,మినస్పాక్

మినస్పాక్
@@@@@

ఆవిడెక్కడో పేరంటానికి వెళ్ళగానే ,నా సోమరి మెదడు కార్ఖానాలోకి మినపసున్ని భూతం దూరింది.

ఆవిడ రాగానే  నాపాకశాస్త్ర కళా ప్రావీణ్యం తో సర్ప్రైజ్ చేయాలన్న తపనతో కిచెన్లోకి అడుగు పెట్టాను.
అంతకు ముందే యూ ట్యూబ్ లో 'ఎందుకయినా మంచిదని 'విధానమంతా చూసేను.
పై సొరుగులో వరసగా పేర్చిన పప్పుడబ్బాలలో మినప్పప్పు డబ్బా బయటకు లాగి,కొలగ్లాసులో ఒక గ్లాసు పప్పు వంపేను.
స్టౌ వెలిగించి‌మూకుడు పెట్టి,దాంట్లో పప్పు పోసాను.సిమ్ లో పప్పు వేగుతుండగా, బెల్లం డబ్బా తీసి చూస్తే ఎక్కడో అడుగున బెల్లం ముక్కలు అంతరిస్తున్న జాతి చిహ్నాల్లా కనపడ్డాయి.
లాభం లేదు..కొత్తది తియ్యల్సిందే.
స్టాకు లో ఉన్న బెల్లం తీసి తురిమే లోగా పప్పు మాడుతున్న వాసన ...
గభాల్న స్టవ్ ఆపేసి మూకుడు లోకి చూసాను.
నల్లటి పప్పు నవ్వుతూ పలకరిస్తోంది.
ఆదిలోనే హంసపాదు..
ఆ పప్పుని డస్ట్ బిన్లో పడేసి
మళ్ళీ మొదలెట్టాను.
ఈసారి అవసరమైన సామాను దగ్గరపెట్టుకుని పొయ్యి వెలిగించాలని డిసైడ్ అయ్యాను.
పప్పు,బెల్లం...నెయ్యి...
మళ్ళీ పప్పు మూకుడులో పోసి సన్నగా వేయింపు మొదలెట్టాను.
కాస్త దోరగా వేయించి పక్కన కంచంలో పెట్టుకున్నాను.
బెల్లం చిన్న ముక్కలుగా తరుగుతూండగా బెల్ మోగింది.
పక్క ప్లాట్ అబ్బాయి ఐదువందల రూపాయల చిల్లరకోసం వచ్చాడు.
అతనికిచ్చి పంపించి వచ్చాను.
ఆవిడ రాకుండా పనిపూర్తిచేసి మెప్పు పొందాలని నా తాపత్రయం.
మిక్సీలో పప్పు తిప్పి చూస్తే బరకగా ఉంది.
మరోసారి తిప్పి కాస్త మెత్తగా నూరితే..మా ఆవిడకి మెత్తగా నూరితే నచ్చదు.అంగిటికి అంటుకుపోతుందట.
సరే..
బెల్లం కాస్త తిప్పి పెడదామని చూసేసరికి కరెంట్ పోయింది.
"సర్రా" అనుకున్నాను.
పొయ్యిమీద పెట్టి పాకం తీసి కలిపేస్తే...
గత కాలపు పూర్వానుభవాలన్నీ వద్దని హెచ్చరించటంతో విరమించుకుని,
స్టీల్ గూటం తో బెల్లం ముక్కల్ని కంచంలో ఉన్న మినపప్పు పొడి లో వేసి దంచడం మొదలు పెట్టాను.
పది నిముషాలు పట్టింది.
ఇహ కొలత నెయ్యి తీసుకుని మూకుడులో ఉన్న మిశ్రమం పై చుట్టూ పోసాను.
బాగా కలుపుతూ ఉంటే జారుగా ఉంది. నెయ్యి కొలత కన్నాఎక్కువైందా... 
మళ్లీ పప్పు తిప్పి కలిపితే..
భగవంతుడా!
ఇలా అన్నం ఎక్కువైందని పప్పు..పప్పు ఎక్కువైందని అన్నం..
ఆవిడవచ్చే టైమయింది...
ఏం చెయ్యడం?
అల్మారాలో సెనగపిండి కనపడింది.
కాస్త కలుపుతే..
చూద్దాం.. చెయ్యకపోతే,కొత్త రుచులెలా వస్తాయి!
కాస్త సెనగపిండి పచ్చిదే జారు తగ్గే వరకూ కలిపేసాను.
అమ్మయ్య..ఉండ కట్టబడుతోంది..
దాదాపు ముప్ఫై ఉండలయాయి.
గబగబ ఖాళీ స్టీల్ డబ్బాలో వాటిని సర్దేసి..కిందపడిన పిండి,బెల్లం,నెయ్యి చుక్కలు తుడిచేసి, తడిగుడ్డతో శుభ్రం చేసి బయటకొచ్చి హాల్లో కూర్చున్నాను నంగనాచిలా.

బెల్ మోగింది.
చేతిలో ప్లాస్టిక్ సంచులతో వచ్చీ రాగానే అడిగిందావిడ.
" నెయ్యి సీసా పగలగొట్టారా! 
నేను ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ -"లేదే'"
అన్నాను బింకంగా.
బట్టలు మార్చుకుని వచ్చి కిచెన్లో దూరి పరీక్షగా చూసి-
"పొయ్యి వేడిగాఉంది.
కింద నెయ్యి జిడ్డు ,పిండి రేణువులు అక్కడక్కడా కనబడుతున్నాయి."
స్వగతం లా తనలో తనే అనుకుంటున్న మాటలు వింటూ-
"అమ్మో! ఆడవాళ్ళు షెర్లాక్ హోమ్స్ ని మించిపోయారే" అనుకుని హతాశుణ్ణయ్యాను.
సరిగ్గా శుభ్రపరచనందుకు నన్ను నేనే తిట్టుకుని దొంగలా వంటింటిలోకి నడిచి దాచిన సున్నుండల డబ్బా తీసి ఆవిడ చేతిలో పెట్టాను.

మూత తీసి చూసి ,చిన్న ముక్క తుంపి నోట్లో వేసుకుని చప్పరిస్తూ-
" స్వామీ..ఇది మినపసున్నా,మైసూరు పాకా .." అనడిగింది.
'అవునుగానీ దీనికేం పేరు పెట్టాలింతకీ' అనుకునీ-
మినస్పాక్ అనుకుని తినవోయ్..పేరులో ఏముందన్నాడు ఆంగ్లకవి .." అంటూ నేనూ ఒక ముక్క నోట్లో వేసుకున్నాను.

Comments