నేనూ-నా పచ్చడి

పూర్వం రాజుగారెవరో వేటకు పోయి దారి తప్పో,అలిసిపోయో ఒక ముసలామె గుడిసె చేరడం..
అక్కడ అతడిని గుర్తించిన వృద్ధురాలు సమయానికి యేదీ లేక పెరట్లో వున్న గరిక తో పచ్చడి చేసి పెట్టడం..
దాని రుచికి రాజు మైమరచి పోయి,ఆ ప్రాంతమంతా ఆవిడకి దానంగా ఇవ్వడం..
అందుకే గరిక పాడో,గరిక వలసో యేర్పడటం..
వినేవుంటారు.
మన బోయినాల్లో,ఆవకాయ తర్వాత మాగాయ,ఉసిరి తదితర నిలవ పచ్చళ్లు తర్వాత ప్రముఖ స్థానంలో నిలిచేవి పప్పుల తో చేసుకునే పచ్చళ్లు.
వాటిలో ముఖ్యమైనవి
సెనగ,పెసర,కంది పచ్చళ్లు.
అందులో కంది పచ్చడి నాకంత నచ్చదు.
చిన్నప్పుడు కుంపటి మీద సన్న సెగ మీద కందిపప్పు దోరగా వేయించి,ఉడికించిన కందిపప్పు వాసన ,రుచి ఇప్పటికీ మరువలేని జ్ఞాపకం.ఇప్పుడైనా గాస్ మీద వేయించి, కుక్కర్ లో ఉడికిన కందిపప్పు కూడా పరవాలేదు.
అయితే పచ్చడి గా నాకంత నచ్చదు.
సెనగ పప్పు, కాసిని ఎండుమిరపకాయలు,జీలకర్ర వేయించి,కాస్త చింతపండు చేర్చి ,రోలు లెదా మిక్సీలో కాటుకలా రుబ్బి,ఎత్తకెత్తు ఉల్లిపాయలు, వెల్లుల్లి కాస్త ఎర్రగా వేయించి, పోపు పెడితే...ఆహా...
ప్రతి ముద్దా అమోఘం..
ఉల్లి పాయల విషయంలో నన్ను చాలామంది మాఇంట్లోనే వ్యతిరేకిస్తారనుకోండి.
"వారాలూ,వర్జాలూ లేకుండా ఏవిటీ ఉల్లి గోలా"
అంటారు.
చిన్నప్పుడు కంది గుండా, సొజ్జి,ఉప్పిండి,పచ్చళ్లతో విధిగా తినే రోజుల్లో మా వాళ్లు విసుక్కుంటూ-
" ఎక్కడి పొందరాడో పుట్టీసేడు మనింట్లో.".అనేవారు.
నా కిప్పటికీ పొందరాడెవరో తెలీదనుకోండి.
ఇహ నా కిష్టమైన  రెండో పచ్చడి పెసర పప్పు కటిక/నానబెట్టిన పచ్చడి.
కటిక పచ్చడి చాలా సింపుల్.
పెసరపప్పు, జీలకర్ర, ఇంగువ,ఎండుమిరప కాయలు వేసి మిక్సీలో వేసి నూరి పచ్చడి జారుగా చేసాక కాస్త నిమ్మ లేదా నారింజ కాయ రసం దానికి కలిపి తగినంత ఉప్పు వేస్తే రెడీ.
కాని తినే ముందు సాంబారు ఉల్లిపాయలు అరడజనో,డజనో ఓపిగ్గా వల్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి.
ఒక్కోముద్దతో ఒక్కో చిన్న ఉల్లిపాయ పాళంగా తింటుంటే-
సొరగ ద్వారాలు.. రంభ..ఇంద్రుడు..ప్రత్యక్షం..

మరో రకమైన పచ్చడిలో పెసర పప్పు నానబెట్టాలి.
గం సేపు నానాక,దాంట్లో పచ్చి/ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో నూరాక,నిమ్మ,/నారింజ రసం కలపాలి.ఇంగువ పోపు పెట్టాలి.
ఇదెక్కువగా మా ఇంట్లో ఉప్పిండి చేసినప్పుడు చేస్తారు.
మా బావమరిది దీనిని రామేశ్వరం పచ్చడి అంటాడు.
ఎప్పుడో రామేశ్వరం యాత్రకు వెళ్లినప్పుడు ఉప్పిండి తో చేసారట.

ఇదీ మా పచ్చళ్ల ప్రహసనం.
మీమీ పచ్చళ్ల అనుభవాలు,వైభవాలు తెలియజేసి మమ్మానందింప జేయ ప్రార్థన.
 ప్రజాభ్యం పచ్చడో భవంతు.

Comments