కందం

ఇది నా స్వంతమనీ,వాట్సాప్, యితర ఫేస్బుక్ గ్రూపుల నుండి సేకరించింది కాదనీ, తెలియజేస్తునాను..కాదని రుజువైతే నేను స్వచ్ఛంద ము గా మీ గ్రూప్ నుండి వెడలిపోతాను.

కందం
-----±+++
"వుర్రేయ్"

గట్టిగా అరుస్తూ హడావుడి గా గదిలోకి దూసుకొచ్చాడు కపిగాడు.

వాడి పేరు కనకవఝల పినాకి..మద్దుగా కపీ అంటారు.

వాడి కేకకి ఝడుసుకుని గాబరాగా లేచేను.

"చెల్లెమ్మాకాఫీ "-అని మా ఆవిణ్ణోసారి హెచ్చరించి నా పక్క మంచం మీద కాళ్లు బారజాపి కూలబడ్డాడు.

కపి గాడు వేస్ట్ కేండిడేట్.

వాళ్లింట్లోవాళ్లు కూడా వాణ్ణి అచ్చోసి వదిలేసారు.

గుడ్ ఫర్ నధింగ్ అనొచ్చు.

కానీ అన్ని తెలుసంటాడు..అన్నిట్లో వేలుపెడతాడు.

నాకు వాడు వేలు విడిచిన బావో,అన్నో యేదో అవుతాడట.

చుట్టరికాలు కూడా వాడే చెప్పేడు..కానీ నా కర్దంకాలేదు.

అయితే వాడు మనుషుల్ని యీజిగా పట్టే కళలో నిష్ణాతుడు.

వాడి మాటల గారడీ లో మా ఆవిడలాంటి వాళ్లు బాగా పడతారు.అందుకే వాడొచ్చినపుడు వేళాపాళా కాకపోయినా మా యింట్లో రాజోపచారాలందుకుంటాడు.

ఏ పని పూర్తిగా చెయ్యడు.

కొన్నాళ్ళు సర్కస్లో పనిచేసాడు.. తర్వాత కిళ్లీకొట్టు పెట్టి చేతులు కాల్చుకున్నాడు..
ఇలా రకరకాల స్టంట్లు చేసినా ప్రస్తుతం ఖాళీ గా వున్నట్టే.

"కపీశ్వరా!సంగజ్జెప్పు..వూరకరారు మహాత్ములు."
అన్నాను.

మా యావిడ తెచ్చిన కాఫీ వూదుకుని తాగుతూ-
"కందపద్యం" యెలా రాస్తారో చెప్పవోయ్"
అన్నాడు.

'నీకెందుకా కంద గోల' అన్నట్లు కళ్లెగరేసి అడిగాను.

"మరేం లేదు.మా వీధిలో ఓ బలిసిన కవి వున్నాడు. వాడిని కాకా పడితే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లెం తగ్గి కాపర్స్ ఆడతాయని..." గిరీశంలా ఫోజు కొడుతూ అన్నాడు.

"హమ్మ నీ"
అనుకున్నాను.లాభం లేనిదీ శెట్టి వరదన బోడు..
"నువ్వు పద్యాలేమైనా చదివావా?"

"చౌడప్ప"

తలపట్టుకున్నాను.

"వ్యాకరణం..సంధులు..సమాసాలు..అలంకారాలు "

"ఇల్లె"

"అసలు పద్య మంటే...."

"ఆపేయ్..మూసేయ్..శంకరాభరణం శాస్త్రి గార్లా నన్ను వాయించకు...ఈజీగా ..కేప్సూల్లా కందమందించు.."

"దరిద్రుడా!"

"నీకు జన్మలో రాదు"కసిగా అన్నాను.

"సరే..నువ్వు లేటెస్ట్ గా రాసిన కందాలుంటే, మొహాన పడేయి.
వాణ్ణి యింప్రెస్ చేసి నా పబ్బం గడుపుకుంటాను."

'హమ్మా!ద్రోహీ! 'అనుకున్నాను.

"అసలు పేస్బుక్,వాట్సాప్ చూస్తే నాపని గడిచిపోను.

"పోనీ కదా తెల్సినవాడివి..నీకు ఛాన్సిద్దామనుకున్నాను.
నీకా యోగం లేదు. ఫో!"

అని పెద్దపెద్ద అంగలేసుకుంటూ
గాలీదుమారం లా మాయమయ్యాడు.

అదీ సంగతి.

మిత్రులారా! మా వాడి సంగతి మీకు తెలీదు.మీమీ స్వంత రచనల్ని కాపాడుకోండి. నాపూచీ లేదు.

Comments