పరిష్కారం



పరిష్కారం
@@@@@

ఫలక్‌నామా పరిగెడుతోంది.

రవి సెకెండ్ ఏసీ బెర్తు మీద కిటికీ దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడు.

భార్య వనజ ఎదుటి బెర్త్ మీద హాయిగా నిద్ర పోతోంది పసిపిల్లలా.

అడవారంతా ఇంతే నేమో అనిపిస్తుంది. ట్రెయిన్ ఎక్కగానే జోకొట్టినట్టు నిద్రపోతారు.
బహుశా బయల్దేరేవరకూ సర్దుళ్లు,వంటలు,ఇంటిపనితో అలసిపోయి బండెక్కగానే పని లేక నిద్ర వస్తుంది కాబోలు.

రవిలో ఆలోచనలు మళ్లీ పురులు విప్పాయి.

నలభై ఏళ్ళ సర్వీసు రైల్వే లో పూర్తి చేసి గతనెల రిటైరయ్యాడు.
సహోద్యోగుల వీడ్కోలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు.
ముందుచూపుతో రైల్వే క్వార్టర్ సరెండర్ చేసి స్నేహితుడి ఇంట్లో రిటైరయ్యే రోజు దాకా గడిపాడు.
ఇల్లు సరెండర్ చెయ్యకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కసారి దొరకవు.

మొత్తానికి సొమ్మంతా తిరగనక్కరలేకుండా ,రిటైర్ అయిన రోజే చెక్ ద్వారా బేంక్ అకౌంట్ లో జమ అయింది.

పెన్షన్ నెలకాగానే మొదలవుతుంది.
సామానంతా ముందుగానే హైదరాబాదు లో మావగారి ఇంటికి దగ్గరలో మరో ఇల్లు అద్దెకు తీసుకుని పంపేసాడు.
ఇప్పుడు ఇద్దరూ
కలసి హైద్రాబాద్ బయలు దేరారు.
కిటికీలోంచి పచ్చనిపొలాలు,చెట్లు కనువిందుగా కనపడుతున్నాయి.
చుట్టుపక్కల బెర్తులవాళ్లు కూడా సామన్లు సర్దుకుని ఎవరి కాలక్షేపం వాళ్లు వెతుక్కుంటున్నారు.
ఒంటిగాళ్లు పై బెర్తులెక్కి లాప్టాపుల్లో దూరిపోయారు.
రవికి
అన్నీ సరిగ్గా అమర్చిన భగవంతుడు ఏ పాప ఫలితంగానో,శాపకారణంగానో పిల్లలనివ్వడం మరచిపోయాడు.
ముందు కొన్నాళ్ల వరకూ అర్ధం కాలేదు.
తరువాత డాక్టర్లు..హకీములు..ఫకీర్లు..
నోములూ,వ్రతాలు ఫలితం చూపలేకపోయాయి.

చుట్టాలు ,తోబుట్టువులు కూడా ఎగబడ్డారు..తమ పిల్లలని పెంచుకోమని.
కాని తనకే ఇష్టం లేక దాటవేసాడు.
అప్పటికే నడివయసుకొచ్చాసారు ..ఇప్పుడు పెంపకం వీలవుతుందో లేదోనని అనుమానం.
ఉన్న ఇద్దరన్నదమ్ములు హైద్రాబాద్ లో బాగా సెటిల్ అయ్యారు.
ఇహ చిన్న తమ్ముడు, చెల్లి మాత్రం దిగువస్థాయిలో ఉన్నారు.
వాళ్లిద్దరే మిగతా వారి పై కాస్త ఆధారపడుతుంటారు.
 
తల్లి బతికున్నంతకీ ఇటూఅటూ తిరుగుతూ వారికి కావాల్సిన వన్నీ చేరవేసేది.
తను చూసీచూడనట్లు సర్దుకుపోయేవాడు.
వనజ గొలుసు,దుద్దుల సెట్ పోయినప్పుడు కూడా తామిద్దరూ పట్టించుకోలేదు.
ఆవిడ తాపత్రయం కొద్దీ పెన్షనంతా వాళ్లకే ధారపోస్తున్నా అన్నలతో పాటు ఏమి ఎరగనట్టే ప్రవర్తించేవాడు.

అవిడ కూడా కాలం చేసాక 
సరఫరాలు తగ్గాయి.
ఒకసారి మాత్రం ఇద్దరికీ చెల్లెలు మీద చాలా కోపం వచ్చింది.

