రావిశాస్త్రి గారు

రావి శాస్త్రి గారు ఒక ఎడిక్షన్..

అతనో వ్యసనం..

పట్డుకుంటే సారాలా,సిగిరెట్లా వదలలేం.

అతడి యాస అనితర సాధ్యం.

నేను విజయ నగరం లో ఇంటరో,డిగ్రీ లోనో వీధుల్లో పరిచయమైన21 సెంచురి అభ్యుదయ రచయితల ద్వారా పరిచయమైన రావిశాస్త్రి గారి రచనలను,అతని ప్రతిభావంతమైన శైలిని నేటికీ వదలలేక పోతున్నాను.

అతడి పాత్ర చిత్రణ ఏక కాలంలో పాఠకుడికి నవ్వు,ఏడుపూ తెప్పిస్తాయి.
మనల్ని చదువుతున్నంతసేపు పాత్రలు వెంటాడుతూ తమతో పాటే తిప్పుకుంటాయి.

అతని రచనలన్నీ వదలకుండా చదివేను.
రత్తాలు రాంబాబు వస్తున్నప్పుడు బెంగాల్లో ఆంధ్రజ్యోతి ఒకరోజు ఆలస్యంగా వచ్చేది.
రైల్వే ఏహెచ్ వీలర్ బుక్ స్టాల్ దగ్గర పదిరూపాయలు పట్టుకుని వాడు దుకాణం  సర్దుకునేదాకా అసహనంగా నిలబడే వాణ్ణి. పుస్తకం దొరికాక అక్కడే పక్కనే నిలబడి చదివేసి,ఇంటికి వచ్చి మిగిలిన వారికి చదవడానికి ఇచ్చేవాడిని.

ఆయన జన్మదినం జులై30 సందర్భంగా ఆయన శైలిని తప్పించుకోలేని అశక్తతతో అనుకరించి సినీవాలి మాండలిక కథల కోసం వ్రాసిన చిన్న కథ ని శ్రద్ధాంజలి రూపం లో సమర్పిస్తున్నాను.

