అవ్యక్త బంధం

(#గురుపూజాదినోత్సవ కథల పోటీలో వెయ్యి రూపాయల బహుమతి పొందిన నా కథ)

అవ్యక్త బంధం

@@@@@@

సోంపేట!

ఆంధ్రా,ఒరిస్సా బోర్డరు లో ఉందీ ఊరు.

స్టేషన్ లో దిగి బేగ్ భుజాన వేసుకొని  చుట్టూ చూసాడు గోపాలకృష్ణ.

ఊరు చాలా మారింది.

ఒకటా... రెండా!? ఇరవై ఏళ్లు దాటాయి. మళ్లీ ఇన్నాళ్లకి!

బయటకు వచ్చి జట్కా కోసం వెతికితే ఆటోలు కనపడ్డాయి.

అంతా కొత్తగా ఉంది.

అప్పట్లో స్టేషను ప్రాంతాన్ని 'కంచిలి 'అనేవారు.

సోంపేట ఊళ్లోకి పోవాలంటే జట్కాలే గతి.

గుర్రం టకటక లాడుతూ నాడాలు కొట్టిన గిట్టలతో రోడ్డుమీద పరిగెడుతుంటే,చాలకుడు

చర్నాకోల కర్రని చక్రం ఆకుల మీద తాటించిన చప్పుడు గమ్మత్తుగా ఉండేది.

ఒకటే రోడ్డు...దాదాపుగా మూడు మైళ్ళు పోతే సోంపేట ఊరొస్తుంది.

ఆటోలో చేరబడ్డ గోపాల కృష్ణ కళ్ల ముందు గతం కదిలింది.

         చిన్నప్పట్నుంచీ అనాథ గా పెరిగిన తను ముకుంద రావు మాష్టారు దయవల్ల అక్షరం ముక్క నేర్చుకోగలిగాడు.

ఎలిమెంటరీ, హైస్కూల్ చదువులు అతని ప్రోద్బలంతో నే గట్టెక్కాడు.

"సోంపేట లో ఎక్కడ సార్?"

డ్రయివర్ ప్రశ్నకి గతంలోంచి తేరుకుని, క్షణం ఆలోచించి--

"టౌన్ హాల్ వీధి లో దింపెయ్యి." అన్నాడు.

దూరంగా పాతాళేశ్వర కోవెల గంటలు వినపడ్డాయి.

చిన్నప్పుడు శివరాత్రి కి స్నేహితులతో నడుచుకుంటూ ఈ కోవెలకు రావడం, ప్రసాదంగా దొరికిన‌ లేత కొబ్బరిని అక్కడ కొండరాళ్ల మీద కొట్టుకుని తినడం..

దారి పొడుగునా ఉన్న మహా వృక్షాల ఊడలు పట్టుకుని కోతుల్లా వేలాడ్డం గుర్తొచ్చిందతనికి.

మళ్ళీ గతం లోకి జారి పోయాడు.

మెరిట్ మార్కులతో, స్కాలర్ షిప్పులతో

హైస్కూల్ చదువయ్యాక విజయనగరం మహరాజా కళాశాలలో మాష్టారే తనని చేర్పించి తెలిసిన వారి కొట్టు గదిలో ఉండటానికి ఆశ్రయం కల్పించారు.

సింహాచల దేవస్థానం వారి ఉచిత భోజనం కూడా ఏర్పాటు కావడంతో  చదువు నిరాటంకంగా సాగింది.

డిగ్రీ పూర్తయ్యాక తనని బాగా అభిమానించే ప్రిన్సిపాల్ గారి వదాన్యత వలన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసి మంచి జీతంతో  విదేశీ కంపెనీలో ఉద్యోగం దొరకడం దరిమిలా విదేశాల్లో కూడా కొంతకాలం గడపడం జరిగింది. 

మధ్యకాలంలో ముకుందరావు మేష్టారి వివరాలు తెలిసినా తను వెళ్లలేకపోయాడు .

మాష్టారికి శేఖర్  ఒక్కడే కొడుకు.

గారాబం వల్లనో చెడు సావాసాల కారణంగానో అతగాడికి చదువు వంట బట్టలేదు.

దుర్వ్యసనాలకు బానిసై ఇల్లు విడిచి కలకత్తా పారిపోయాడని విన్నాడు.

ఇప్పుడు జీవితంలో ఒక రకంగా స్థిర పడ్డాక మాస్టారి గురించి చింత కలగడంతో యీ ప్రయాణం.

మల్లావారి తోట, గ్రౌండు దాటి ఊరిలోకి ప్రవేశించింది ఆటో.

ఊరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

కాంక్రీటు జంగిల్ విస్తరించింది.

