చిక్కసం

చిక్కసం
@@@@
పెళ్లి పిలుపులు వాట్సాప్ లోనూ,పెళ్ళిళ్లు విమానాల్లోనూ చేసుకుంటున్న రోజులివి.
ఆధునిక యుగానికి అరవై యేళ్ల కిందట పెళ్లి పిలుపులు యెలా ఉండేవో పరిచయం చెయ్యాలని...

1965-69 ప్రాంతం లో నేను సోంపేట లో జిల్లాపరిషత్ హైస్కూల్ లో ఫోర్త్ ఫాం వరకూ చదివాను.
అప్పట్లో తెలిసిన వారి ఇళ్లల్లో పెళ్లి పిలుపులు గమ్మత్తుగా ఉండేవి.
ఒకశుభ ముహూర్తం లో ఉదయాన్నే పట్టు చీరలు కట్టుకుని ఆడంగులు, వారి వెనక మగవారు పెళ్లి పిలుపులకు బయల్దేరే వారు.
వాళ్ళ ముందు టకోరా(బాజా బజంత్రీలు)
తో కావిడి భుజాన వేసుకుని కావిడ అబ్బాయి నడిచే వాడు.
ఆ కావిడలో పెద్దపెద్ద  బిందెల లో పసుపు, కుంకుమ, వరిపిండి,సెనగపిండి,నూనె,కుంకుడు కాయలు వుంటాయి.
మంగళ వాయిద్యాలతో బయలుదేరి వీధి లో వున్న పరిచయస్తుల ఇంటికి చేరుకున్నాక పెళ్లిపెద్ద,భార్య వారింటి లోనికి వెళ్లి ఇంటి యజమానురాలికి బొట్డు పెట్టి ,వారింట జరగ బోయే వివాహ వేడుకకు బంధుమిత్ర సపరివారంగా రమ్మని ఆహ్వానిస్తూ,కావిళ్లు దింపించి అందులో ఉన్న పసుపు,వరిపిండి,కుంకుమ, కుంకుడు కాయలు ఓ పళ్లెం లో పెట్టి అందిస్తారు.
వాటితో నలుగు పెట్టి స్నానం చేసి శుభ్రంగా తయారై రమ్మని దాని ఉద్దేశం.
మళ్ళీ కావిడెత్తుకోని మరో యింటికి బయలుదేరతారు.
వీధి వీధంతా యీ తంతుని నిలబడి చూస్తుంటారు.
ఈ తంతుని 'చిక్కసం పంచడం' అంటారు.
చిక్కసం అంటే నలుగు పిండి.
ఆధునికత,బిజీ మింగేసిన తంతులలో ఇది కూడా ఒకటి.

Comments