల కిలకిలలు..
ఎదురు చూపుల సన్నాహం..

మగపెళ్లి వారికోసం.

తొమ్మిదయింది.
కడుపులో టిఫిన్ పడక వికారంగా వుంది.
అప్పటికి రెండు సార్లు కాఫీ అయింది.
ఘనపదార్థం పడలేదింకా.

హడావుడి మొదలైంది.
మగపెళ్లి వారి కారు కనపడింది.
మేళం వాళ్ళు శృతి చూసుకుంటునారు.
మరోగంటయినా పడుతుంది ఆత్మారాముణ్ణి సముదాయించడానికి..
మగపెళ్లి వారిని రూముల్లోకి దారి చూపాలి..ఫలహారాలు సేవించమని బొట్టుపెట్టి చెప్పాలి.
..పెళ్లి కూతురు  పెదనాన్న యెక్కడ వదిలాడో తెలియని చెప్పులు నాలుగు కళ్లతో(కళ్ళజోడు) వెదుక్కుంటూ కనపడ్డాడు.

వాళ్లు తక్కుతూ తారుతూ బయల్దేరి కింద ఫ్లోర్ లో డైనింగ్ హాలు చేరి పలహార సేవనం పూర్తయ్యే సరికి గంటయినా పడుతుంది.
అతిబల,మహాబల మంత్రాలు తెలిస్తే బావుణ్ణు.
కడుపురొద యెక్కువవుతోంది

భజంత్రీలు..హారతులు

కాస్సేపు డైవర్ట్ అవుదామని ఫేస్‌బుక్ తెరిచాను.
అంతే..
అతుక్కుపోయాను..
కొత్తపోస్ట్లు..కామెంట్లు..
అలకలు..సముదాయింపులు..సుప్రభాతాలు..గుళ్లు..గోపురాలు..పక్షులు..చెడతిరిగిన మాంధాత కాలం నాటి వాట్సాప్ పోస్ట్లు..
రాజకీయ చర్చలు..అసభ్య పదజాలంతో వాగ్యుద్ధాలు..

ఈ సందట్లో  టిఫిన్లకి రమ్మని పిలుపు.

మొబైల్ చూస్తూనే  లిప్ట్లో దూరి మూడవఫ్లోర్లో డైనింగ్ హాల్లో కి ప్రవేశించి ,అక్కడ ప్లేట్ పట్టుకుని లైన్లో నిలబడి,వరసగా వేడి యిడ్లీ,కొబ్బరిచెట్నీ,వడ,సాంబార్,గాజర్ హల్వా వేయించుకుని కుర్చీలో కూలబడ్డాను.
పెసరట్,దోశ కూడా వున్నాయి.
నేనవి తీసుకోలేదు.

అందరూ గబగబ యెవరో తరుముకొస్తున్నట్లు తినేస్తునారు.
అందరికీ ఆకలే.
అత్మారాముణ్ణి శాంతింప జేసి మా ఆవిడ కోసం వెదికాను.
ఎక్కడా కనపళ్లేదు.
 మళ్లీ లిప్ట్లో కిందకి దిగి చూసేసరికి మా ఆవిడ మరికొంతమంది మహిళ ల తో కనిపించింది.
"తిన్నావా"
"
మీరో"అడిగింది.

"ఇడ్లీ,వడ బాగున్నాయి... హల్వా కూడా."అన్నాను.

"అదేవిటి..పెసరట్,వుప్మా కదా"

అందావిడ.

గుండె ఝల్లు మంది.
చుట్టూ చూసాను. పై అంతస్తులో మరో పెళ్లి
హడావుడి..
బుర్ర గిర్రున తిరిగింది.

అయితే నేను తిన్న టిఫిన్  పక్క పెళ్లి వారిదా!

నీతి: మొబైల్ చూస్తూ పెళ్లి మంటపాల్లో తిరగరాదు.

Comments