నందికేశుడి నోము

నందికేశుడి నోము
@@@#@@@@@

తిండి కూడా బాధాకరంగా మారుతుందా!
అంటే 'నిజమే' అంటాను.
పడనివి తింటే రోగాలొస్తాయి...

మితిమీరి తింటే అజీర్ణం..

నాకు నా చిన్నప్పటి సంఘటన గుర్తుకొస్తోంది.

మేముండే ఖరగ్‌పూర్ (బెంగాల్) లో తెలుగు వారెక్కువ.

ఒకసారి అక్కడ బ్రాహ్మణులెవరో నంది కేశుడి నోము తలపెట్టారు.
వాళ్ల యేర్పాట్లు పూర్తి చేసుకుని వాళ్ల అంచనాల మేరకు తెలిసి బ్రాహ్మణ కుటుంబాల వారిని మగవారి తో సహా అందర్నీ పిలిచారు.

ఇక్కడ నాకు తెలిసినంతవరకు నోము గురించి చెప్పాలి.

ఈ నోములో- అట్లు,పాయసం,చిమ్మిలి,చలిమిడి,గారెలు,సాతాళించిన శనగలు...ఇంకే మున్నయో...
ఒక కొలత ప్రకారం చేస్తారు.
చేసిన వంటకం సూర్యాస్తమయం లోగా నలుగురికి పెట్టాలి.
ఆ తర్వాత మిగిలిపోతే ఆవుకి పెట్టాలి.ఇంకా మిగిలిపోతే గోతిలో కప్పెట్టాలి..సూక్ష్మ జీవుల కోసం.విస్తట్లో
వేసినది పారేయకూడదు.

ఇహ ప్రస్తుతానికొస్తే-

నేను చక్కా నా తోటి పిల్లలతో ఎగేసుకుంటూ నోము జరిగే వారింటికి పరిగెట్టేను..
అక్కడంతా హడావుడిగా వుంది.
పిల్లలు,పెద్దలు  తినేవాళ్లు తింటునారు లేచే వాళ్లు లేస్తునారు..

కోలాహలం..కేకలు..పాయసం వాసనలు..అరటి పళ్ల గుబాళింపులు..
పూజ ఘుమఘమలు..పట్టుచీరల గరగరలు..

నేను కూడా అందర్తో కలసి కొత్తబేచిలో కూర్చున్నాను.
మా ముందు విస్తరాకులు పరిచివున్నాయి.
ఎవరో ముత్తయిదువ గబగబ చేతిలో పాయసం గిన్నె,గరిట పట్టుకొచ్చి రెండేసి గరిటెల పాయసం వడ్డించింది.

నాకళ్లు మెరిసాయి.ముక్కు పుటాలు యాలకుల సువాసనకు పెద్దవయ్యాయి.
రసనగ్రంధులుత్తేజితమై
నీరు వూరసాగింది.

"కడుపునిండా తినండి నాయనా..కావాలంటే మారు వేస్తాను.మొహమటపడకండి. పారేయకుడదు"

అని చెప్పి వెళిపోయింది.
మొదటి కోటా అరమోడ్పు కళ్ళతో ఆస్వాదిస్తూ లాగించాను.
చివరి కొచ్చేసరికి మరో రెండు గరిటలు పడ్డాయి.
రెండోసారి మధ్యలో కొచ్చేసరకి మొహం మొత్తడం ప్రారంభమైంది..

కొద్దిగా వెగటనిపించింది ..

పాయసం కాకరకాయలా మారిపోయింది.

 అప్పటికీ పక్కనున్న ఎర్ర పచ్చడి నంచుకున్నా..ఫలితం లేకపోయింది.

ఎలాగో పూర్తి అవుతుండగా మరో రెండు గరిటలు పడ్డాయి.
ఎవరో ఒకమ్మాయి విస్తరి ఖాళీ అవడం ఆలస్యం వడ్డించేస్తోంది.
నాకు పొట్టంతా వికారంగా వుంది.

కళ్లలో నీళ్లు తిరుగుతునాయి.
చెయ్యి నోటిదాకా వెళ్లున్నా,లోపలికి పంపలేకపోతున్నాను.

ఎవరూ చూడకుండా తలవంచుకున్నాను.

విస్తట్లో పరవాన్నం భూతద్దంలో అమీబా లా వికృతంగా పరుచుకునుంది.
కళ్ల నుండి కారుతున్న నీటిచుక్కలు టపటప పరవాన్నం మీద పడుతున్నాయి.

నేరకపోయి వచ్చాననిపించింది.

జన్మలో పరవన్నం తినకూడదనిపించింది.
అప్పుడు-

నా పాలిట ఆపద్బాంధవుడ్లా నా ఎదురుగా కూర్చున్న పెద్దాయన 
" అరె..ఎమైంది..బాబు..ఎందుకేడుస్తున్నావు'
అనడిగాడు.
అందరూ చుట్టూ మూగారు.
పరిస్థితి అందరికీ అర్ధమైంది. 
అపసోపాలు పడుతూ ఎలాగో ఇల్లు చేరాను.
అప్పట్నుంచీ నందికేశుడి నోమంటే హడలు.

Comments