గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం
@@@@@@

మకరితో పోరు మాతంగవిభుని..అన్నట్టు మృత్యువు తో పోరాడుతున్న నారాయణని గాజు తలుపుల్లోంచి నిస్సహాయంగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు.
అతడి చుట్టూ వైద్యపరికరాలు..యంత్రాలు.. వాటి గొట్టాలు అతడి శరీరానికి రకరకాల ప్రదేశాల్లో అనుసంధానించబడి వున్నాయి.
భార్య లలితమ్మ నిర్విరామంగా లలితా సహస్ర నామాలు నిశ్శబ్దంగా చదవడం పెదాల కదలిక వల్ల తెలుస్తోంది.
ఆమె పక్కన ఆమె అన్న గారు,వదిన..మరోపక్క నారాయణ గారి స్నేహితుడు రమణ ,ఆయన భార్య వున్నారు.
కొడుకు అమెరికా లో వున్నాడు.
సంగతి చెప్పగానే తను చాలా ముఖ్యమైన బిజినెస్ వ్యవహారం లో వున్నానని మరీ అంతగా 'ఏదైనా' జరిగితే చెప్పమని అన్నాడు.
కూతురు ఆస్ట్రేలియా లో వుంది. కాని అల్లుడు ఆఫీసు పని మీద మరెక్కడికో వెళ్లేడట.
@@@@
"ఏవిటీ గజేంద్ర మోక్షం కథ"
విసుగ్గా అన్నాడు రామం,అంతవరకు చదివి.
"ఏం..ఏమైంది? అన్నాడు విశ్వం"
"మరేం లేదు.ఎంతసేపూ అమెరికా పిల్లలు,నిర్లక్ష్యం చెయ్యబడ్డ తల్లిదండ్రులు.. ఇదే టాపిక్కా!"
"ఏం..నిజం కాదా!"
కావచ్చు..ఒకరిద్దరు అలా ప్రవర్తించిన మాత్రాన అలా జనరలైజ్ చేసి కథలు రాసేయడమేనా!
నాణానికి రెండో వేపు చూడరా!
వాళ్ల ఇబ్బందులు, సాదకబాదకాలు చూడాలి కదా!
దగ్గరా దాపులో లేరు..రావాలంటే ఎంత ప్రయాస.."అంటున్న రామం మాటలకి అడ్డు వచ్చి-
"అన్నీ నిజమే..కానీ జన్మ నిచ్చిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత...."
విశ్వం మాటలకి అడ్డువచ్చి-
"చూడు బ్రదర్!
చిన్నప్పుడు తల్లిదండ్రుల తో వున్న బంధం పెద్దవుతున్న కొద్దీ పలచబడుతుంది..
చిన్నప్పుడు వాళ్లు కనపడకపోతే ఏడ్చి గగ్గోలు పెట్టే పిల్లడు కాస్త వయసు రాగానే వేరే వ్యాపకాలతో బిజీ అవుతాడు.
పెళ్లి జరగ్గానే వాళ్లకి మరింత దూరమవుతాడు.
నేను..నా భార్య..పిల్లలు అన్న చిన్న ప్రపంచం లో యిమిడిపోతాడు.
తల్లిదండ్రులు కూడా వాళ్ల తర్వాత సెకండరీ లెవెల్ కి దిగిపోతారు.
ఇహ వృద్ధాప్యంలో ఇదంతా సహజమే అని సర్దుకుపోతాడు.
నిజమా! కాదా!
నువ్వు ఎన్ని సార్లు మీవూరికి పెళ్లయ్యాక వెళ్లావు చెప్పు."
నిజమే.. నేను మా వూరికి వెళ్లి చాలా కాలమైంది.
ఎప్పుడూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకునేవాణ్ణి.
అసలు సంగతి రమకు,పిల్లలకు ఆ పల్లెటూరి వాతావరణం నచ్చదు.
వాళ్ళ ను వదిలి వెళ్లలేని నా బలహీనత నన్ను కూడా మా వాళ్లకి దూరం చేసింది.
మొన్న అమ్మ  మాటల్లో నాన్న గారికి నలతగా వుందని చెప్పింది.
తనేదో సర్ది చెప్పేడు వీలైనంత త్వరలో వస్తానని..
మళ్ళీ' ఏదైనా' కబురు తెలిస్తే గాని వెళ్లాలని అనుకోలేదు నిజానికి.
గభాల్న లేచి,
"థాంక్స్ రామం"
అంటూ వాడి చేతులు పట్టుకుని గబగబ బయటకు నడిచాడు విశ్వం ఊరు వెళ్లడానికి  సిద్ధపడుతూ.

Comments