దొంగ

రాజు సెంట్రల్ జైల్ బయటకు వచ్చి ఆనందంగా గట్టిగా వూపిరి పీల్చి వదిలేడు.
స్వేఛ్ఛా వాయువులు వూపిరితిత్తుల్ని నింపాయి.
ఎదురుగా జనాలు..వాహనాలు..దుకాణాలు..జంతువులు..

పదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు తను.
రతన్ లాల్ నగల దుకాణం లో పదిహేను లక్షల విలువ చేసే నగలు కొట్టేసిన రెండో రోజు పట్టుబడ్డాడు.
దోచిన రోజే వాటిని వొకచోట దాచి గుర్తు పెట్టుకుని తిరిగి వచ్చిన మరుసటి నాడు పోలీసులు వచ్చి తనను పట్టుకు పోయారు.
పదేళ్ల జైలు శిక్ష పడింది.
పోలీసులు యెంత ప్రయత్నంచినా ,నోరు విప్పలేదు తను.
ఇప్పుడు వెళ్లి వాటిని తీసుకోవాలి.
అప్పట్లో పదిలక్షలంటే ఇప్పుడు వాటి విలువ యెంతలేదన్నా నలభై లక్షలకు తక్కువ వుండదు.
వాటినమ్మేసి వచ్చిన డబ్బుతో శేషజీవితాన్ని గడపొచ్చు.
చుట్టూ చూసేడు.
కొద్ది దూరంలో వున్న టీ కొట్లో టీ తాగి, పక్కనే వున్న కిళ్లీ బడ్డీ లో సిగరెట్ కొనుక్కుని వెలిగించాడు.
పదేళ్లలో సిటీ చాలా మారిపోయింది.
ఖాళీ స్థలం కనపడితే యిళ్లు,షాపింగ్ కాంప్లెక్సులు లేచిపోతునాయి.
తను దాచిపెట్టిన జాగా యెలా వుందో!
అసలు తను పోల్చుకోగలడా?
సిటీ కి దూరంగా అడవి లాంటి ప్రదేశంలో మర్రి చెట్టు వెనకాల గొయ్యి తవ్వి దాచేడు వాటిని.
జైలు లో పనిచేసినందుకు పారితోషికం గా యిచ్చిన వెయ్యి రూపాయలు  తన దగ్గర వున్నాయి.
తననెవరు వెంబడించి రాకుండా జాగ్రత్త పడుతూ,
కాస్సెపు యిటూఅటు తిరిగి తననెవరూ వెంబడించలేదని నిశ్చయమయ్యాక ఆటోని పిలిచి యెక్కడికి తీసుకుపోవాలో చెప్పాడు.
ఆటో శరవేగంతో ముందుకురికింది.
సిటీ బాగా వెనక్కి పోయాక. అడవి మొదలు కాకుండానే దిగి,ఆటో అతనికి డబ్బులిచ్చి పంపేసాడు.
అటో వెళ్ళి పోయాక,జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి ముందుకి నడవడం ప్రారంభించాడు.
అరగంట నడిచాక అడవి దగ్గరయింది.
ఇటూ అటూ చూస్తూ మర్రి చెట్టు కోసం చూసేడు.
అంతే స్థాణువయ్యాడు.
ఎదురుగా పెద్ద మేడ.
ఇటు అటూ చెట్లమధ్య పెద్ద పాంహవుస్ దర్శన మిచ్చింది.
గేట్ దగ్గర నేపాలీ గూర్ఖా.
అతను దగ్గర కు చేరి బంగళా యెవరిదని అడిగాడు.
అతడిచ్చిన సమాధానం-
"సేఠ్ రతన్ లాల్ కా బంగ్లా హై"
.దొంగ_2

