నా సణుగుడు

నా సణుగుడు
@@@@@@@@

చిన్నప్పుడు సర్కస్ లో బఫూన్లు,ఇతర కళాకారులు చేసే విన్యాసాలను గుడ్లప్పగించి చూస్తున్నప్పుడు -"అబ్బా! మనం కూడా ఎంచక్కా వాళ్లలా అలా చేయగలిగితే' అనుకునే వాణ్ణి.

అలాగే స్కూల్లో మెజీషియన్ టోపీ లోంచి పావురాలు,డబ్బులు తీయడం..మాయంచెయ్యడం చూస్తున్నప్పుడు..

వీధిలో గారడీవాడు చేసే టక్కుటమారాలు..

అలాగే పక్క ఇంటి కుర్రాడు సింగిల్ ఎటెమ్ట్ లో ఐయేస్ క్లియర్ చేసినప్పుడు..

మారుమూల పల్లెలో కూలినాలి చేసుకునే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివి స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు..

మనతో ఒకే బెంచీలో చదువుకున్న క్లాస్మేట్ విదేశాల్లో స్థిరపడినపుడు..

టీలు,పళ్లు,అమ్ముకుని,వీధి దీపాల్లో చదువుకుని దేశాధినేతలు,పారిశ్రామిక వేత్తలు అయినప్పుడు..

ఆశ్చర్యం కలుగుతుంది.

మనమెందుకు కాలేకపోయామన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్!
దేనికయినా ఫోకస్ ఉండాలి.
ఒక లక్ష్యం..దాని దిశగా అకుంఠిత పరిశ్రమ తప్పనిసరి.

రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే!

ఒక్కరోజులో రోము నగరం తయారు కాలేదు.
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల మత్తులో ఆడపిల్లల వెనక రోమియోల మాదిరిగా తిరుగుతూ,కుదిరితే ఎంజాయ్,కుదరకపోతే ఆసిడ్ ఎటాక్ అనుకుని, విలువైన జీవితాన్ని చేజేతులా స్వయంకృతాపరాధం వలన పాడు చేసుకుంటున్న యువత ముఖ్యంగా కళ్లు తెరవాల్సిన సమయం
చెడు ఆకర్షించినంతగా మంచి మనుషుల్ని ఆకట్టుకోలేదు.

ఇన్ని కబుర్లు చెబుతున్నా నాకు కూడా విద్యార్ధి దశ లో సరైన ఫోకస్ లేకపోయింది.
కారణం అంతవరకు మా ఇంట్లో కాలేజి మెట్లు ఎక్కిన వారు లేరు.
మాకు సరైన ది శానిర్దేశం చేసేవారు లేరు.

1965-69వరకూ సోంపేట లో ఫోర్తుఫాం వరకూ చదివి తరువాత చదువు కోసం నేను మా మేనమామ గారి పిల్లలం విజయనగరం లోని అద్దె యింట్లో కాపురం పెట్టాం.
మా కు వంటావార్పు,బాగోగులు మాఅమ్మమ్మ చూసేది(రాయల్ బెంగాల్ టైగర్).ఆవిడ ఆడ హిట్లరు లా మమ్మల్ని శాశించే ది కాబట్టి మేమంతా భయభక్తులు (?)తో మెలిగేవాళ్లం.

మా వాళ్ళు బెంగాలులో రైల్వే ఉద్యోగం చేస్తూ మాకు నెలనెలా డబ్బు పంపేవారు.
గుండాలవారి వీధిలోవున్న నండూరి వారి రెండంతస్తుల మేడ లో ఆరువాటాల లొ ఒక మూలవాటలో మే ముండేవాళ్లం.ఆ యింటి ఎదురు సందులో ఇప్పటి మన భావుక లక్ష్మీ తూము గారి పెద్ద కుటుంబం ఉండేది. యిప్పటికి ఆమె పెద్దన్నయ్య వెంకటరత్నం గారుంటున్నారు. 

