అగ్ర శ్యాలకుడు

నేనూ- మా అగ్ర శ్యాలకుడు
@@@@@@@

"నానీ ! పచ్చ మతాబా పాళ్లు చెప్తావూ"

అని దీపావళి ముందురోజు వచ్చి అతృతగా అడిగేవాడు అప్పలు మావయ్య.

నాని అనబడే మా పెద్ద బావమరిది, బాసింపట్టు వేసుకుని, త్రాసు సరిగా వుందో లేదో సరి చూసుకుంటూ,నోట్లో కారాకిళ్లీ బిగించి ,తల వూపేవాడు.

అతడి చుట్టూ గంధకం,సురేకారం నల్లబొగ్గు,తారా జువ్వలకోసం పేకతో తయారు చేసిన గొట్టాలు,బిగింపు కోసం జనపనార తాళ్లు, కత్తి, సుత్తి,రోకలి, బ్లేడు,బంక,మేక పెంట్రికలు,
రకరకాల పేపర్లతో చేసిన మతాబా,సిసింద్రీ గొట్టాలు,
అలంకరణ కోసం దీపాల సెట్లు,, ప్రమిదలు,ఇంటి బయట అరుగు పక్క చెల్లెలు కోసం మురిపించుకొని చేసిన సగం కడుతున్న బొమ్మరిల్లు..అంతా కంగాళీ గా వుంది ఆ ప్రదేశం.

అతని వేపే అందరి దృష్టి.
ఆతని ఆజ్ఞలను పాలించేందుకు  వరసగా నిలబడ్డ ముగ్గురు అన్న దమ్ములు,బొమ్మరిల్లు పూర్తిగా కట్టించుకోవాలన్న ఆత్రుతలో చిన్న చెల్లెలు...

పక్క గదిలో నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుక్కున్న తండ్రి.. అదే మా మావయ్య గారు..

అదంతా గత వైభవం.
చూడవలసినదే గానీ చెప్ప నలవి కాదు.

1970 ప్రాంతం లో సంఘటన ఇది.

పశ్చిమ బెంగాల్ లో ఆద్రా అనే చిన్న వూరిలో రైల్వేలో చీఫ్ కంట్రోలర్ గా మా మావయ్య పని చేసేవారు.
నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో అందరి కన్నా పెద్దవాడు .
వయసులోనే కాక బుద్ధిలో కూడా.అప్పటి రోజుల్లో-

స్కూల్ ఫైనల్ పూర్తి కాగానే మా పెద్ద బావమరిది రైల్వే లో చిన్న వుద్యోగం తెలిసిన వాళ్ల ద్వారా సంపాదించేడు.
ఆ తర్వాత తన బుద్ధికుశలత కారణంగా,పనిలో మెలకువలు నేర్చుకున్నాడు.

మంచి పనివాడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఆఫీసే కాకుండా ఇంట్లో, వీధిలో కూడా తలలో నాలుకలా మారిపోయాడు.
"కామేశ్ కో దో ఓ సమాల్ లేగా"
ఆఫీసు మేనేజర్
"నానీ..ఈ గ్యాస్ పొయ్యి వెలగటం లేదు"
అమ్మ ఫిర్యాదు
"అన్నయ్య! నా టెక్స్ట్ బుక్స్ ని బైండ్ చెయ్యాలి"
చిన్న చెల్లి ప్రాధేయం

"నానీ..నాయనమ్మని అసన్ సోల్ డాక్టర్ కి చూపించాలి"-
మావయ్య ఆజ్ఞ.

