కథాకేళి 10

కధాకేళి-10 ఉత్తమ కధ'- అర్ధనారీశ్వరం, రచన:- శ్రీ భాగవతుల కృష్ణారావు గారు. వారికి భావుక ఎడ్మిన్సు మరియు బృంద సభ్యుల తరపున హృదయపూర్వక అభినందనలు.          
           నేను,వసంతశ్రీ గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాము. కధలన్నీ ఒక వేదికపైకి అందించిన సహ ఎడ్మిన్ శ్రీమతి  గిరిజారాణి కల్వల గారికి ధన్యవాదాలు.                           

ఈ కధపై నా సమీక్ష.                    
--------------------------                   
ప్రతి కుటుంబంలొ భార్యాభర్తలు పరస్పరం సహకరించుకుంటేనే సంసార రధం సాఫీగా ముందుకు   సాగుతుంటుంది. ఒడుదుడుకులు ఎదురైనా తట్టుకుంటూ  గమ్యాన్ని చేరుకుంటారు. ఒకప్పుడు మగవారు చదువు అవగానే ఏదొ ఒక ప్రభుత్వ ఉద్యొగంలొ జీతం తక్కువైనా ఉద్యోగ భద్రత ఇతర సదుపాయాల కోసం చేరిపోయి మధ్య తరగతి జీవితం సాగించేవారు. కనీసం ముగ్గురు పిల్లలు,అత్తమామలు, కొన్నిసార్లు ఆడపడుచులు లేదా మరుదుల బాధ్యతలు స్త్రీలకు ఉండేవి. ఇవి కాకుండా ఇంటికి వచ్చే చుట్టాలకు మర్యాదలు, బంధువుల ఇళ్ళలొ జరిగే కార్యక్రమాలకు హాజరు,ఖర్చులు ఇలా ఎన్నొ బాధ్యతలు ఉండేవి. మగవారు సంపాదన స్త్రీల చేతిలొ పెడితే వాటిని తగురీతిలొ ఖర్చు చేస్తూ తమ కోర్కెలు త్యాగం చేసి ఇతరుల కోర్కెలు,అవసరాలు తీర్చడానికి శ్రీమతులు పడే అవస్ధలు ఎన్నొ. దీనికి తోడు తోటి వారి పిల్లలతొ పోల్చుకుంటూ పిల్లల డిమాండ్లు, అవి తీర్చలేక సతమతమవుతున్న తమ బ్రతుకులు హెళనగా చూసే తోటి వ్యక్తులను చూస్తూ చిరునవ్వు మొహంపై ఉంచుకుని పిల్లల పెంపకం, చదువులు,పెళ్ళిళ్ళు, తరువాత పురుళ్ళు, మనవలకు సేవలు ఇలా భార్య పనికి విశ్రాంతి లేక రిటైర్ మెంట్ ఉండదు. అందుకే రిటైర్ అయిన రోజున భర్తలకు చేసే సన్మానం శ్రీమతికి దక్కాలి. ఆఫీసు పనిలొ విజయం సాధించి,ప్రమోషన్లు పొందామంటే మనం ఇంటి బాధ్యతలు శ్రీమతులు విజయవంతంగా చేస్తుండడమే అనే విషయం ప్రతి భర్త గుర్తు పెట్టుకొవాలి. ప్రతీ భర్తలోనూ ఆతని భార్య అర్ధనాదీశ్వరిగా తోడు ఉంటుంది. అలాగే ప్రతి భార్యలోనూ భర్త అర్ధనాధీశ్వరుడిగా ఒదిగిపోతే ఆ భార్య ఎన్ని బాధ్యతలనైనా అవలీలగా నెరవేర్చుతుంది. ఉద్యొగపర్వంలొ చివరిరోజు అందరూ సన్మానం చేసి మనల్ని పొగిడేటప్పుడు మన విజయాలకు కారణమైన మన శ్రీమతి గురించి మనం తప్పక మాట్లాడాలి. ఎందుకంటే ఆమెకు జీవిత చరమాంకమే రిటైర్మెంట్.  ఈ విషయాన్ని శ్రీ కృష్ణారావు గారు తన కధ ద్వారా ఎంతొ బాగా చెప్పారు.నేడు దంపతులిద్దరూ ఉద్యొగస్తులైనా స్త్రీలే కుటుంబ మరియు పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు. గతంలొ కంటే ఇప్పుడు స్త్రీలు ఇంటి బాధ్యతలతొ పాటు ఆదాయం కూడా సమకూర్చుతున్నారు. అందువల్ల నేటి తరానికి  కూడా ఈ కధ  వర్తిస్తుంది. కధ,కధనం మన జీవితాలకు చాలా దగ్గరగా ఉండడంతొ ఇది మన కధ అనేలా పాఠకులు మమైకం చెందుతారు. మీకోసం కధ దిగువన అందిస్తున్నాం.        

