పితామహుడు

పితామహుడు
@@@@@@#

"ఠంఠణాం...లలితాశివజ్యోతి సమర్పించు లవకుశ""
అంటూ టైటిల్సవగానే కలియుగరాముడి సూర్య స్తుతి.. *సప్తాశ్వరథమారూఢం.."
వశిష్టుల వారి ఆగమనం, శ్రీ రాముడికి గోడ మీద పూర్వీకుల తైలవర్ణ చిత్రాలో,శిల్పాలో చూపిస్తున్నప్పుడు
అవి చూసిన తరువాత నాకు కలిగిన సందేహం..
పూర్వీకుల మాట దేవుడెరుగు..కనీసం మన పితామహుని చిత్రమయినా మన ఇంటిలో ఉండటం భావ్యం కదా!
నాకు ఊహ తెలిసిన దగ్గర నుండీ ఇదే ప్రశ్న వేధించేది.
సరే ..రాజులు,జమీందార్లు, లక్ష్మీపుత్రులు తైలవర్ణ చిత్రాలు ఉంచటంలో ఆశ్చర్యం లేదు.
పిండి కొద్ది రొట్టె..

మన బతుక్కి ఒక్క ఫొటో కూడా లేదంటే...

మా పితామహులు సూర్యనారాయణ గారు ఎలా ఉంటారో నాకు తెలియదు.
ఆ మాటకొస్తే,మానాన్నగారికే తెలియదు.
ఎందుకంటే మా నాన్నకి ఆరేళ్ల వయసులో ఆయన పరమపదించారు.
మా చిన్నాన్న కి మూడేళ్లు ట.
తల్లి చంకలో మారాం చేస్తూ పాలు తాగేవారట.
అయితే భర్తపోయాక సుమంగళి చిహ్నాలు తీసివేసి,తెల్ల పంచెలో కేశరహిత మైన తలపై కొంగు కప్పుకున్న తల్లి వికృత వింత రూపానికి జడిసి పాలు తాగడానికి జడిసేవారట.
ఆ సంగతి ఆయనే స్వయంగా చెప్పారు.
ఎంత హృదయవిదారకమో కదా!
తలచెడి ఇద్దరు కొడుకులతో బొబ్బిలి వదలి అన్నగారింట ఆద్రా(పశ్చిమ బెంగాల్) చేరిందావిడ.అన్నగారికి రైల్వే ఉద్యోగం..గంపెడు సంతానం..
ఎలాగో పెద్దవాళ్లయిన కొడుకులు ఇద్దరూ రైల్వే ఉద్యోగాల లో స్థిరపడిన తరువాత చిత్తరంజన్ లో పనిచేసే చిన్న కొడుకు దగ్గరే ఉండేవారు. తన మేనకోడల్నే కోడలిగా చేసుకున్నారు.

మానాన్నగారికి బయటి సంబంధం చేసారు.
మా ఇంట్లో ఆవిడ ఉండటం తక్కువే!
ఉన్న కొద్దినాళ్లలోనయినా ఆవిణ్ణడిగితే మా తాతగారి గురించి ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.
ఆయన ఉద్యోగం సంగతేమోగానీ ఆయుర్వేదం మందులు ఇచ్చేవారట.
ఒకసారి పొరుగూరు వెడుతున్నప్పుడు దొంగలు అటకాయించి కళ్లకు గంతలు కట్టి తమ నాయకుడి చికిత్సకోసం తీసుకుపోయారట.
చికిత్సానంతరం బోలెడు బంగారు నాణాలు దోసిట్లో పోసి, ఇంటికి పంపారట.
ఎంతవరకు నిజమో నాకూ తెలియక మా నాన్నగారి నడిగితే తనకూ తెలియదనీ,తన అరేళ్లప్పుడే తండ్రి ని కోల్పోయాననీ చెప్పారు.

ఇంతకీ చెప్పొచ్చే విషయం -
బొబ్బిలి లో ఉండే మా తాతగారి ఫొటో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
ఆ విషయమై మా నాన్నగారు ,చిన్నాన్న ప్రయత్నాలు కూడా చేసారు...ఆయన  ఏదయినా గ్రూప్ ఫోటో లో ఉన్నారేమోనని..కానీ దొరకలేదు.
అప్పట్లో ఛాయాచిత్రాలు లేకపోలేదు. మా మాతామహుని ఛాయా చిత్రం అలా సంపాదించి నదే.
కారణాలు ఏమైనప్పటికీ మా తాతగారి ఛాయాచిత్రం లేని లోటు నాకు ముల్లులా పొడుస్తునే ఉంది.

Comments