రాజు గూర్ఖా కు ఖైనీ యిచ్చి,సంగతులు రాబట్టేడు.
బంగళా వెనకాల పెద్ద మర్రిచెట్టు వుందట.సేఠ్ జాగా కొని బంగళాకట్టినపుడు ,చెట్టుకింద శివలింగాన్ని చూసి,చెట్టునలాగే వుంచేసాట్ట.
ఆ లింగం చుట్టు చిన్న కోవెల కట్టాడట.
అంటే బంగళా పెరటి భాగం లో తన నిధి దాగుంది.
కాస్సేపు ముచ్చట్లాడి రాజు అక్కణ్ణుంచీ వెళ్లిపోయాడు.
దారంతా ఆలోచిస్తూ నడుస్తునాడు.
ఎలాగైనా కోవెలలో ప్రవేశించాలి.
తను దాచిన సొత్తు వెతకాలి.
అతని మెదడులో రకరకాల ఆలోచనలు..
ఎలా అ యింట్లో ప్రవేశించాలో పథకం రుపు దిద్దుకుంది.
వూళ్లోకి వెళ్లి తిన్నగా నాటకాల వారికి దుస్తులు అద్దెకిచ్చే దుకాణం చేరుకున్నాడు.
@@@@@@@
మర్నాడు
ఉదయం పది గంటలయింది.
సేఠ్ రతన్ లాల్ తన పనులు ముగించుకుని దుకాణం చేరడానికి తయారవుతున్న సమయం.
గేట్ దగ్గర సందడికి బయటకు వెళ్లేడు.
ఎవరో సాధువు..
బారెడు గడ్డం..విభూతి రేఖలు..కాషాయ వస్త్రాలు..
జడలు కట్టిన జుత్తు ముడి చుట్టి వుంది.
కమండలం..దండం..మాటి మాటికి "హరహర మహాదేవ్ "అంటునాడు.
గూర్ఖా ను పిలిచి సంగతి అడిగాడు.
ఎవరో యోగి..హిమాలయాలలో వుంటుండగా శివుడు యిక్కడ తన సేవ చూసుకోమని పంపేడట.
మీ యింటి వెనక శివాలయముందా అనడుగుతునాడు.
రతన్ లాల్ సాధువు కు నమస్కారం చేసి,గౌరవంగా బంగళా వెనక్కి,శివకోవెల కి తీసుకెళ్లాడు.
కోవెల పక్కనే వున్న స్టోర్ ఖాళీచేయించి,సాధువును అందులో వుండమన్నాడు.
అతని భోజన,పలహారాలు యింటినుండే వస్తాయని చెప్పి తదనుగుణంగా అందరికీ ఆదేశాలిచ్చేడు.
తర్వాత దుకాణం పని మీద వెళ్లిపోయాడు.
రాజు కి పట్టరాని సంతోషంగా వుంది.
ఇంత సయలభంగా రతన్ లాల్ బుట్టలో పడతాడని వూహించలేదు.
అయినా తన పని తొందరగా ముగించుకోవాలి.
రాత్రిపూట వెతకాలి..
యెవరికీ అనుమానం రాకుండా.
కోవెల వెనకనుండటం లాభించింది. ఎవరూ అంత పట్టించుకోరు.
రాత్రి పలహారమయ్యాక..కూర్చుని జ్ఞాపకం తెచ్చుకోసాగేడు.
అరోజు..పదేళ్లక్రితం యిది పెద్ద అడవి.
నరమానవులు అడుగు పెట్టడానికి సాహసించేవారు కాదు.
చుట్టూ కొండలు..మద్యలో అడవి.
తను చూసిన మర్రిచెట్టు వూడల్తో విస్తరించి వున్నది.
అక్కడ శివలింగం లాంటి శిలను తను కూడా చూసేడు.
అదే గుర్తు..
అక్కడికి యెదురుగా తూర్పు వైపు పదడుగుల దూరంలో ఆరడుగుల గొయ్యి వొక్కడే తవ్వి నగలపెట్టెను దాచాడు.పైన రాళ్లు,చెత్త చెదారంతో నింపేడు.
మళ్లీ దానపైన మట్టి బాగా పోసేడు.దాన్ని పూర్తిగా కప్పి బాగా గుర్తు పెట్టుకుని వెనక్కి వచ్చేడారోజు.
మళ్లీ యిన్నాళ్లకి..
అదే స్థలంలో..
కానీ పోల్చుకోవడమెలా?
జోలెలో విస్కీ త్రాగి నిద్ర కుపక్రమించేడు.
@@@##
మర్నాడు రాత్రి..
పదయింది.
రాజు లేచాడు..
బంగళా లైట్లన్నీ ఆరిపోయేదాకా యెదురుచూస్తూ,కూర్చున్నాడు.
పదకొండు గంటలకు లైట్లన్నీ ఆరి పోయాయి.
మరో అరగంట ఆగి,లేచి టార్చ్,పనిముట్లు తీసుకుని,శివలింగానికి తూర్పు దిక్కు గా నడిచాడు.