 #అర్ధనారీశ్వరం
@@@@@@
రచన:-శ్రీ భాగవతుల కృష్ణారావు.
++++++++++++++++

రావు గారికి పదకొండవుతున్నా నిద్ర పట్టడం లేదు.
పక్కకు  తిరిగి చూసేరు.
ధర్మపత్ని సుశీల పని అలసట వల్ల గాఢంగా నిద్ర పోతోంది.
ఆమెను చూస్తూ ఆలోచనలో పడ్డారు..
నవ వధువుగా తన జీవుతంలో ప్రవేశించినదాదిగా ముప్ఫై నాలుగేళ్ల తర్వాత నేటికీ  ఆవిణ్ణి వేలెత్తి చూపే అవసరం రాలేదు.
చనిపోయిన వరకు అత్త మామల సేవ విషయం లో అయితే నేమి..
ఇల్లు శుభ్రంగా వుంచడం లోగానీ..
పిల్లల పెంపకం లో గానీ..వాళ్ల చదుసంధ్యల పట్ల గాని..
అతిథి మర్యాదలలో గానీ..
ఇరుగుపొరుగు వారితో సఖ్యతగాని..
ఎందులో చూసినా ఆవిడ కు ఆవిడే సాటి.
తనతో పాటు సుఖదుఃఖాలు పంచుకునే
ఎకైక జీవి.

సుదీర్ఘమైన పదవీ కాలం ప్రథమార్థంలో ఎక్కువ కాలం గుమాస్తా గిరియే తనది. పిల్లలు స్కూలు చదువులు అధిగమించి కాలేజీ చదువులలోకి వస్తున్నారు.
 ఖర్చులు తలుచుకుంటే నిద్ర పట్టేది కాదు. దానికి తోడు రాబందుల లాంటి సంపన్న బంధువుల ఎత్తిపొడుపులూ, మా క్వార్టర్స్ ఎదురుగా ఉండే ఆఫీసర్స్ బంగళా వాసుల చిన్న చూపులూ -
 సున్నిత మనస్కుడినైన నన్ను మరీ కృంగదీసేవి. మనసు ఎంత తేలికగా చేసుకుందామన్నా నన్ను కృంగదీయాలనుకునే ఈ లోకానికి నా చిరునవ్వే సమాధానం గా చెప్పగలిచే వాణ్ణంటే దానికి ప్రధాన కారణం ఆవిడ నాలో నూరిపోసిన స్థైర్యమే కదా! 
ఆ మానసిక స్థైర్యమే లేకుంటే నేను ఆఫీసర్ ప్రమోషన్ పొందగలిగే వాడినా? గూడు కట్టుకుని లోపల తిష్ట వేసిన నిరాశా నిస్పృహ ల మధ్య కొట్టుమిట్టాడుతూ గుమాస్తా గానే పదవీ విరమణ చేసేవాడిని! 
ఆ స్థైర్యమే అంచెలంచీల ప్రమోషన్లకు హేతువైంది. అందరూ అంటారు- 'మగవాని విజయాల వెనుక ఒక స్త్రీ హస్తముంటుంది' అని. ఎవరి విషయాలలో ఏమో కానీ నా విషయంలో అది అక్షర సత్యం!

