పనిమనీషి ..శుక్రవారం..18

ఇది నా స్వంత మే నని యే గ్రూప్, వాట్సాప్ సేకరణ కాదని తెలియజేస్తునాను.

శుక్రవారం పోస్ట్18
పని మనీషి
@@@@@
"ఏవిటో యిక్కడి పనిమనిషులు.నెల్లో వారం రోజులు రానేరారు..

యేవో సొట్టా,గుడ్డీ కారణాలు చెప్తారు.

మూడు వారాల పనికే పెల్లల్లా నెలజీతం..మద్య మధ్య డాక్టర్ సాకుతో అడ్వాన్స్ లు..
ఛీ..ఛీ..విరక్తి పుడుతుంది సిటీ అంటే..
చిన్నదైనా మన బెంగాల్లో నయం.చిలకలా వుండీది..పాతికేళ్లు శుభ్రంగా పని చేసింది..చుట్టాలొచ్చినా విసుక్కునేది కాదు.
ఇంత గుంట అప్పట్నుంచీ మనింట్లో పనిచేసీది..డబ్బు కాపీర్ణం అసల్లేదు.
గిన్నెలు తళతళ మెరిసిపోయీవి..
వీళ్లు గిన్నె లు నీళ్ళలో ముంచి తీసీడవే..""మనం దగ్గరుంటే వోలా ..లేకపోతే అంతే సంగతులు.
మా ఆవిడ పనిమనిషోపాఖ్యానం కొనసాగుతూనే వుంది..'యేవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు..'
అన్నట్టు గా.

ఇంతకీ మాపని మనిషి వారమై రావడం లేదు.
అనాధరైజ్డ్ లీవ్.
హఠాత్తుగా వచ్చి బలమైన కారణం..చావు..పెళ్లి..అనారోగ్యం.. లాంటివి చెప్తుంది.

మనకి గతిలేక నమ్మినట్టు నటించి, సానుభూతి వొలకబోస్తూ,లోపల తిట్టు కుంటూ పని చేయించుకోవడం అలవాటే.

కానీ యీ సారి పరిస్థితి తీవ్రంగా వుంది.
నేను కూడా కొంచెం జాగ్రత్త పడాలి

మాపనమ్మాయి వనజ చేతిలో ఫోను,దానికోసం భుజానో బేగు,ఇస్త్రీ చీర,నల్లకళ్లద్దాలతో హీరోయన్లా వుంటుంది.

హైహీల్స్తో టిక్కుటక్కు మంటూ నడకలతో శాపవశాత్తూ పనిమనిషి అవతారమెత్తాల్సి వచ్చిన దేవకన్యలా ఫీలవుతుంది.
దానికి తోడు పనిమనుషుల అసోసియేషన్ కి కార్యదర్శి ట.
తనతో గొడవ పెట్టుకున్నా ప్రమాదమే.
తను పనిచెయ్యదు. వెరేవరిని పనిచెయ్యనివ్వదు.
అందరికీ అనుభవమే.

ఆ వైభవం చూసే నేనీ పద్యం రాసేను.

కం.కం.మనమున జోతలు సేతును
'జనగణ మణ'పాడకుండ జల్దిగ రావే

జనముల తాకిడి సైపగ
వనజా! రావా వడివడి వాల్జడ వూగన్ !

అది చదివి మా అర్ధాంగి పళ్లు నూరడం వేరే విషయం.
ఇంతకీ ప్రస్తుత సమస్య గట్టెక్కడమెలా?
మాయావిడ వరస చూస్తే వనజని పీకి పారేసేటట్టే వుంది.

"నాకే పనిమనిషి అక్కరలేదు.
నేనే చేసుకుంటాను..నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను.అదే హాయి..డబ్బు మిగులు.."
ఆవిడ గొణగటం విన్పిస్తోంది.

"నిజమే..అదే హాయనుకో..కానీ నీకు కష్టం కదా..ఒక్కతివీ.."

ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి.
 లేకపోతే కొల్లేటరల్ డామేజి అంటే పని మనిషి తో పాటు మనకీ అక్షింతలు పడొచ్చు.

"సరే..నీ యిష్టం" అన్నాను.

నిజం చెప్పొద్దూ.
మా యావిడ. పని చాలా పొందిక. తిరిగి చూడక్కర్లేదు.
కొంచెం చాదస్తం..తోవినవే తోవి..పావినవే పావి..సర్దినవే సర్ది..

"సర్లే ! యిద్దరం కలసి యెలాగో చేసుకోవచ్చు..మానిపించీద్దాం " అన్నాను ధైర్యం చేసి.
"మహా ప్రభూ! మీ సాయం అక్కర్లేదు.
మీరు..మీఫోను..నాకు పనెక్కువ తప్ప మీరు చేసే సాయం నాకవసరం లేదు."
అమ్మో!బూమరేంగయింది.

అప్పుడే-
అపార్ట్మెంట్ గేటుముందు మాతలి రధం మీదనుంచి దిగుతున్న శచీదేవి లా దిగింది కథానాయిక వనజ.. చేతిలో పెద్ద నైలాన్ బేగు.
బాబోయ్!!మనమేదో బజారు పని తగిలించుకుని జారుకోవాలి.

వాళ్లువాళ్లు చూసుకోవడం బెటర్.
బట్టలు వేసుకుంటుంటే..
వనజ గొంతు విన పడింది.
గొడవ జరుగుతుందనుకున్న
 నా కాశ్చర్యం కలిగింది.
అయిదు నిమిషాలైనా సందడేమీ లేదు.

మా ఆవిడ యీలోగా గబగబ నా దగ్గర కొచ్చి రహస్యంగా చెప్తోంది.
"చూసేరా!మంగళగిరి నించీ యీ చీరలు తెచ్చింది వనజ.
వాళ్లమ్మకి వంట్లో బావులేక అనుకున్నట్టు రాలేకపోయిందట.
చాల చవకట.ఒక్కోటి వెయ్యి రూపాయలె గానీ వొక్కసారే యిస్తే ఎనిమిది వందలట.
నేను రెండు తీసుకున్నాను.
కేషిద్దామా?ఇన్స్టాల్మెంటా?"
హతవిధీ!!!

Comments