మిగిలిన ఐదువాటాల్లో ఒకదాంట్లో జువాలజి లెక్చరర్ కమలమ్మగారు ఆవిడ ఎదురువాటాలో బ్రుక్బాండ్ ఏజెంటుగారుమాపక్కవాటాలొ కమీషన్ ఏజంటు శ్రీ రామచంద్రమూర్తిగార ఆ పక్కవాటాలో సంగీతం చెప్పే టీచరమ్మగారు, తమ్ముడు వాళ్లతల్లిదండ్రులతోపాటుండేవారు.శ్రీరామచంద్రమూర్తిగారు దీపావళికి చాలా మందుగుండు సామానులు తెప్పించి అందరిచేతా మొహమాటం లేకుండా దగ్గరుండి చేతుల్లో పెట్టి మరీ కాల్పించేవారు.
బొంకుల్దిబ్బ లో కూరలబజారు,ఎదురుగా రాజు గారికోట అందులో విమెన్సుకాలేజ్,ఎగువ మూడుకోవెళ్లు,సాయంత్రం కోటేశ్వర్రావ్ భాగవతార్ హరికధలు,కూరల్లోకొట్టేసిన డబ్బుల్తో బావమరిది తోకలసి వన్బైటు సిగరెట్లు తాగుతూ ఎమ్మార్కాలేజిహాస్టల్ ఫ్రెండ్ల గదులలో పిచ్చాపాటీ లు,అప్పుడప్పుడు సంస్కృత కాలేజీ వేడుకలలో మానాపురంశేషశాయి గారి ఉపన్యాసాలు, స్టేడియంలో జరిగిన తెలుగుమహాసభలు,మూడులాంతర్ల దగ్గర టీకొట్లో చాయ్ తాగడాలు,
ఎన్నో అనుభవాలు …అప్పట్లో నే మొదటిసారిగా నేరెళ్ల వారి ధ్వన్యనుకరణ వినడం జరిగింది. మంగళంపల్లి వారిని మల్లె పూల పల్లకిలో మేళతాళాలతో సత్కరించి వూరేగించడం చూసేను.
ఆ రోజుల్లోనే బొంకులదిబ్బ దగ్గర పాన్షాపు బెంచి మీద కూచుని చర్చలు జరిపే కొందరు పరిచయం అయ్యారు. తెలిసిందేమంటే వాళ్లు 21సెంచరీఅభ్యుదయ రచయితల సంఘసభ్యులని.కొద్దిసేపుమాటలయాక “పదండి అరతులం వేసుకుందాం”అన్నాడు ఆసంఘసభ్యుల్లోఒకడైన నిష్టల వెంకటరావు గారు.అర్దంకానట్టు చూస్తున్న నన్ను చూసి ,నవ్వుతూనే ఎదురుగావున్న ఇందిరాకేఫ్ లోకి దారి తీసాడాయన.అప్పుడర్దమయింది నాకు అరతులం అంటే వన్బైటూకాఫీఅని.
అంతవరకు అద్దెకు కొమ్మురిసాంబశివరావు నవలలు చదివే నాకు వారి వల్లనే రావిశాస్త్రిగారి రచనలు పరిచయం అయ్యాయి.
ఆ తర్వాతే రావిశాస్త్రి గారిని వదల్లేదు.
వెతికి వెతికి ఆయన రచనలన్ని చదివాను.