"ఈ ఫేన్ పనిచెయ్యడం లేదురా"..నాయనమ్మ ఫిర్యాదు

"అన్నయ్యా ! మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు సాయం వస్తానంటే పురులియా కాలేజ్ కి ఎగ్జిబిషన్ కి ఇంట్లో పంపిస్తారని ..నిన్నడగ మన్నారు" -చిన్నచెల్లి అభ్యర్దన

ఇలా ఎన్నో..ఎన్నెన్నో!
అతనో వ్యక్తి కాదు..సైన్యం.
మా కుటుంబానికి లెజెండరీ ఫిగర్.
అతనితో ముడిపడ్డ అనుభవాలు ఎన్నెన్నో..
నలుగురు కుమార్తెలను కని,చదువులు చెప్పించి, వాళ్లని కూడా తనలాగే సకల కళా విశారదులుగా మార్చి,వాళ్లకి చక్కని సంబంథాలు చూసి పెళ్లిళ్లు చేసి తాతగా మారి,మనవలకు మనవరాళ్ల తో ఆడుకుంటూ నిత్య సంతోషి గా గడిపిన సత్య సాయి బాబా భక్తుడిని ఏడాది కిందట విధి చిన్న చూపు చూసింది.

రిటైర్ అయ్యాక గజపతి నగరం లో చిన్న ఇల్లు కట్టుకుని, అనాయాసంగా స్ప్లెండర్మోటార్ సైకిల్ మీద విశాఖ ,చుట్టుపక్కల ఊళ్లన్నీ చుట్టబెట్టే వాడు.
కొబ్బరి కాయల చిప్పలు శుభ్రం చేసి వాటితో సోఫా,ఉయ్యాల వంటి కళాకృతులు చేసేవాడు.
ఒక్క నిముషం ఖాళీగా గడిపేవాడు కాదు.
స్థానిక భక్తుల కు సాయంగా కాశీ,ప్రయాగ వంటి ఉత్తరదేశ యాత్రా స్థలాలు తిప్పేవాడు.

అటువంటి చైతన్య మూర్తిని
గత సంవత్సరం తన డెబ్భై మూడవ యేట
ముక్కులో లేచిన చిన్న కురుపు కేన్సర్ గా మారి సతాయించింది.

వయసురీత్యా కెమోని తట్టుకోవడం కష్టమని ఆయుర్వేదాన్ని నమ్ముకుని వ్యాధిని ముదరబెట్టడంతో, మొన్న గుండెలో నొప్పి రావడం తో స్టంట్ వేయడం జరిగింది.

అయినా తట్టుకుని డిశ్చార్జ్ అయ్యాడు.

కానీ కేన్సర్ రాక్షసి చాపకింద నీరులా తనవ్యాప్తి కొనసాగిస్తునేవుంది.
ముక్కు ద్వారా రక్తం ,బ్లడ్థిన్నర్స్ వాడటం వల్ల పలుచనై బయటకు వస్తోంది.థిన్నర్స్ వాడటం అరికడితే,స్టంట్ మూసుకుపోయి,గుండె పనిచేయటం ఆగిపోతుంది.
ప్రస్తుతం రోజుల్లో వుంది అతడి జీవితం.

అయిపోయింది..
ఒక అసహాయశూరుడు అస్తమిస్తున్నాడు..
ఒక గాంగేయుడు అంపశయ్య మీద రోజులు లెక్కబెడ్తున్నాడు..
ఒక పెద్దన్న..ఒక కుటుంబ వటవృక్షం వ్రేళ్ల తో సహా కూలడానికి సిద్ధంగా వుంది.
ఒక అమోఘమైన హస్తకళా నిపుణుడు చైతన్యరహితుడు కాబోతున్నాడు.

అతడితో నాకున్న అనుబంధం... సాన్నిహిత్యం ..జ్ఞాపకాలు కళ్లముందు కనిపిస్తూనే ఉంటాయి..

మరువలేని వ్యక్తిత్వం మా శ్యాలకుడిది.

అదిగో..దూరం గా  యముని మహిషపు లోహ ఘంటికలా ఫోన్ మోగుతోంది..
భయమేస్తోంది..

నేనా వార్త వినలేను.. 
ఏదయినా అద్భుతం జరగరాదా!

ఏ దేవుడో వచ్చి కాపాడ లేడా!

Comments