అపరిచితుడు

అపరిచితుడు
@@@@@@

ఒక్కో సారి మైండ్ ఎందుకో బ్లాంక్ అవుతుంది.

ఎంత తన్ను కున్నా అసలు గుర్తు రాదు.
అంతకన్నా పాతవి గుర్తుంటాయి.

రెణ్ణెల్ల కిందట ఫోన్ వచ్చింది.

"హలో! కృష్ణారావు గారూ!
నేనండి మోహన్ రావుని..సోంపేట లో ఫస్ట్ పారంలో...."

నాబుర్రలో రింగుల్ని ఎంత తిప్పినా సదరు మోహనుడు గుర్తుకు రాలేదు.

పైకి మర్యాదగా "ఓహో" అన్నాను.
అతగాడు అనర్గళంగా అప్పటి రోజులు.. మిగిలిన బెంచ్ మేట్ల విషయాలు..టీచర్లు..వారికి మేమంతా కలిపి పెట్టిన పెడపేర్లు..అల్లర్లు..

నాకన్నీ గుర్తున్నాయి గానీ ఇతగాడి మొహం..ఛస్తే గుర్తుకు రాలేదు.

మధ్యమధ్యలో మాట కలుపుతు గుర్తున్నట్టు నటిస్తున్నాను.
అతగాడు పాపం నా నటన పట్టించుకోకుండా పావుగంట దాకా వాగి..ఆయాసం వచ్చాక ప్రస్తుత కాలంలో కి వచ్చాడు.

అతడు విశాఖలో ఉన్నాట్ట.
నాగురించి చెప్పాను.

విశాఖ వస్తే కబురుపెట్టమని..వీలైతే రమ్మని..కాకపోతే తనేవచ్చి కలుస్తానని చాలా అభిమానంగా పిలిచాడు.

మా బావమరిది అక్కడే వేపగుంట దగ్గర ఉన్నాడని,తరచూ వెళ్తుంటాననీ,కరోనా వల్ల గాప్ వచ్చిందని ,మళ్లీ విశాఖ వచ్చినప్పుడు తప్పక కలుస్తానని హామీ ఇచ్చాక గానీ వదల్లేదు.

అయినా నాకతగాడెవరో గుర్తుకు రాలేదు.

తర్వాత కొద్ది కాలానికి మా బావమరిది కి సుస్తీ చేస్తే చూడ్డానికి కరోనా జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం జరిగింది .
బండిలో ఉండగా స్నేహితుడి (?)ఫోన్ వచ్చింది.

పరిస్థితి చెప్పి..ఎందుకయినా మంచిదని...హాస్పటల్ తిరుగుళ్లలో కలవడానికి రాలేకపోవచ్చని..మరేం అనుకోవద్దని చెప్పాను.

మరేం పరవాలేదు నాకు హాస్పటల్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వచ్చి కలుస్తానని చెప్పాడు.

సరేనన్నాను.
నా మీద నాకే కోపం వచ్చింది.
ఇంత జరిగినా అతడెవరో ఇప్పటికీ గుర్తు రానందుకు.

ఆశ్చర్యం.. పెళ్లి ఫోటోలలో మనం వెతుకుతున్న పొటో ఒక్కటీ మాయమైనట్టు..
అతడి జ్ఞాపకం ఒక్కటీ ఎలా అదృశ్య మైందో
 విశాఖ  వెళ్లడం..బావమరిది..హాస్పటల్..తిరుగుళ్లు..అన్నీ అయ్యాయి గానీ నేను ఫోన్ చెయ్యలేదు.

అంతరాత్మ గోలని నొక్కేసి తిరుగుప్రయాణం అయ్యాను.

ఇంటికి రాగానే భయపడుతున్నట్లుగానే అతగాడి ఫోన్..
నిష్టూరాలాడుతూ..

ఏవో కాకమ్మ కథలు చెప్పి వీలవనందుకు నేనూ చాలా బాథపడుతున్నట్లు యథాశక్తి నటించి క్షమాపణ చెప్పుకుని ఈసారి వచ్చినపుడు ఖచ్చితంగా కలుస్తానని చెప్పి అప్పటికి తప్పించుకున్నాను.

ఆ తర్వాత కరోనా అందర్నీ ఇళ్లలోనే కూర్చోబెట్టీడంతో పెద్ద బాధ తప్పిందనుకున్నాను కానీ ప్రతివారం విధిగా అతడి ఫోన్ వస్తునే ఉంది.
నేనలాగే నెట్టుకొస్తున్నాను.

అపరిచిత స్నేహితుడిని గుర్తుపట్టలేని నా అశక్తత ను తిట్టుకుంటూ.

క్షమించు నేస్తం!

Comments