దొంగ-3
@@@

చుట్టూ నిశ్శబ్ధం..కీచురాళ్ల చప్పుడు..
మిణుగురు పురుగులు వెలుగులు విరజిమ్ముతూ యెగురుతునాయి.
మరోసారి వెనకా,ముందు చూసుకుని జాగ్రత్త గా అడుగులు వేసాడు రాజు.
ఏదో పేరు తెలియని పిట్ట ఘోరంగా అరుస్తూ తల మీదనుంచి యెగిరి పోయింది.
సరిగ్గా పదడుగులు నడిచే సరికి యెదురుగా మామిడి చెట్టు కనిపించింది.
చుట్టూ చేతినడ్డంపెట్టి టార్చి వెలిగించి చూసాడు.
పగలు చాలాసార్లు ఆ ప్రదేశాన్ని పరీక్షించి,నిర్ధారణ చేసుకున్నాడు.
మరోసారి చుట్టూ కలయ జూసి,ఎవరూ లేరని గమనించాక,గడ్డ పార తో తవ్వటం ప్రారంభించాడు.
అరగంట గడిచింది.
కాస్సేపు ఆయాసం తీర్చుకుని,పరిసరాలు గమనిస్తూ తవ్వటం కొనసాగించాడు.
గంటయింది.
చాలా వరకు తవ్వేసాడు.
మరో అడుగు..
అంత చల్లని వాతావరణం లో చెమట కారిపోతోంది.
ఇన్నాళ్ళు గా యెదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతోంది.
నగలు దొరికాక యీ పాడు జీవితానికి స్వస్తి చెప్పి యే బొంబాయి లోనో సెటిల్ అవ్వాలి.
మళ్లీ తవ్వటమొదలు పెట్టేడు.
నేల గుల్లగా వుంది.
అడుగు లోతు తవ్వేసరికి పార దేనికో తగిలి ఖంగు మంది.
జాగ్రత్తగా మట్టి చేత్తో తొలగించి అపురూపంగా చిన్నపిల్లాడ్ని పట్టుకున్నట్లు రెండుచేతులతో పెట్టెను పైకి  తీసాడు.
అమ్మయ్య.
అనుకుని గోతిలోంచి బయటకు రాబోతుండగా జరిగిందది.
ఒక్కసారిగా పెరడంతా దేదీప్యమానంగా కాంతితో నిండి పోయింది.
క్షణాల్లో అతని చుట్టూ పోలీసులు.. రతన్లాల్ కుటుంబం..
ఆశ్చర్యం తో అందరినీ చూసేడు రాజు.
ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి-
"రాజూ! నువ్వు విడుదలైన రోజు నుంచీ నీ మీద నిఘా వుంచేం..మా మనుషులు నీడలా నిన్ను మఫ్టీలో వెంటాడుతూ వున్నారు.
నువ్వు విడుదలయ్యక నగల కోసం తప్పక ప్రయత్నం చేస్తావని మాకు తెలుసు.
అందుకే నీ కదలికలు గమనిస్తూ నువ్విక్కడ తచ్చాట్లాడటం చూసి మరింత జాగ్రత్తగా నిన్ను ఫాలో అయ్యాం.
నువ్వు సాధువు వేషం లో యిక్కడికి రాగానే ముందుగా మేము రతన్లాల్ ని హెచ్చరించి నీ కోరిక వప్పుకోమన్నాం.
వూరు,పేరు తెలియని సాధువు కి అంత త్వరగా ఆశ్రయమిచ్చాడతను..మేము చెప్పడం వల్లే.
నీకదలికలు గమనిస్తూ నీ ద్వారా నగల ఆచూకీ తెలుసు కున్నాము"
రాజు అవాక్కయ్యాడు.

Comments