దృష్టా సీతా!

దృష్టా సీతా!
@@@@@@

మనలో చాలా మందికి యీ అనుభవం వుంటుంది.
కొందరు యే మాటా తిన్నగా చెప్పరు.
చుట్టూ తిరిగి మనకు విసుగు పుట్టేదాకా వివరించి ఆఖరున అసలు విషయం చెబుతారు.
ఉదాహరణకు యేదో వస్తువు తెమ్మని బజారుకి పంపారను కోండి.
అతగాడు గంటయ్యాక తిరిగి రాగానే "యేరా! దొరికిందా" అంటే వాడు -
 నేనిలా బయటకొచ్చానో లేదో ,ఎదురుగా పెద్ద ఆక్సిడెంట్...(దాని వర్ణన)
అలా బజారు కెళ్లానా యెక్కడా దొరకలేదు.
అన్ని దుకాణాలు వదలకుండా వెతికాను.అందరూ లేదనే జవాబు.
ఆఖరికి వొక చిన్న షాపులో  సందేహ పడుతూ అడిగాను.
వాడు అనుమానంగా వెతికి యెలాగో యీ వొక్క పీసే వుందని యిచ్చేడు."
విన్నవాడికి చాచి చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుందా!లేదా!
అసలు విషయం ..దొరికింది అని చెప్పి ,వస్తువు వారి చేతిలో పెట్టాక రామాయణం చెప్పవచ్చుగా!
అబ్బే!
దురలవాటు..సహనానికి పరీక్ష!
వానరసేన ఆతృతగా హనుమంతుడి కోసం యెదురు చూస్తునారు.
గడువు దగ్గర పడింది.
సుగ్రీవాజ్ఞ..మరణశిక్ష..
అటువంటి సమయంలో దూరంగా నలుసులా ఆకాశంలో కనపడ్డాడు పవనసుతుడు.
అందరి లో ఆశాదీపాలు వెలిగాయి.
విపరీత మైన వేగం తో యెదురుగా యెగురుకుంటూ వస్తున్న ఆంజనేయునికి స్వాగతం చెప్పడానికి, ఆయన చెప్పబోయే వార్త కోసం వానరసేన కాచుకునుంది.
నేల మీద అడుగుపెట్టిన మారుతాత్మజుడు పలికిన మొదటి మాట..
"దృష్ట్వా సీతా!"
" చూసేను.సీతను" అంటాడు..నోరు విప్పగానే.
లంకకు చేరేలోగా యెదురైన మైనాక పర్వతం.. సింహికా భూతం..సురస పరీక్ష..లంకలో లంకిణి..తన వెదుకు లాట..అశోకవనం..సీతను చూడటం..సంభాషణ.. అశోకవన విధ్వంసం,దనుజ మర్ధనం..ఇంద్ర జిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ,తనని రావణుని సభకు తీసుకుని వెళ్లడం..అక్కడ రావణుని కి తన హితోపదేశం..రావణాజ్ఞతో తోకకు నిప్పు పెట్టిన తరువాత జరిపిన లంకా దహనం ..
ఇవన్నీ చెప్తూ కూర్చోలేదు.
సీతను చూసేను అన్న మాట కోసం యెదురు చూస్తున్న వానరసేనకు ముందుగా అదే మాట సంజీవని మంత్రం లా పని చేస్తుందని చెప్పాడాయన.
మనం కూడా మన నిత్య జీవితం లో అవసరమైన మాట నేముందు చెప్పాలి.
జై హనుమాన్..!!
జ్ఞాన గుణ సాగర!!

Comments