"ది మోస్ట్ డిలైట్ఫుల్ హేబిట్ ఇన్ ద వర్ల్డ్ ఈజ్ రీ డింగ్"
అన్నాడు ప్రఖ్యాత కథకుడు సోమర్సెట్ మామ్.
నిరుద్యోగ పర్వంలో చాలా చదివాను.
ఇంగ్లీషు నవలలు చదవటం అప్పుడే అల వాటయింది.
ముందుగా ఈజీ గా అర్ధమయ్యే పెర్రీమేసన్ కేసులు చదివాను.మెల్లగా అలవాటు పడ్డాక షెల్డన్,ఆర్చర్,ఆర్ధర్ హెయిలీ,ఇర్వింగ్ వాలస్,మపాసా,ఓహెన్రీ చదివాను.
పుస్తక పఠనం కూడా నిషా లాటిదే!
బాత్రూముల్లో కూడా చదివిన నవలలున్నాయి.
మనకి‌ మనని అనేకులతో పరిచయం కల్గిస్తాయి.ప్రపంచాన్ని చూపిస్తాయి.ఊహల్లో ఎగురుతున్న వాళ్లని భూమ్మీదకు తీసుకొచ్చి,చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేయిస్తాయి.
నామట్టుకి నాకు బాగా చదివిన వాళ్లే బాగా వ్రాయగలరన్న నమ్మకం పుస్తకాలు చదివాకే కలిగింది.
అప్పుడే వ్రాయాలన్న దురద కూడా అంతర్గతంగా పెరిగింది.
మళ్లీ జపం విడిచాను...లొట్టల్లో పడి..
పదో క్లాసు ఫస్ట్ క్లాసు ఒక్క మార్కుల తగ్గింది.టోటల్ మూడు వందల యాభై తొమ్మిది.
మహరాజా వారి కళాశాల లో  ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకోవాలో చెప్పే నాధుడు లేకపోయారు.
ఎంపిసీ తీసుకోడానికి లెక్కల భయం.
మిగిలిన గ్రూపుల అవగాహన లేదు.
అప్పుడు కనపడ్డారు మా సోంపేట స్నేహితులు.. పైడిశెట్టి సంజీవరావు.మల్లా రాఘవరావు.
'అమ్మయ్య' అనుకుని వాళ్లు ఏ గ్రూప్ లో చేరతారో కనుక్కున్నాను.
రాఘవరావు ఇంజనీరింగ్ చేసే ఉద్దేశం తో ఎం.పి.సి తీసుకున్నాడు.
సంజీవ రావు ది డాక్టర్ల ఫామిలీ.
సహజం గానే బైపిసి తీసుకుంటానన్నాడు.
మారాలోచనచేయకుండా బైపిసిలో చేరాను.
చేరాక తెలిసింది.
డిసెక్షన్లు చేయాలని..రికార్డు లు వ్రాయడం,బొమ్మలు నీటు గా వెయ్యాలని.
మొదటిసారి వానపాము నెర్వస్ సిస్టం ,బొద్దింక డైజెస్టివ్ సిస్టం చేసినపుడు వాంతి వచ్చింది.. భోజనం సరిగ్గా చేయలేకపోయాను.
హాయిగా సిఇసి గ్రూప్ తీసుకోవాల్సిందనుకున్నాను.
"అబ్ పచ్తాయె క్యాహోవే...ఖేత్! అన్నాడు కబీరు.
ఎలాగో ముక్కుతూ,ములుగుతూ ఇంటర్ అయిందనిపించాను.
రికార్డు బొమ్మలు డ్రాయింగ్ లో నిష్ణాతుడైన, మా మూడో బామ్మర్ది..మాతోపాటే బియే(హెచ్ఇసి) చదివేవాడు...
దయవల్ల గట్టెక్కించాను.
ఇతనితోటే ఆంధ్రా యూనివర్సిటీ లో సైన్స్ ఎగ్జిబిషన్ చూడటానికి మరో కజిన్తో కలసి రైల్వే వాళ్లమన్న ధీమాతో టికెట్ కొనకుండా వైజాగ్ వెళ్లడం...అక్కడంతా తిరిగి వస్తున్నప్పుడు అలసి పోయు మూడు బెర్తుల్లో గుర్రు పెట్టి నిద్రపోతున్న మమ్మల్ని టిటియి పట్టుకోవడం.. బెదిరించడం.. చేతివాచీ అద్దె సైకిల్ షాపు చిట్టి బాబు దగ్గర తాకట్డు పెట్టి ఫైను కట్టడం లాంటి అనుభవాలు కలిగాయి.
ఇంటరయ్యాకా,చెవులు ఘాట్టిగా నులుముకుని బీకాం సీటు కోసం ప్రయత్నాలు చేసాం.అయితే బికామ్ తెలుగు సెక్షన్ లో ఖాళీలు లేకపోవడం ,నాలాంటి అర్భకులు చాలామంది బీకాం లో చేరేందుకు ఆసక్తి కనపరచడంతో మానేజ్మెంట్ కొత్తగా బీకాం ఇంగ్లీషు మీడియం అడిషనల్ సెక్షన్ ప్రారంభించారు.
అందులో నాకూ సీటు రావడంతో హమ్మయ్య అనుకున్నాను.
కానీ ఆ సంతోషం కూడా ఎక్కువ సేపు నిలవలేదు.
అంతా ఇంగ్లీషు మయం.
లెక్చరంతా ఇంగ్లీషు లోనే.పుస్తకాలు ఎలాగూ ఇంగ్లీషు ..పరీక్షలో జవాబులు కూడా ఇంగ్లీషు లోనే వ్రాయాలి.
అదే కాకుండా ముఖ్యమైన బాధ అకౌంటెన్సీ..వ్యాస రామాయణం లాంటి దిబ్బ బాట్లిబాయ్ పుస్తకం..
డెబిట్, క్రెడిట్, బెలన్స్ షీట్!
ఆవుపెయ్యా కాదు గెదె పెయ్యాకాదు...లా తయారయింది నా పరిస్థితి.
ట్యూషన్లు ఉండేవి..కాని టీచర్లు తెలివిగా సంవత్సరం ఫీజ్ వాయిదాల్లో తీసుకునేవారు.
మనకంత స్తోమత లేదు.
ఏదో నా లాగే ఎంపిసి నుండి బయటకొచ్చిన గంటి రామకృష్ణ అనే బాల్య స్నేహితుడి దయవల్ల కొంచెం కష్టపడి పాసుమార్కులు తెచ్చుకుని డిగ్రీ సంపాదించాను.

