దేవి విలాస్ -నెయ్యిదోశ

దేవీ విలాసం-నెయ్యి దోశ
@@@@@@@@@@

స్థలం.. విజయనగరం
కాలం...1970-76
మహరాజా గజపతుల వారి కోట ఎదురుగా ఉన్న బొంకులదిబ్బ! కుడిపార్శ్వపు     ఎదురుగా ఉన్న గుండాలవారి వీధి...

వీధిలో ప్రవేశించిన కొద్దిపాటి దూరంలో నే ఎడం పక్క ఎత్తరుగుల నండూరి వారి ఇల్లు..

ఆ ఇంటికి ఐదువాటాలు
పై అంతస్తులో  యజమాని నరసింహం గారు. దిగువ కుడివేపు పెద్ద వాటాలో టీ ఏజెంటుగారు వారి పెద్ద సంసారం.. ఎదురు చిన్నవాటాలో కమలమ్మగారని మహిళా కళాశాల జువాలజీ లెక్చరర్ ఒక్కరే ఉండేవారు.
అన్నట్టు మాఇంటి ఎదురు సందులోనే మన భావుక @లక్ష్మీతూము గారు ఉండేవారు.

ఆ ఐదు వాటాల్లో మూల వాటాలో రెండుగదుల ఇంట్లో నేను,మా బావలిద్దరు,వాళ్ల చెల్లి..
మాకు సంరక్షకురాలిగా మా మాతామహి గం.భా.స శ్వేతవస్త్ర కిరీటధారిణి రాయల్ బెంగాల్ టైగర్ గా మాచే ముద్దుగా పిలవబడే అమ్మమ్మ గారు( ఈవిడ ప్రస్తావన కుక్కగౌరీదేవి చలిమిడి పోస్ట్ లో వచ్చింది)

సోంపేట స్కూల్ చదువులు ముగించుకున్న మా బేచ్ కాలేజ్ చదువులకోసం అక్కడ కాపురం పెట్టిన రోజులు.
ఇహ జపం విడిచి లొట్టల్లోకి వస్తాను.

పొద్దున్న కాఫీ..తొమ్మిది న్నరకి భోజనం..
కాలేజి నుండి నాలుగు దాటాకవచ్చాక ఏ చేగొడి,జంతకలో టిఫిన్..టీ..
మళ్లీ ఏడులోగా రాత్రి భోజనం.
పది వరకూ చదువు.. నిద్ర..
ఇదే రొటీను.
అయితేమాకు పాకెట్ మనీ ఉండేది కాదు.నూనూగు మీసాల నూత్నయవ్వనంలో
స్నేహితుల వల్ల కొత్తగా సిగరెట్లు అలవాటు అయ్యాక కొంచెం కటకట లాడేం.

టైగర్ చాలా స్ట్రిక్ట్ .
అయితే కూరలు తెచ్చినపుడు పదీ పరకా లెక్కలు గడబిడ చేసి నొక్కేసేవాళ్లం.

కానీ హోటల్లో టిఫిన్లు ఆ కమీషన్ డబ్బుల్తో కుదిరేది కాదు.ధూపదీపాలకే కమీషన్ సరిపోయేది.

ముఖ్యంగా దేవివిలాస్ నెయ్యి దోశ  తల్చుకున్నప్పుడల్లా నోరూరిపోయేది. చాలా గొప్ప చరిత్ర ఉందా హోటల్ కి.
దానికి తోడు ముందువాటా ఏజెంట్ గారి మూడో అబ్బాయి వేణు శనివారం బజారు నుండి వస్తూ,అరుగుమీద కబుర్లాడుతున్న మా గేంగ్ ముక్కులమీద వేళ్లుంచి..
దేవీ విలాస్ అనీవాడు.
చిన్నతనం..చపలత్వం..

కస్పా వీధిలో ఆ హోటల్ ముందుకు వచ్చేసరికి అగరుబత్తుల సువాసనతో పాటు నెయ్యదోశ చుఁయ్యమన్న చప్పుళ్లు..నేతి వాసనలు రారమ్మని పిలిచేవి.
పెద్ద కమీషను కొడితే మా టైగర్ పసిగడుతుంది.అప్పటికే మా'ధూపాల' సంగతి చూచాయగా తెలిసిపోయింది.
నేను,మా బావ ప్లాన్ వేసాం.
సైన్సురికార్డ్ కొనాలని చెప్పి మా టైగర్ దగ్గర ఏభైరూపాయలు తీసుకున్నాం.మాబావ అంటే టైగర్కి కాస్త అభిమానం లెండి.తాతలా ఉంటాడని.
తిన్నగా దేవి విలాస్ కి పోయి రెండునెయ్యి దోశలు,కాఫీ లాగించాం ఆవురావురు మంటూ.
"రికార్డ్ మాటేవిటి?"
 అన్నాడు మా బావ మూతి తుడుచుకుంటూ.

"మా ఫ్రెండు గాడి రికార్డు దారిలో తీసుకుని ఇంటికి పోదాం.వాడికి రేపు కాలేజిలో ఇస్తానని చెబుతాను."
అన్నాను ఉల్లాసంగా కోరిక తీరిన తృప్తి తో .

రాత్రి ఆకలిలేక అన్నం కెలుకుతున్న మావేపు బెంగాల్ టైగర్ గుర్రుగా చూసింది
ఆతర్వాత సంగత్తెలిసాక బాజాబజంత్రీలు,బడితెపూజలు.

Comments