పాపి
@@

"నాను నంజనే..కాదన్ను బాబూ!
కానీ నాబతుకు నాయిస్టమై బతకనేదు బాబూ!
సిన్నప్పుడు అయ్య ఎవర్తినో తగులుకొని, నేనేడాది పసిగుడ్డుగ వున్నప్పుడు ఏడకో ఎళిపోనాడు.
మాయమ్మ సోకాకారాలు పెట్టి,నన్ను మా అవ్వకాడొగ్గీసి పక్కింటోడితో లెగిసిపోనాది.
ముసిల్దాయి కాడ నానా తిట్లు తింటూ  గాలికీ,ధూళికీ పెరిగినాను..
సదువంటే యేటో,అచ్చరముక్క తెలీని నిసానీ ముండని.
కాని చాలా చూయిస్సేను బాబు..ఈ పాడు జీవితంల నాను పడిన కవుకులు పగోల్లక్కూడావొద్దు బాబు..
సిన్నప్పుడు ఆకలేసి పుణుకులోడి బండికాడ దొంగతనం సేస్తే మండ మీద అట్లకాడతో సురకలెట్టీనాడు.
కుసింత రంగు,ఒయిసూ ఒచ్చీతలికి వూరోళ్ల సూపులన్నీ నా మీదే వుండీవి.
నాకు నా ఒయిసుతో ఎలా బతకాలొ బాగా అరదమయిపోనాది.
అలాటయిముల పరిసయమైనాడు సివంసెలం గోడు.
ఎటో..పేఁవ..దోఁవ అనీవోడు.కలకత్తా తిప్పుతానని...రాణీ లాగుంచుతానని కబుర్లు సెప్పీవోడు.
ఆడెనకాల గుడ్డెద్దునాగ ఎల్లి కంపిని కనకమ్మ సేతిల పడిపోన్ను.
కనకమ్మ ఎనాగుంటదో ఎరికా..
సూరేకాంతం,సాయాదేవి కలిపి పుట్టినట్టుంటాది.దాని నోట్ల బూతుల్తప్ప మాటలుండవు.
దాని నోట్ల జర్దాకిళ్లీ రసం వూరతానే వుంటది..నల్లమచ్చల కొండసిలవ నోర్లా వుంటాది..
మగోడిగ పుట్టబోయి పొరపాట్న ఆడపుటక పుట్టీసింది.
దానికాడ నానెన్ని కవుకులు పడ్డానో ఈ జలమల సెప్పలేను.
రాచ్చసి ముండ మా ఒళ్లు వోడీసుకుని బిగినెస్సులు,ఒడ్డీ యాపారాలు సేసీది.
దానికాడ్నించీ మమ్మల్ని ఎవరిడుదల సేస్తారా అని ఎదురు చూసీదాన్ని..
ఎంకన్నబాబు,అప్పన్నబాబులు ఆళ్లనే సల్లగ సూసీవోరు గాని నాలాటోల్లని ఒంకరగానైనా సూసీవోరు కారు.
కనకదుర్గ తల్లైనా మాకస్టం ఇసారించి నాయం సెయ్యనేదు.
ఓ పాలి సిన్నప్పుడు అరికత లో బేపనబాబు మన కరవల బట్టే మనకి జలమలొస్తాయని సెప్పేడు
మరాల్లు సేసిన పుణ్య వేటి..
నాన్జేసిన పాపవేటి..
పోనీ పాపం సేసినానుకో..
అజామిలుడొ,గుననిధో బేపనోడు నానా పాపాలు జేయిస్సీ,ముండల్తో తిరిగి
కన్నోల్లని ఏడిపించీ
సచ్చేముందు దేవుడికి దీపమెట్టినాడని సొరగానికి ఎళ్లినాడు కాదా!
మరి నాను కూడా ఎన్ని చివరాత్రుల జాగారాలుండి,ఉపోసలుసెసి,శివుడి గుడికి ఎల్నేదా!
మరి మాకేటీ బతుకు?
మమ్మల్ని సూసీవోడే లేడా!
మామిలాగ బురదల పందుల్లా ఉండడము సర్దానా!
నువ్వే సెప్పు..నాయం సెయ్యి!
@@@@
తుళ్లిపడి నిద్రలేచాడు నరసింహం.
ఇదంతా కలా!
గ్లాసుడు మంచినీళ్ళు తాగి,
టైం చూసేడు.
మూడయింది.
తెల్లవారగానే ,నిన్న బ్రాతెల్ కేసులో పట్టుబడ్డ  కంపెనీ కనకమ్మ,ఆమె దగ్గర శోషింపబడుతున్న వేశ్యల కేసులో తీర్పు ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయాడు నరసింహం.

ఐదు కల్లా ఫోన్ మోగింది.
నరసింహం గారు రిసీవర్ అందుకుని- "హలో"
అన్నారు.
అట్నుంచీ ఎస్సై జంబులింగం గాబరాగా మాట్లాడుతున్నాడు.
సార..నిన్న రిమాండ్లో పెట్టిన కనకమ్మ ని రత్తాలు..అదే  సార్..పెద్ద కళ్ల లం..సారీ సర్..కుండపెంకుతో పొడిసీసింది సార్..రగతం..రగతం..ఆస్పత్రి కి తీసికెళ్లాం సర్.. ఆ ముం..సారీసర్..అమ్మోరమ్మలా అందరిమీదా తిరగబడి పోనాది సర్..బక్కగుంటుంది గానీ..నలుగురం కల్సి ఆపలేకపోయాం సర్.."-
నరసింహం గారి చెవుల్లోమాటలు వినపడటం లేదు.చిన్నప్పట్నుంచీ
తనకి జరిగిన అన్యాయాన్ని రూపుమాపాలనుకున్న రత్తాలు కాళికావతారం కనపడుతోంది.
తరతరాలుగా సాగుతున్న యీ దేహ వ్యాపారాన్ని,దాన్ని ప్రోత్సహిస్తున్న  పెద్దల్నీ
చట్టం లొసుగులను తెలివిగా వాడుకుంటున్న మగానుబావుల్నీ, అవినీతి లో కురుకుపోతున్న సమాజాన్ని తనకున్న పరిధిలో ఎలా సరిచెయ్యలో అర్ధం కాక ఆలోచిస్తునే వున్నాడు.

@@@

Comments