అవసరమైనప్పుడు అద్భుతమైన సలహాలు యిచ్చే ది.
అలాగని బొత్తిగా గొడవలు లేవనికాదు..యేవో చిన్నచిన్న మనస్పర్ధలు.. తన తొందరపాటు కారణంగా మాటామాట అనుకున్నా త్వరగా సమసిపోయేవి.
నిజానికి ఆమె తన జీవిత సహచరి కావడం తన అదృష్ట మనే చెప్పాలి.

రేపు ఫిబ్రవరి29.
తన పదవీవిరమణ దినం.
రైల్వే లో ముప్పై నాలుగేళ్ల క్రితం అడుగు పెట్టిన తను రేపు  దేశంలోనేఅతి పెద్ద ప్రభుత్వ సంస్థ ను వదిలేస్తాడు.
రేపు తన సర్వీసు లో చివరి రోజు.
పది గంటల కల్లా తయారై ఆఫీసుకి వెళ్ళి సంతకం చేసి సహోద్యగుల తో ముచ్చట్లాడి,అర్జంట్ ఫైల్స్ చీఫ్ కి అప్పజెప్పి.పదకొండు గంటల కల్లా బయలు దేరి, రైల్వే ఆడిటోరియం కి చేరుకోవాలి.
అక్కడ డిఆర్ఎమ్ తదితర వున్నతోద్యోగుల సమక్షంలో సెటిల్మెంట్ విభాగం ముందుగా గణన చేసిన తన పిఫ్,గ్రాట్యుటి,కమ్యుటేషన్,లీవ్ శేలరి,ఇన్సురెన్సు డబ్బులు చెక్కు రూపంలో అందజేస్తూ,పెన్షన్ కాయితాలు కూడా అప్పుడే యిస్తారు.
ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజన మయ్యాక నాలుగు గంటల ప్రాంతంలో మళ్లీ ఆఫీసుకి వెడితే సంబందిత డిపార్ట్మెంట్ వారు చేసే ఫేర్వెల్ కార్యక్రమం వుంటుంది‌.
ఆ విభాగపు ఉన్నతాధికారి,అతని సహాయక అధికారులు, మిగిలిన స్టాఫ్,కొలీగ్స్ అందరూ చిరు సన్మానం చేసి,తలో నాలుగు మంచిమాటలు చెప్తారు.
అదయ్యాక ఆరు గంటలకు అందరూ కలసి పదవీ విరమణ వ్యక్తి యింటికి అతన్ని, కారులో దిగబెడతారు.
అతనిచ్చిన అల్పాహారం స్వీకరించి యెవరిళ్లకువాళ్లు వెళ్లడం అనవాయితీ.
రావుగారు మనసులో వొక ఆలోచన మెదిలింది.
ఉదయం మామూలు గా తయారై ఆఫీసుకి వెళ్లి అక్కడ పనులన్నీ పూర్తిచేసుకున్నాక,యింటికి భోజనానికి వచ్చి సుశీల తో అన్నారు.

"ఇవాళ సాయంత్రం నువ్వు కూడా నాతో మా ఆఫీసుకి రావాలి" అన్నారు.
"అదేవిటి..మిమ్మల్ని దిగబెట్టే వారికి టిఫినేదో చెయ్యాలిగా."

"అవసరం లేదు. వాళ్లకి బయటినుంచి అరేంజి చేద్దాం.
నువ్వు తయారవు."