ఇక్కడితో విజయనగరం అధ్యాయం సమాప్తం!

1976 లో డిగ్రీ పూర్తయ్యాక మళ్ళీ మానాన్నగారి దగ్గరికి ఖరగ్పూరు వచ్చే సాను.
.అప్పుడే వ్రాయాలన్న దురద ఎక్కువై 'భయం' అని మినీకధ రాసి ఆంధజ్యోతికి పంపేను.

పురాణం వారు అప్పట్లో సంపాదకులు. 
అది అచ్చయిన సంగతి నాకు తెలియగానే నాఆనందానికి హద్దుల్లేవు.
 పదిసార్లు అచ్చులో పేరు చూసుకుని మురిసిపోయాను.
అదేవూపులో మరో మినీకధ 'చిట్కా 'పంపేను.అది కూడ అచ్చవడం, పారితోషికంగా చెరో30రూ.అందుకోవడం జరిగింది.
అంతే.
నాలో వుత్సాహంకట్టలు దాటింది. సత్యజిత్‌రాయ్ 'కార్వస్ ' కథ అనువదించి శర్మగారికి పంపేను.అదచ్చయ్యాక కాలర్ కొంచెం పైకి లేపి మహాశ్వేతాదేవి సన్ అఫ్ గంగ కధ గంగపుత్రులు పేరు తో పంపేను.అది కూడాఅచ్చుకాగానే బెంగాలీ వాసన ఒదిలించుకుని కానన్డాయిల్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్సు కధ ఎవరుదోషి పంపేను.

.శర్మగారు అభినందిస్తూ దాన్ని కూడాప్రచురించేసరికి నా ఛాతీ వుబ్బి నాకు నేనేరావిశాస్త్రిగార్లా ఫీలయిపోయను.ఆపొంగు లోనే మరో నాలుగు కధలు వేరేపత్రికలకి పంపడం,వాటికి అడ్రస్ లేకపోవడం జరిగింది.
 కొంచెం చల్లబడ్డా దురదేమాత్రం తగ్గలేదు

అదిగో ...అలాంటప్పుడు వచ్చే డు మాదొడ్డమ్మ కొడుకు రామవరపు వేణుగోపాలరావ్.అప్పటికే అతను ఈనాడు డైలీలోపన్చేస్తున్నాడు.అప్పటి కి నిరుద్యోగి గావున్న నన్ను తనతోరమ్మన్నాడు.మారాలో చన లేకుండా ఓశుభ(?)ముహూర్తంలో హైదరాబాదు బయలుదేరాను.రాత్రి ట్రెయిన్ లో జోళ్లెవరోకొట్టేసారు.ఎలాగోలా హైదరాబాద్ లోదిగిఖైరతాబాదు చింతల్బస్తి లో వుండే మావాడింటికి చేరుకున్నాను.నవ్యశర్మ అప్పుడు అక్కడే పరిచయమయ్యాడు. అతను కూడా అక్కడ జెండా పాతాలనే వచ్చాడు.అఫ్కోర్స్...పాతేడనుకోండి.
కాళ్లకు జోళ్లు లేకుండా వెతుక్కుంటూ వచ్చిన నన్ను
'ఎవడీ బైతు గాడు' 
అన్నట్టు చూసాడు.

ఆమర్నాడు మావాడు నన్ను ఈనాడు ఆఫీసు కి తీసుకెళ్లాడు .అక్కడి వ్యవహారం చూసేక నాకనిపించింది 'నేను ఎంతబచ్చాగాణ్నో' అని.




మావాడు ముందు నన్ను ఈనాడు డైలి ఆఫీసు కి తీసి కెళ్లాడని చెప్పాను కదా.అక్కడ ఏదో ఇంగ్లీషు వ్యాసాన్ని చ్చిదాన్ని తెలుగులో అనువదించమన్నారు.