కొడుకు కోసం చూసి ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక వసంత  తో-
"వదినా..మగపిల్లాడికోసం మరో అవకాశం తీసుకుందామనుకుంటున్నాం.
అబ్బాయి అయితే సరే..ఒకవేళ మళ్లీ ఆడపిల్ల పుడితే  నువ్వు  తీసుకుంటావా!
నీకు పిల్లతో ఇల్లు కళకళ లాడుతుంది." అంది.
వసంత ఒక్క క్షణం నిర్ఘాంతపోయి ఏమనలేక ఏదో పని కల్పించుకుని అక్కడనుండి వెళ్లిపోయింది.

రాత్రి తనకు చెప్పగానే కోపం, చికాకు కలిగింది.
ఏవిటీ మనుషులు.. మనస్తత్వాలు..

తమకు ఇష్టం లేదని గ్రహించారేమో ఇంట్లో వాళ్ళ ఆఫర్ల జోరు తగ్గింది.
పిల్లలు లేని దంపతులు కుక్కలు,పిల్లులను పెంచుకోవడం.. వాటిని కన్నబిడ్డల్లా సాకటం.. తనకు నచ్చేది కాదు.
అలాగని తనకు భూతదయ లేదని కాదు..
కానీ పశుపక్ష్యాదులను ఇంట్లో పెంచడం ఇష్టం ఉండేది కాదు.
అక్కడ బస్తీ పిల్లలెంతమందికో ఫీజులకు,పుస్తకాలు డబ్బు ఇచ్చేవాడు.

ఎదుటి సైడ్ బెర్త్ మీద,తల్లి పక్కలో పడుక్కున్న పిల్లాడు పాలకోసం ఏడవగానే ,తల్లి రెడీగా ఉన్న పాల బాటిల్ నోటిలో పెట్టింది.
చప్పరిస్తూ నిద్ర పోయాడువాడు.
ఆమె వయసు ఎక్కువ ఉండదు..పాతికేళ్లలోపే..
లేతమొహం..
పరిశీలనగా చూస్తే అమె పెద్దపెద్ద కళ్లల్లో నీళ్లు కనపడ్డాయి.
మొహం కళావిహీనంగా ఉంది.
కొండంత 
బాధను దాచుకున్న పూలతీగలా ఉంది.
బలవంతంగా రెక్కలు త్రుంచేసిన తూనీగ లా ఉంది.
ఏమైందో!
భర్తతో పోట్లాడి పుట్టింటికి పోతోందా!
తామెక్కే సరికే బండిలో ఉందామె.
అంటే కలకత్తా లోనే ఎక్కినట్టుంది.
ఎవరి బాధలు వారివి.

వనజ లేచిన అలికిడికి అటుచూసి,పైన చిక్కంలో నీటిసీసా నందించాడామెకి.
రెండు గుక్కలు తాగి,సీసా అందించి మళ్లీసుఖశయనానికి సిద్ధపడింది వనజ
మళ్లీ గతస్మృతులు ఉక్కిరిబిక్కిరి గా చుట్టు ముట్టేయి.
తండ్రి సర్వీసు లో ఉండగానే గుండెజబ్బు తో పోయాక ,అన్నదమ్ములు అప్పటికే స్థిరపడటం వల్ల కారుణ్యనియామకం క్రింద రవి కే ఉద్యోగం వచ్చింది.

అప్పటికే చిల్లరవేషాలు వెస్తున్న చెల్లెల్ని సంబంధం చూసి పెళ్లి చేసారు.
సోమరి భర్తతో పదేపదే పుట్టింటి ఆసరాకు ఎదురుచూడటం అలవాటుగా మారిందామెకు.దానికితోడు తల్లి వంతపాట.తండ్రి ఉద్యోగం రవికి వచ్చింది కాబట్టి రవి తల్లి అక్కడే ఎక్కువ కాలం గడిపేది.చెల్లి పెళ్ళై హైద్రాబాద్ వెళ్లాక తరచూ కూతురి కోసం హైదరాబాదు వెళ్లి అక్కడే ఎక్కువ కాలం గడిపేది.
అందుకే రవిని కూడా హైదరాబాదు ట్రాన్సఫర్ చేయించుకోమని పోరేది.

