ఉక్రోషం

ఉక్రోషం

" ఈ జీ టూ అపార్ట్మెంట్ వాళ్లంటే నాకు చిరాకు.
ఆంటీ,అంకుల్ ఇద్దరే ఉంటారు.
రాత్రెప్పుడు పడుకుంటారో తెలీదు గాని ,తెల్లారి నాలుగ్గంటల్నించీ దెయ్యాల్లా లేచిపోయి,హడావుడి పడిపోతూ పన్లు చేసుకుంటూ కనపడతారు.
మొత్తం బిల్డింగ్ అంతా దాదాపు నిద్రావస్థలో వుంటుంది..
వీళ్ల ఇంట్లో మాత్రం లైట్లు,ఫాన్లు,కడగడాలు,తోవడాలు,స్నానాలు,కుక్కర్ చప్పుళ్లు..
ఎందుకో తొందర..
అంకుల్ రైల్వే లో పనుచేసి,రిటైర్ అయ్యాడు.
ఎప్పుడూ మొబైల్ లోనే వుంటాడు.
ఆవిడ యేవో భక్తి పాటలు పాడుకుంటూ, ఇంటి పనుల్లో బిజీ గా వుంటుంది.
నేను ఎప్పుడు చూసినా వాళ్ల తలుపులు మూసే వుంటాయి.
పొరపాటు న తీసివున్నా,అంకుల్ సోఫాలో వాచ్ డాగ్ లా మొబైల్ లో యేదో చూస్తూ,రాస్తూ కనపడతాడు.
మిగిలిన అన్నిళ్లవాళ్లు నన్ను ప్రేమగా పలకరిస్తారు.ఏదో తాయిలం పెడతారు.
హుం...వీళ్లు మాత్రం..
అలా అని పిల్లలంటే ముద్దు లేదా అంటే..
కొత్తగా పుట్టిన అరవ మామి కూతుర్ని పిలిచి మరీ ముద్దులాడతారు.
కరోనా కాలం కదా.. ఒకే చోట బోరుగా ఉండలేక వెరైటీగా వీళ్ల ఇల్లూ,సామాన్లూ,ఎలా సర్దుకున్నారో చూద్దామని నా ఆశ.
కానీ...
నా కోరిక యీ జన్మకి తీరేటట్టు లేదు.

కోపంగా మూసివున్న తలుపుల వేపు చూసి,గట్టిగా "మ్యావ్" మంటూ అరచి తోక పైకెత్తి పారిపోయింది నల్ల మచ్చల దొంగ పిల్లి.

Comments