నేను స్కూల్లో లా మక్కీకిమక్కి అనువదించేను.తర్వాత ఏమైందో నాకేం చెప్పలేదు. మావాడు వాళ్ళ తో ఏదో మాట్లాడే క నా దగ్గరికి వచ్చి '"పదపద" అన్నాడు. ముగ్గురం (నేను,శర్మా,మావాడు) ఇంటికి వచ్చేం.

నాకు ఆత్రుతగా సంగతి తెలుసు కోవాలనివుంది.

ఆ సాయంత్రం ముగ్గురం ఆటోలో పెరేడ్ గ్రౌండ్‌ చేరుకున్నాం.నగరమంతా విద్యుద్దీపాల్తో కళ కళ్లాడుతోంది.చిన్న పట్నం నించీ వచ్చిన నాకు అంతపెద్ద నగరం జనలతో వాహనాల తో జనారణ్యం లా భయంగొలిపే సౌందర్య దేవత లా కనిపించింది. 
ఆ గ్రౌండ్స్‌లో ఓచోట మేం ముగ్గురం కూచున్నాం.

మావాడు గిరీశం లా నావేపు తిరిగి కొంత' జ్ఞానబోధ' చేసాడు.

ఆ మర్నాడు నన్ను మేగజైన్ సెక్షన్ ఇంఛార్జి చలసాని గారి దగ్గరకు తీసికెళ్లారు.
ఆయనకి వినికిడి సమస్య. ఆయన మాటాడితే ఎదటి వాళ్ళు అక్కడే సిద్ధంగా వున్న పేడ్ మీద జవాబు రాయాలి.అక్కడకూడా ఓ రెండు మూడు అనువాదాలు చేసేను.

ఎలాగో గండంగడిచి పిండం బయటపడింది. అన్నచందంగా అతని పర్యవేక్షణ లో వున్న చతుర మాసపత్రిక సబ్ ఎడిటర్‌(ఆఫీస్ అసిస్టెంట్)గా తీసుకున్నారు.అప్పటి కే శర్మ విపుల చూస్తుండేవాడు.

మొదట్నించీ బయటే చదువు ల నెపంతో వుండి పోవడంవల్ల నాక్కొంచెం హోంసిక్నెస్ ఎక్కువ. అస్తమానూ అమ్మా నాన్న ఖరగపూర్ గుర్తొస్తూండేవి.ఇక్కడ మావాడి ఇరుకు యింట్లో రెండేగదులు ఓవరండా. వీధరుగు మీద పడుకున్నా పడుకోనివ్వని దోమలు.ఆ ప్రేమ్నగర్ గలీ లో దోమలేగాని ప్రేమల్లేవు.
 నేను కూడా వాళ్ళవెనక వరండా లో శర్మ పక్కనే పడుకునేవాణ్ణి.

శర్మ తనదైనశైలి లో చాలా విషయాలు, పార్వతీ పురం విశేషాలు నాతో ముచ్చటించేడు.

మేమిద్దరం కలసి  కరటక దమనకుల్లా ఎన్నో జాగాలు తిరిగేవాళ్లం.

అలాంటప్పుడు ఒకసారి ఏజి ఆఫీసు రంజనికి మాయిద్దరి అభిమాన రచయిత లు రావిశాస్త్రి ,కాళీపట్నం వస్తు న్నారని తెలిసి హాజరయ్యాం.

ఆఫీసు లో ఆర్టిస్టు లైన పెమ్మరాజు రవికిషోర్,విశ్వనాథ్ మేటిఈనాటి శ్రీ ధర్,శివప్రసాద్ ,రమణజీవి అందరూ మాపట్ల అభిమానంగా వుండే వారు. జీతం మాత్రం సరిపోయేదికాదు.

ఈలోగ శర్మ హఠాత్తుగా పెళ్ళి చేసుకుని వేరేకాపురం పెట్టడంతో నేనొక్కణ్నే అయి పోయాను.