ఈ విషయంలో పెద్దన్నని మెచ్చుకుతీరాలి.
తను ఒక్కడే ఇక్కడ ఎందుకని,తల్లి బలవంతం మీద సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కు ట్రాన్సఫర్ పెట్టుకుందామని అనుకుని పెద్దన్నని సంప్రదించగానే భార్యాభర్తలు ఇద్దరూ ససేమిరా వద్దన్నారు.

ఇక్కడఉన్న చెల్లి, తమ్ముడు తమని కాల్చుకు తింటున్నారని,నువ్వుకూడా వస్తే బలయిపోతావనీ హెచ్చరించారు.

దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు.

ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉంది.
చెల్లి పెద్దకూతురికి పెళ్ళి అయింది.చిన్నది ఏదో కంపెనీ లో ఉద్యోగం చేస్తోంది.
తమ్ముడు కూడా ఏదోనిలదొక్కున్నాడు.
ఎవరికీ ఆర్ధిక పరమైన ఇబ్బందులు లేవు.
అయినా తనకి పిల్లలు లేకపోవడం తో తన సొమ్ము నాశించడం లో అర్ధం లేదు.
తను అక్కడ
తన జాగాలో బావమరది ద్వారా ఇల్లు కట్డిస్తున్నాడని తెలిసినపుడు పెద్దన్న తప్ప అందరూ చెవులు కొరుక్కున్నారు.
పిల్లా పీచు లేని తాము వాళ్లతోనే ఉండవచ్చుగదా అని వాళ్ల బాధ.
తనకన్నీ అర్ధమవుతున్నాయి.
భార్య ఏనాడూ నోరు తెరచి ఫలానాది కావాలని అడగలేదు.
ఉన్న జాగాలో పొదరిల్లు లాంటి ఇంట్లో చుట్టూ పూలమొక్కలతో ప్రశాంతంగా ఉండాలని కోరింది.
అదొక్కటీ తీర్చడానికి నిశ్చయించుకుని బావమరిది కి చెప్పి ఇల్లు రిటైరయి వచ్చే లోగా తయారు చేయించమన్నాడు.
అనుకున్నట్లు గానే ఇల్లు తయారైంది.
ఇంటీరియర్ డెకరేషన్ దిగాక తాపీగా చేయించవచ్చు.

తాము రేపు దిగిన వారం రోజులకే గృహప్రవేశం.
ఏదో స్టేషను వచ్చినట్లు సందడి..

కాస్సేపు పడుకుందామని నడుము వాల్చాడు.
@@@@@

ఆరోజే గృహప్రవేశం.
ఆహ్వానితులు,బంధువులు, అన్నదమ్ములు, చెల్లెలు అందరూ వచ్చారు.
ఇల్లు చాలా బావుంది.
ఆవరణలో పూలమొక్కలు.
సందడిగా ఉంది.
వచ్చిన వారంతా ఇంటిని మెచ్చుకుంటున్నారు.
ఇల్లు విశాలంగా ఉంది. 
పెద్దహాలు..వాస్తు ప్రకారం కిచెన్,పడక గదులు, పూజగది..
ఇల్లు అందరికీ నచ్చింది.
గేటు శబ్దం విని అందరూ అటు చూసారు.

అప్పుడు వచ్చారు ఇద్దరు ఆగంతకులు.
అందరూ ఎవరా అని ఆశ్చర్యపోతూ అడిగేలోపునే రవి ఎదురు వెళ్లి వారిని సాదరంగా ఆహ్వానించాడు.
అందర్నీ ఉద్దేశించి-

"" వీరు 'బాల పెన్నిధి' శరణాలయ నిర్వాహకులు.
అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పిస్తారు.
వారికి చదువు సంధ్యలు..వృత్తి విద్యలు నేర్పిస్తారు. 

మా తదనంతరం మా ఇల్లు,బాంకులో సొమ్ము వీరికి చెందాలని వీలునామా వ్రాసాను.
మాకు పిల్లలు లేరు.కానీ మా సొమ్ముతో కొందరు అనాథలకైనా చేయూత నివ్వాలని మా కోరిక.
అందుకే వీలునామా ప్రతిని ఈ రోజు మీ అందరి ముందూ వీరికి ఇవ్వాలని పిలిపించాను." అన్నాడు.

అక్కడున్న అందరూ ఒక్క క్షణం అవాక్కయ్యారు.

మరు క్షణం ఆవరణంతా చప్పట్లతో మారుమ్రోగింది.
@@@
భాగవతుల కృష్ణారావు
ఫోన్..7702552305

Comments