నేనూ మా అమ్మా నాన్న

అవన్నీ గత కాలపు వైభవాలు.
కాలం తీసికెళ్లిన జ్ఞాపకాలు
బంగారు బాల్యాలు..
తిరిగిరాని వసంతాలు...

ఎవరో వచ్చినపుడు బయటకు తీసిన ఆల్బం ఇంకా బయటే పడివుంది.
ఓ సారి తిరగేద్దామని తీసాను.

ముందు పేజిలో అమ్మ నాన్న.
ఇద్దరూ స్టూడియో లో కుర్చిలో  కూర్చున్న ఫొటో.ఒళ్లో బుంగమూతితో నేను.
వెనక మా అన్నయ్య.

అమ్మ కొద్దిగా లావయింది తర్వాత కాలంలో.
'చిన్నప్పుడు సళాకు లా సన్నగా ఉండేదాన్న'ని అమ్మ అనడవే తప్ప నేను సళాకుని,అమ్మని కూడా అలా చూడలేదు.
రిక్షా ఎక్కితే 'సర్దుకో' అని నాన్న అనడవే గాని అమ్మ సర్దుకున్నట్లు 'ఊం 'అని మూలిగేది..కాని ఇంచీ జాగా కూడా అయ్యేదికాదు.
పాపం..నాన్న అలాగే సర్దుకునీవారు.
ఆయన చాలా అమాయకులు.చక్కటి గొంతు.ఎస్రాజేశ్వర్రావు
పాటలు తమ్మెదా ఒకసారి, చల్ల గాలిలో అద్భుతంగా పాడేవారు.
అయనకి సైకిల్ తొక్కడం రాదు సరికదా నడపడం కూడారాదు.
జీవితాంతం రిక్షాలు..లేదా నడక.
ఆయనకి సినిమాల పిచ్చి ఎక్కువ.బెంగాల్ లో తెలుగు సినిమాలు ఒక హాలులో రెగ్యులర్ గా వచ్చే వి.
తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం అది.
అయితే మా ఇంటికి చాలా దూరం కాబట్టి రిక్షాలో తప్పనిసరి గా వెళ్లేవారు.
దూరదర్శన్ లో నెలకో రెణ్ణెలకో వచ్చే చచ్చుపుచ్చు ప్రాంతీయ భాషా చిత్రాలలో తెలుగు సినిమా కోసం పడిగాపులుపడి రాత్రి చూసేవారు.
మమ్మల్ని పిలిచినా కాస్సేపు చూసి నిద్ర వంకతో పడుకునేవాళ్లం.
అప్పట్లో నేటిలా ఇన్ని ఛానెళ్లు ఉండేవికావు.
కాబట్టి దూరదర్శనుడు చూపించే చిత్రహార్,ఇతర సాదాసీదా కార్యక్రమాలే గతి.
జీవితమంతా బోళాతనంతో గడిపిన వ్యక్తి రిటైర్ అయ్యేముందు సుగర్ వ్యాధి తో సరైన పథ్యం చేయక బలైపోయారు.

మా అమ్మ కూడా బోళా మనిషే.
వీధిలో అందరూ గున్నమ్మగోరు లేదా పంతులమ్మగోరు అని పిలిచేవారు.
తన ఊబకాయం వల్ల ఎక్కడికీ తిరగలేక అందర్నీ తన దగ్గరకే పిలిపించుకునేవారు.

నేను రెండేళ్ల,మూడేళ్ల వయసులోనే సంగతి గుర్తొస్తోంది.
అమ్మా,నాన్న సినిమాకి వెళ్లేటప్పుడు నేను అడ్డం పడకుండా మా చిన్నాయనమ్మ చిరంజీవమ్మ...ఆవిడ మా ఇంట్లోనే ఉండేది.ఆవిడకి కొడుకుల్లేరు.ఒక్కతే కూతురు...సంతాల్డీలో ఉండేది.
మా నాయనమ్మ ఎప్పుడూ చిత్తరంజన్ లో మా బాబు.. అదే మా చిన్నాన్న దగ్గరే ఉండేది.(ఈవిడ గురించి పితామహుడు పోస్ట్ లో ప్రస్తావించాను)
కొడుకు లేని మా చిన్నాయనమ్మ మా దగ్గర ఉండేది.
ఆవిడ మావాళ్లు సినిమాకు వెళ్తున్నప్పుడు నన్ను మరపించడానికి
పెరట్లో కి పెరుగు అన్నం కోళ్లకంచం(  కోళ్లకి భోజనం పెట్టే కంచం కాదండి బాబో...కంచానికి అడుగున బొడిపెలు ఉండేవి)లో కలిపి కథ చెప్తూ తినిపించేది.చాలా వరకు జానపద కథలే..మాంత్రికుడు..రాజకుమారి... హీరో..నాకు అప్పట్నుంచే కథల పిచ్చి. వింటూ మధ్యలో ఆతృత కొద్దీ
"దొంగవెధవ మాంత్రికుడు సచ్చేడా! "
 అడిగే వాణ్ణి.
పక్కపేజి తిప్పేను.
(మరోసారి)

Comments