నేనుకూడా మావాడి దగ్గర్నుంచి మకాం మార్చి పిల్లిలా రెండుమూడిళ్లు చూసేను.
కానీ యీ లోగా మానాన్నగారు అర్జెంటుగా రమ్మని రైల్వే లో వుద్యోగ ప్రయత్నాలు జరుగుతూ న్నాయని చెప్పడం తో అప్పటికే తలవాచిన అనుభవాల్తో తట్టాబుట్టా సర్దేసి, చలసాని వారికి నిజం చెప్పే సి ,ఈస్టు కోస్ట్ రైలు ఎక్కేసాను.
పత్రికలు, పుస్తకాలు జీవితంలా బ్రతకడానికి  కావలసిన ముడిసరుకు నా దగ్గర లేక లేదా రాజీ పడలేక  ఉద్యోగం తో పాటు సెకండరీ గా ప్రవృత్తి ని మార్చుకుందామని  అనిపించింది

కలకత్తా మహానగరానికి నూటపదిహేను కి.మీ.దూరంలోవున్న ఖరగ్పూరు పెద్దజంక్షన్.

ఇక్కడ నుంచీ అన్ని వేపులకి వెళ్ళే రైలు మార్గాలు వున్నాయి. అతి పెద్ద రైల్వే కోలనీ,బోగీలు రిపేరుచేసే పెద్ద వర్కుషాపు,రైల్వే ప్రింటింగ్ ప్రెస్ వున్నాయి. ప్రపంచం లో అతి పొడవైన రైల్వే ప్లాటుఫారం రికార్డు స్వంతం చేసుకుంది.(ఇప్పుడు మారిందనుకోండి)
హిజిలీ
ఐ.ఐ.టి లో వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటుంటారు.

మా నాన్నగారు 1974రైల్వే సమ్మె లో పాల్గొన్లేదు కాబట్టి ,లాయల్ వర్కర్ కోటా లో నాకు జాబ్ దొరికింది.

ఇహ రైల్వేకాలనీ పెద్దదే గానీ ఎప్పుడో బ్రిటిష్‌ వాళ్లు కట్టిన ఇళ్ళ తో పాటు నాసిరకం సామానుపయోగించి మనవాళ్ళు కట్టిన అగ్గిపెట్టి ల్లాంటి యిరుకుముద్ద యిళ్ళు, వరసావావీ లేక దర్శనమిస్తాయి.

 ముఖ్యంగా కొత్తకోలీ,నింపురా వేపుండే గోల్కోలీ యిళ్ళు అప్పట్లో బ్రిటీష్ వాళ్ళు గుర్రపు సాలగా వాడేవారని నానుడి.ఒంటిద్వారంతో రైలు పెట్టి లాగ కిటికీ ల్లేకుండా వుండే ఆ ఇళ్ళలో జనాలు ఎండాకాలం ఎలా ఉండే వారో వూహాతీతమైన విషయం.
అయితే ఆఫీసర్ల బంగళా లు మాత్రం చాలా విశాలంగా బావుంటాయి. మధ్య తరగతి' గోచీకి పెద్ద గావంచా  కి చిన్న' వుద్యోగుల ఆవాసాలు మాత్రం అంతంత మాత్రమే.
ఇహపోతే పేరుకి బెంగాలు దేశమైనా అక్కడ బెంగాలేతరులే ఎక్కువ. అందులో మళ్ళీ సగంకన్నా ఎక్కువ తెలుగు వాళ్లే.అందుకే అందరూ దీన్ని సెకెండ్ ఆంధ్రా అంటారు. రిక్షా వాలాలు,కూలీల లో అధిక సంఖ్యాకులు తెలుగు వాళ్లే.
కాకపోతే హిందీ లోమాట్లాడుతుంటారు.విశాఖపట్టణం రైలు లో పన్నెండు గంటలు దూరం కాబట్టి వ్యాపారులు వారంవారం అవసరమైన సరుకులు తెచ్చి అమ్ముతుంటారు.

ఇక్కడ బెంగాలీ యులకి జాత్యభిమానం హెచ్చు. వుద్యోగుల్లో యీ సంగతి బాగా తెలుస్తుంది. కానీ వాళ్లలో ఓగుణం నాకు బాగా నచ్చింది. ఎంత తక్కువ ఆదాయం సంపాదించే వాడైనా తొందరగా స్వంతయిల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు.