ఇద్దరూ నాలుగు గంటలకు తయారై ఆఫీసు చేరుకున్నారు.
మెట్లెక్కి సమావేశం జరిగే పెద్ద హాలు లోకి ప్రవేశించారు.
అప్పటికే అక్కడ అందరూ సిద్దంగా వున్నారు వేదిక మీద వున్న కుర్చీలలో దంపతులను కూర్చోబెట్టారు.
అఫీసు వారికీ ఆశ్చర్యం గా వుంది.
సాధారణంగా రిటైర్ వ్యక్తి మాత్రమే హాజరయ్యే వేడుక కు రావుగారు శ్రీమతి ని తీసుకుని రావడం చాలా వింతగానే వుంది.
ఆఫీసర్ రావుగారి వ్యక్తిత్వాన్ని పొగిడాక అతనికి గోడ గడియారం, పెద్ద సూట్కేస్ ,మొమెంటో అందజేసారు.
తర్వత వొరిద్దరు కొలీగ్స్ మాట్లాడేక రావు గారిని మాట్లాడమన్నారు.
రావు గారు లేచి మైకు ముందు నిలబడి మాట్లాడుతూ యిలా అన్నారు.
""ప్రియ మిత్రులారా!
నాకు జరిపిన యీ సన్మానానికి,అభిమానానికి కృతజ్ణుణ్ణి.
బహుశా మీరంతా మా అవిడను యెందుకు యీ వేడుకకు తీసుకువచ్చానో  అని ఆశ్చర్య పడతుండవచ్చు...చెప్తాను.
నేను యిన్నాళ్లు మీ మధ్య సుహృద్భవంతో నా విధులు సమర్థవంతంగా నిర్వహించ గలిగానంటే కారణం యీవిడ సహచర్యం.
నేను వేళకు ఆఫీసు కి చేరే యేర్పాట్లు అమోఘంగా చేసేదీవిడే.
నాకు కుటుంబ పరంగా యెటువంటి వత్తిడి లేకుండా చూసుకునే వారు.
పిల్లలు ..చదువులు.. ఆవిడే చూసుకునేది.
జీతం లెక్కలు..ఖర్చులు.. బందువులు..పెట్టుపోతలు..అన్నీ అవిడే.
నేనీ ఆఫీసు కి మానేజర్ నయితే నా సంసారానికి మానేజర్..గైడ్.. చుక్కాని..యీవిడ.
వితౌట్ హెర్ ఐయాం నధింగ్.
రిటైర్ అయ్యాక నాకు ఖాళీయే.
కానీ ఆవిడ..
ముందూ పనిచేసింది..
ఇప్పుడు కూడా తన విధులు క్రమం తప్పకుండా నిర్వర్తించాలి.
ఆవిడకు రిటైర్మెంట్ లేదు.
మనలా ఆవిడకు డిఏ,ఇంక్రిమెంటు,బోనస్ లేవు.
పని..పని..పని..
చివరి దాకా పనే.
అందుకే..
నా తరపున యీ 'పని దేవత'కు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరిముందూ తెలియజేసుకుంటునాను.
నా సన్మానం నాకు కాదు ..ఆవిడకే చెందుతుంది."
అంటూ తన మెడలోని దండ తీసి ఆవిడ మెడలో వేసారు.
ఒక్కసారి హాలంతా చప్పట్లతో దద్దరిల్లింది.

@@@@@@@
"బారెడు పొద్దెక్కింది..కలలు కంటూ నిద్రపోయే రోజులు ముందు ఉన్నాయి..
పెందరాళే లేస్తే,ఆఫీసు కెళ్లి రిటైర్మెంట్ పనులవీ చూసుకోవచ్చు...."

.శ్రీమతి మేలుకొలుపు! ఆమె ముఖాన్ని సునిశితంగా గమనించారు రావుగారు. "ఈ రోజు తో మీతో పాటు నాకూ విశ్రాంతి." అనే నిట్టూర్పు చాయలు గోచరమవ్వడం లేదు. "రేపటి నుండి మనది విశృంఖల విహార జీవనమే!" అనే దీప్తులు ద్యోతకమౌతున్నాయి.
చిన్నగా నవ్వుకుంటూ కలగా మారిన జీవితాన్ని వాస్తవంగా సాకారం చేయడానికి లేచారు రావుగారు.  
*********************"".                                      
With Kalyani Gauri Bhamidipati, వసంత శ్రీ,  Krishna Murthy Venkata Tenneti, Rajee Koduru,  Girija Rani Kalavala, Vempati Satish, Padmaja Mudumby, Sandhya Yellapragada, Abhinetri Vangala

Comments