మాష్టారు ఎలా  ఉన్నారో!

అప్పుడప్పుడూ ఉత్తరాల ద్వారా సమాచారం తెలుసుకోవడమే..

మాష్టారేదీ బయటకు చెప్పరు. భార్యకు బావులేదని తెలిసింది ఆ మధ్య.

కానీ అప్పట్లో రాలేక పోయాడు.

క్రిందటి నెల ఇండియా కి తిరిగి వచ్చాక అతడి జీవితంలో అనూహ్య మైన మార్పులు చోటు చేసుకున్నాయి.

అతనితో పనిచేసే కొలీగ్ ని ప్రేమించడం పెళ్లి కూడా నిశ్చయం కావడంతో మాస్టారిని తన పెళ్లికి ఆహ్వానించాలని ప్రత్యేకంగా బయలుదేరాడు.

టౌన్ హాలు వీధి వచ్చింది.

చాలా మార్పులు జరిగాయి. వీధి మొదట్లో పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. వెడల్పాటి రోడ్డు వేయబడింది. అనేక భవంతులు లేచిపోయాయి. అప్పట్లో ఆ వీథిలో హెడ్మాష్టర్ దేవరకొండ నారాయణరావు గారి మేడ ఒక్కటే ఉండేది. ఆపక్కనే టౌన్ హాలు,రోడ్డు చివర ప్రభుత్వ ఆసుపత్రి ఉండేది.

ఇప్పుడెవరు ఎక్కడ ఉన్నారో!

పరిచయమైన ముఖాలేవైనా కనిపిస్తాయేమోనని చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు గోపాల కృష్ణ.

ఎదురుగా అతడు చదువుకున్న జిల్లా పరిషత్తు స్కూలు కనిపించింది.

అప్పుడు చదువు చెప్పిన టీచర్లంతా కళ్లముందు కదలాడేరు వరసగా.

అందరూ ఎక్కడ...ఎలా ఉన్నారో!

రకరకాల ఆలోచనలతో

 స్కూల్ గేట్ లో అడుగు పెట్టాడు.

****        *****     *****

హోటల్లో భోజనం చేసి స్కూల్లో తెలిసిన వివరాల ద్వారా మాష్టారి కోసం అన్వేషణ ప్రారంభించాడు గోపాలకృష్ణ.

ఎండ తీవ్రంగా ఉంది.

స్కూలు వాళ్లు చెప్పిన ప్రకారం మాష్టారు గారి భార్య చనిపోయింది.

మాష్టారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఊరికి దూరంగా ఏదో పేట గుడిశెలో ఉన్నారట.

అక్కడి పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్తుంటారట.

స్కూల్లో మాష్టారుకి మంచి పేరు ఉండేది. ఆయన లెక్కల టీచర్.

అయన లెక్కలు బోధపరుస్తే అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండేది. సందేహం రాకుండా, విసుక్కోకుండా చెప్పేవారు.

లెక్కలేకాదు, తెలుగు పాఠం కూడా ఆయన అద్భుతంగా చెప్పగలరు.

పారిజాతాపహరణం చెప్తుంటే సత్యభామ అలక,కృష్ణుడి అనునయం కళ్లముందు కదలాడేవి. 

పేట దగ్గిరయింది.

ఎదురుగా వస్తున్న పెద్దాయనని ఆపి మాష్టారు కోసం అడిగితే వెనక్కి తిరిగి చేత్తో చూపిస్తూ గుర్తులు చెప్పాడాయన.

గబగబ నడచి పర్ణశాల లా ఉన్న ఆ గుడిశెను చేరుకున్నాడు గోపాల కృష్ణ. తడికలతో కట్టిన దడి చుట్టూతా వుంది. లోపల పూలచెట్లు..

కాస్త లోపలికి నడిచాక ద్వారం.

తలుపు తట్టాడు.

ఎవరో లేచిన శబ్ధం.

తలుపు తెరచిన వ్యక్తి ని చూసి అవాక్కయ్యాడు.మాష్టారు. పోల్చుకోలేనంతగామారిపోయారు.

వయసుబాగా మీరి నట్టు కనిపిస్తున్నారు. కళ్ళజోడు సవరించుకుంటూ -"ఎవరూ?" అని ఎదురుగా నిలబడ్డ ఆజానుబాహుణ్ణి  అడిగారు.

వంగుని కాళ్లకు దణ్ణం పెట్తూ-"నేను మాష్టారూ, గోపాలకృష్ణని!" 

నమ్మలేనట్టు చూసిన అ వృద్ధ నయనాలలో మెరుపు గోపాల కృష్ణ దృష్టిని తప్పించుకోలేకపోయింది.