నేను కూడ ఓ అయిదారెడినిమిది వందల చదరపుగజాలో అడుగులో డెసిమల్సో వాపీకూపతటాకారామ నిధినిక్షేపసహితంగా కొనుక్కోవడం గురించి మానాన్న గార్తోఆలోచించాను గానీ ఆయన చప్పరించి-
 'యీ బంగాళీవాళ్లు మనల్ని ఏనాడైనా తరిమెయ్యరని గేరంటి ఏమిటి?' అనగానే నేను కూడ వెనక్కి లాగీసేను.అంచేత ఆ కల యిప్పటికి కలగానే వుండిపోయింది.బెంగాలీలు అందరిని "దాదా "అని సంబోధిస్తూ వుంటారు
వయసుతారతమ్యాలు బట్టి కాకు(చిన్నాన్న) ,జెఠు(పెదనాన్న),దాదు (తాతగారు),స్త్రీలలో అయితే వయస్సు ల బట్టి దీదీ(అక్క),మాసిమా(పిన్ని),జెఠిమా(దొడ్డమ్మ) ,పిసిమా(మే నత్త) ,కాకిమా (చిన్నాన్నభార్య) పిలుస్తూ వుంటారు.
 ఇందులో మళ్ళీ ఓ గమ్మత్తు వుంది అమ్మాయి లు అబ్బాయిల్ని దాదా(అన్నయ్య)  అని పిలుస్తారు కానీ ప్రేమ లో పడే సరి కి అంతవరకూ దాదా గాపిలవబడ్డవాడే ప్రియుడు గా మారిపోతాడు.

ఇహ ఆఫీసు ల్లో దాదాలు కోకొల్లలు.మీరు దాదా అని పిలిచిన ప్రతివాడూ మిమ్మల్ని కూడా దాదా అనే పిలుస్తాడు.అయితే దాదాని కుదించి దా ని పేరు చివర కలిపే స్తారు
ఉదాహరణ కి మీపేరు ఏదో రామారావైతే 'రావ్ దా' అంటారు.
బెంగాలీ  బహు సరళమైన సుందరమైన తేలికగా పట్టు బడే భాష.కానీ వీళ్లకి వ అక్షరం వుండదు.వ ని భ గా పలుకుతారు.వుదాహరణ కి వీళ్ల ఉఛ్చారణ ఈ వాక్యం లో చూడండి.

"మిష్టర్ భెంకట్రాబ్ భై ఆర్యూ భాండరింగ్ యిన్ ద భరండా?"
ఇలా వుంటుందన్నమాట.
ఆఫీసు ల్లో కూడా స్ధానికుల కన్నా స్ధానికేతరుల అంకితభావం పనిపాటల్లోమనం స్పష్టంగా గమనించగలం.
నిజాయితీ పరులు వారిలోనూ లేకపోలేదు గానీ వాళ్ళు అల్పసంఖ్యాకులు.
కానీ వారు స్త్రీల కిచ్చే స్థానం అపురూపం.నేటికీ బస్సుల్లో స్త్రీలు జాగాలేక నిలబడి వుంటే కూర్చున్న పురుషులు లేచి వారికి జాగా చేస్తారు.అలాగే ఇంటి పనులు కూడ పురుషులే పిల్లలను తయారు చేయటం,వూడ్చటం,అలకటం,తోమటంతో సహా అవలీలగా చేసేస్తుంటారు.కావాలంటే రైలు ప్రయాణాల్లో ఈ సారి గమనించొచ్చు.

మరో  విషయం కూడా వారిలో నాకునచ్చేది నడిరోడ్డవనీ,ప్లాటుఫారం అవనీ గురుతుల్యులు,పెద్దవాళ్ళు ఎదురైతే కాళ్ళకు వంగి నమస్కారం చేస్తారు ఎంత హోదాలో వున్నప్పటికీ.
బెంగాలీయులు శాక్తేయులు. శక్తి రూపాలైన దుర్గ,కాళీ ఆరాధకులు.దసరాల్లో దుర్గాదేవిని, దీపావళిరోజుల్లో కాళీమాతని విశేషంగా పూజిస్తారు.వేలు,లక్షలు ఖర్చుతో చాలా అట్టహాసంగా జరుపుతారు. అందరి దగ్గర చందాలు కూడా బాగా వసూలు చేస్తారు.దానికి తగ్గట్టుగా కేంద్రం అదేసమయంలో బోనస్ యిస్తారు.
పెద్ద పెద్ద పెండాళ్లు వేసి,విద్యుత్ దీపాలలంకరించి కనులపండువుగా జరుపుతారు. కొన్ని నెలల ముందు నుంచే వీళ్ల దసరా హడావిడి మొదలై కాళీపూజతో అంతమవుతుంది. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు ,యితర అలంకరణ సామగ్రి తమతోపాటు సన్నిహిత బంధువులక్కుడా తీసుకుంటారు.
ఆరోజుల్లో వంటాపెంటాఎగ్గొట్టి షాపింగ్‌ చేస్తూ వీలయినంతవరకూ హోటళ్లని పోషిస్తారు.
బెంగాల్ స్వీట్లకి ప్రసిద్ధి. ఇక్కడి చెనామిష్టి(పాలవిరుగు తో చేయబడే రసగుల్లా వంటివి) మరెక్కడా దొరకవు.

