తెలివైన రాజు

జంబూ ద్వీపంలో అదొక చిన్న రాజ్యం.
ప్రజలు సుఖ సంతోషాలతో  వుండేవారు.
రాజ్యం సుభిక్షంగా వుండటం..పాలన సక్రమంగా వుండడం వొక కారణమయితే ప్రజలు దైవభక్తి కలిగి వుండటం వల్ల పాపభీతి వలన సత్కార్యాలు చేస్తూ పరోపకారంతో ఒకరికొకరు సాయపడేవారు.
అయితే కబంధుడు,బకంధుడు అనేయిద్దరుమాత్రం స్వార్ధబుద్ది తో ,సంపదను దాచుకుని తాము ధనిక శ్రేణి లో చేరాలని తాపత్రయ పడేవారు.
పన్నులు యెగవేసేవారు.
అదికారులకి లంచాలిచ్చి తప్పించుకునే వారు.
రాజు గారికి సంబరాలప్పుడు ఆకర్షణీయమైన బహుమతులు అంద జేసి.ఖజానా నుండి తక్కువ వడ్డీకి వ్యాపార నిమిత్తరుణాలు తీసుకునే వారు.
రాజు కి వీరి సంగతి తెలిసినా చూసి చూడనట్లు వదిలేసే వాడు.
కొంత కాలం గడి చాక  ఆ రాజ్యానికి అనుకోని వుపద్రవం వచ్చి పడింది.
ఎక్కడ్నుంచో అంతు తెలియని రోగం ప్రవేశించి మనుషులను పొట్టన బెట్టుకోసాగింది.
రాజు మొదట్లో యీ వ్యాధి సంగతి తెలియగానే జాగ్రత్త తీసుకున్నాడు.
అది అంటువ్యాధనీ,దానికి మందు లేదని రాజ వైద్యులు చెప్పేరు.

రాజు వెంటనే తనదేశానికి నలువైపులా రవాణా మార్గాలు మూయించాడు.
ప్రజలను యిళ్లు వదిలి బయటకు రావద్దన్నాడు.
పిల్లలను ,వృద్ధులను,రోగులను శ్రద్ధ గా చూసుకోమన్నాడు.
తన పరిచారకులకు విశేషంగా ఆదేశాలు జారీ చేసాడు.
నిరాశ్రయులు,పేదవారికి ధర్మసత్రాలలో ఆశ్రయం కల్పించాడు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజ్యాన్ని అష్టదిగ్భంధనం చేయించి,తానే స్వయంగా పరిస్తితులను పర్యవేక్షించసాగేడు.
అయినా యిన్ని జాగ్రత్తలు తీసుకన్నా మాయదారి అంటువ్యాధి దొంగలా చల్లగా కొందరి అజాగ్రత్త వల్ల రాజ్యం లోకి ప్రవేశించింది.
రాజు వారిని వెతికి పట్టుకుని వూరిచివర మేడలో వారికి వైద్యుల సాయంతో వుపశమనానికి యేర్పాట్లు చేయించాడు.

రోజులు భారంగా గడుస్తునాయి.
ప్రజలు ఇళ్లలో మగ్గుతూ,భయంతో వణికిపోతునారు.
అంగళ్లు మూసేయడంతో చిన్నా,చితకా వుద్యోగులు,పనివారు,రోజువారీ కూలీలు యిబ్బందులకు లోనయ్యారు.
మరోపక్క కర్మగారాలు,పరిశ్రమలు, మూతబడి  వస్తువుల వుత్పత్తి కుంటుపడింది.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.
ధనికులు సామగ్రి నిల్వలు చేయనారంభించారు.
కబంధ,బకంధులు కూడా యీ పరిస్థితి ని చక్కగా వుపయోగించుకుని అదిక ధరలతో లబ్ది పొందారు.
అక్రమ సంపాదనను నేల మాళిగలో భద్రంగా దాచారు.
ఇదిలా వుండగా చుట్టు పక్కల రాజ్యాల్లో వ్యాధి తీవ్రతరమైంది.వేలసంఖ్యలో మరణాలు సంభవించాయి.
రాజు తన ఖజానాలో సొమ్మును పేద ప్రజల నాదుకునేందుకు వెచ్చించాడు.
అయినా ఖజానా ఖాళీ అవుతోంది గానీ అవసరం తీరడం లేదు.
అప్పుడాయన ధనిక వ్యాపారులను స్వచ్ఛందంగా విరాళాలిమ్మని కోరేడు.
కొందరు ఇచ్చారు గానీ స్వార్ధపరులు ముందుకు రాలేదు.
రాజుకేమీ పాలు పోలేదు.
మంత్రి తో చర్చలు జరిపి మర్నాడు యిలా ప్రకటించాడు-
'వంశ పారంపర్యంగా తమ వద్ద వున్న పెద్ద వజ్రాన్ని విపత్కర పరిస్థితులలో అమ్మకానికి పెట్టాలనుకుంటున్నాని,సరైన పైకం చెల్లించగలిగిన వారు దాన్ని స్వంతం చేసుకోగలరనీ ,త్వరగా వచ్చిన వారికి సువర్ణావకాశమని '
 సారాంశం.
అది వినగానే పోటీపడి స్వార్ధపరులైన  కబంధ సోదరులు తాము దాచిన నల్లధనాన్ని  వెచ్చించి వజ్రాన్ని కొనుగోలు చేయాలనుకుని రాజుగారి దగ్గరకు పరుగెత్తారు.
వారిని చూసి రాజు,మంత్రి నవ్వుకున్నారు.
రాజు గారి చేతిలో  మంత్రి రహస్యంగా చేయించిన నకిలీ వజ్రం అసలు కన్నా యెక్కువగా మెరుస్తోంది.

Comments