"నువ్వా గోపాలం? రా రా. ఎన్నాళ్లకి!"

ఇద్దరూ లోపలికి నడిచి ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నారు.ఒకటే గది.

రెండు పెట్టెలు, పుస్తకాలు..

గదికి ఒక పక్కగా కట్టిన తాడుమీద బట్టలు..ఓ మూల స్టవ్...వంటసామగ్రి....కొడుకు దూరమైనాక భార్య అనారోగ్యం...మరణం..వివరంగా చెప్పి ,ఉద్యోగానికి స్వచ్చంధ విరమణ చేసి ఇలా విడిగా బతుకుతున్నట్లు..చుట్టుపక్కల ఉండే బీద పిల్లలకు పాఠాలు చెబుతున్న విషయం గోపాలకృష్ణ కు చెప్పారాయన.

అంతా విన్నాక గోపాలకృష్ణ

తన గురించి వివరాలు చెప్పి, 

"మాష్టారూ..నేను అడగబోయే కోరికను కాదనకూడదు. మీరు మరి ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను.నాతోవచ్చేయండి. కాదనకండి.మిమ్మల్ని యిలా వదిలి నేను ఒక్కణ్ణీ వెళ్లలేను. అదీగాక నా కాబోయే శ్రీమతికి మిమ్మల్ని నాతో తెస్తున్నానని చెప్పాను.

ఆమెకూడా చాలా సంతోషించింది.

ఎందుకంటే ఆమె కూడా నాలాగే అనాథ.చిన్నప్పటి నుంచీ కరవైన పితృప్రేమను మాకు పంచండి.నాలో మీ శేఖరాన్ని చూసుకోండి..కాదనకండి..ప్లీజ్.." అన్నాడు కాస్త బరువైన గొంతుతో.

గోపాలకృష్ణ మాటలకు మాష్టారు క్షణం సేపు మౌనం వహించారు. ఆ క్షణంలో ఆయన ముఖంలో ద్యోతకమైన అనేక సందేహాలను గోపాలకృష్ణ గమనించ గలిగేడు.

"నాపై నీవు ప్రదర్శిస్తున్న అభిమానానికి ముగ్ధుడినౌతున్నాను, గోపాలకృష్ణా. కానీ...."

"నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరే మాష్టారూ. ఈ విధంగా నైనా మీ ఋణం తీర్చుకోనీయండి కాస్తంతైనా." అతడి గొంతు గాద్గదికమవ్వడం చూసి చలించిపోయారు మాష్టారు. గోపాలకృష్ణ కళ్ళలో నీటి పొర కమ్మింది. కొన్ని క్షణాలు మౌనం వహించాక అతడి ప్రతిపాదన కామోద ముద్ర వేశారు మాష్టారు.

మర్నాడు గోపాలకృష్ణ తో రైల్లో కూర్చున్న మాష్టారి కళ్ల ముందు తన సహోద్యోగి ప్రమీల గుర్తుకొచ్చింది. ఎవరో నయవంచకుడి దుశ్చర్య ఫలితంగా ఆమె అక్రమ సంతానంగా జన్మించిన గోపాలకృష్ణను తను ధైర్యం చెప్పి, భార్య అనుమతితో తనింటికి అనాథగా తీసుకుని రావడం, అతడిని తీర్చిదిద్దే బాధ్యత తను చేపట్టడం, 

ప్రమీల కొద్ది రోజులకే చనిపోవడం మొదలగు దృశ్యాలన్నీ మాష్టారి కళ్ళ ముందు పారాడాయి.

ఆమె సంస్కారానికి వారసుడిగా  గోపాలకృష్ణ మిగిలాడు.

గోపాలకృష్ణ కి చాలా ఆనందంగా ఉంది. మాష్టారు ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు.

అతడి కళ్లలో ద్యోతకమౌతున్న అనందాన్ని తృప్తిగా చూసుకున్నారు మాష్టారు.

నిజానికి తను ప్రేమించిన ప్రమీలకు తన ప్రేమను వెల్లడించకముందే అమె బతుకు నాశన మవడంతో ఆమె జ్ఞాపకం గా తను గోపాలకృష్ణ ను చేరదీసిన సంగతి ఎవరికీ ఎప్పటికీ తెలియదు.

ఆయన కళ్ల కొసలలో చిప్పిల్లిన కన్నీటి పొరను ఉత్తరీయంతో ఒత్తుకున్నారు. ఆ కన్నీటి వెనుక దాగిన నిజం గోపాలకృష్ణ కు తెలియకూడదు మరి! 

సన్నటి శబ్దం చేస్తూ,దూరాల్ని దగ్గరచేస్తూ రైలు ముందుకి సాగిపోతోంది.

          @@@@@@

Comments