సికిందరాబాద్ ఏవోసి గేటు దగ్గర ఒక బెంగాలీ " సోనార్ బాంగ్లా'' అని మిఠాయి దుకాణం పెట్టేడు. అక్కడ మాత్రం బెంగాల్ మిఠాయి, సింగడా అనబడే సమోసాలు,ఆలూ చాప్ దొరుకుతాయి.
భాద్రపద  బహుళ అమావాస్య..మన పోలాల అమావాస్య 
నాడు నాలగురోడ్ల కూడలిలో మైకులు పెట్టి
బీరేన్ భద్ర కృష్ణ పాడిన చండీపాఠ్(దుర్గా సప్తశతి..చాలా బావుంటుంది) వినిపిస్తారు.నేడు నా కాలర్ ట్యున్ ఇదే!
పంచమి నాడు రకరకాల డిజైన్లతో పెండాల్
కట్టి అందులో దుర్గా,లక్ష్మి, సరస్వతి, గణపతి, కుమారస్వామి ని ప్రతిష్ట చేస్తారు.
ఇహపోతే--
 బెంగాలీ వాళ్ళు రాజకీయాలంటే ఒళ్ళు మరిచిపోతారు.నలుగురు కలిస్తే చాలు రాజకీయ చర్చే.సబర్బన్ లోకళ్లలో ప్రయాణించే వారు మసాలా ముడి(మరమరాలు)తింటూ రాజకీయాలు నంజుకుంటూ పేకాడుతూ కాలక్షేపం చేస్తారు.
వీళ్లకి గాంధీ, నెహ్రూ లంటే ఒళ్లుమంట.నేతాజి ఆరాధ్యదైవం.
వీరికి లలితకళలు మీ ద మక్కువ ఎక్కువ. ప్రతి రెండు మూడిళ్లలో అబ్బయి లేదాఅమ్మాయి గాన/వాద్య పరిచయం కలిగివుంటారు.
వీరికి భాషాభమానమేకాక స్వజాతి అభిమానం కూడా చాలా హెచ్చు.ఆఫీసు ల్లో యీ విషయం స్పష్టంగా కనపడుతుంది. బెంగాలీరాని తెలుగు ఆఫీసరు మీద యధాశక్తి చాడీలు తమ స్వజాతి పెద్ద ఆఫీసరు కి చేరవేస్తారు.ఇహ యిల్ట్రీట్ మెంట్ సంగతి బెంగాలేతరులకు బాగా అనుభవమే.
అన్నట్టు దసరాల్లో విజయదశమి నాడు ముప్ఫై అడుగుల రావణాసురుడు ని కాలుస్తారు.

సరే..81 లో ఉద్యోగం...
ఇలా రెండేళ్ళు గడిచాక నా పెళ్లి మామేనమామ కూతురి ...(మా వదిన గారి చెల్లెలు )తో అయిపోయింది.
 ఆ తరవాత ఒక అమ్మాయి మరో నాలుగేళ్ల కు అబ్బాయి.
తర్వాత వాళ్ల చదువులు.. పెళ్లిళ్లు...
సంసారం.. సాగరం...

చివరాకరికి చెప్పొచ్చేదేంటంటే-
మనిషికి చిన్నప్పటి నుండే తన భావి జీవితానికి సంబంధించిన దృక్పథం.. లక్ష్యం.. ఉండాలి.
దానికి తగిన స్వయం కృషి అలవర్చుకోవాలి.
లేకపోతే-
ఆవుపెయ్య...గేదెపెయ్య కాకుండా చేట పెయ్యలా తయారవుతారు.

ఒకలక్ష్యం..ప్రణాళిక...కఠోర పరిశ్రమ మాత్రమే మనిషిని జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చగలవు.

సర్వేజనా సుఖినో భవంతు!!!
స్వస్తి!

Comments