అమ్మయ్య

అమ్మయ్య
*********
మళ్లీ మా అమ్మే!

ముందు పోస్ట్ లో మా అమ్మ గురించి చెప్పానుకదా!

ఆవిడది భారీ శరీరం.
నేను ఎప్పుడూ ఆవిడని సన్నగా చూడలేదు.
కానీ ఆవిడ మాత్రం -
"మొదట్లో నేను' సలాకు' లా సన్నగా ఉండే దాన్ని" అనేది.

ఆ సలాకు..సన్నం నాకైతే ఎప్పుడూ కనపడలేదు.
అయితే పాత ఫొటో ఒక దాంట్లో ఆమె అత్తగారూ,ఆడపడుచు,మరిది సహితంగా ఉన్న ఒకేఒక రుజువు కనపడింది.
ఆవిడ ఛాయ తక్కువ...నలుపుకిందే లెక్క.
నేను పెద్దయ్యే కొద్ది అమె ఊబకాయం వల్ల పడే అవస్థలు కనపడేవి.
కదలడం దుస్సహమైంది.బయటకు వెళ్తే రిక్షా తప్పనిసరి. నాలుగడుగులు వేయడానికి ఆపసోపాలు పడేది.
ముప్పయ్యేళ్లుగా బెంగాల్లో ఉన్నా ఆభాషలేదా హిందీ నేర్చుకోలేదు.నిరక్షరాస్యత ఒక కారణమైతే తన పరిచయస్తులందరూ తెలుగు వారే కావడం మరో కారణం.
వీధరుగు మీద కూర్చుని వచ్చేపోయే వారిని పిలిచేది అవసరాన్ని బట్టి.
దానికి తోడు పేర్లు మరిచిపోతూ ఉండే ది.
"ఒరే..నల్లవెధవా..నీ పేరేంటీ..ఒకసారి రమ్మీ..." ఇలా పిలిచేది.వాళ్లకి బాష అర్ధం కాకపోయినా పిలిస్తోందని తెలిసిపోయి -"క్యా అమ్మా" అని వచ్చేవారు. బెంగాల్ కదా..చుట్టుపక్కలంతా హింది,బెంగాలి కుటుంబాలుండేవి.
రిక్షావాళ్లుతోనీ అలాగే మాట్లాడేది.
చాలామంది తెలుగువారే!
వాళ్లతో వచ్చీరాని హిందీ లో మాట్లాడబోయేలోగా వాళ్లే ఆమె అవస్థ గ్రహించి-
"నాకు తెల్సు మీయిల్లు..ఆ ఇస్కూలు కాడే కదా..పల్లక కూకో!"
అనీవారు.
ఆవిడ రిక్షా ఎక్కడం కూడా పెద్ద ప్రహసనమే!
"వెధవా! రిక్షా కదలకుండా పట్టుకో..పడి ఛస్తాను..నారాయణ నారాయణ" అంటూ పక్కనున్న వాళ్లు సాయంచేస్తే ఎక్కేది.ఆమె కూర్చున్నాక పక్కన మరొక పిల్లడికి మాత్రమే సరిపోయే జాగాలో మా నాన్నగారు గొణుక్కుంటూ ఇబ్బందిగా కూర్చునేవారు.
అంతవరకు బ్రేకులు పట్టి ఉంచిన రిక్షా వాడు రథమెక్కి నవ్వుకుంటూ పోనిచ్చేవాడు.

మా నలుగురు బావమర్దుల్ని ఇలాగే పిలిచేది.
"ఒరే నానీ..చిన్నా..అబ్బా..నీపేరేంటీ..రవణా...బాబ్జీ  ఇలారా"అని అందరి పేర్లు వల్లించేది.
మాపెద్ద బావ మరిది ఇప్పటికీ ఆమె ఉదారతను మరిచిపోలేదు.
మొన్న నా పోస్ట్ చూసి నాకే తెలియని ఆ విషయం తెలియజేసాడు.
తను 80 ప్రాంతాలలో మా ఊరు టీవీ కొనడానికి వచ్చేడు.వాళ్ల ఊరికన్నా మాది పెద్దది.
అప్పట్లో కలర్టీవీ కొత్తగా వచ్చింది.
బ్లాక్ అండ్ వైట్ కొందామనుకుంటే మా అమ్మ కలర్ టీవి కొనమని చెప్పిందట.
"అంత డబ్బు తేలేదత్తా "అంటే "నాగొలుసు తాకట్టుపెట్టి తెచ్చుకోరా" అందట.
తను మాత్రం అలా చెయ్యలేదని తెలుపునలుపుదే కొన్నానని,అమ్మ ఉదారత గురించి చెప్పాడు.

అమ్మ ఒక వరం!
అమ్మ మనతో ఉండటం మన అదృష్టం.!
అమ్మ లేకపోవడం శాపం..దురదృష్టం!
ఎల్లకాలం మనతో ఉండలేని అమ్మ
దైవం కన్నా మిన్న!
1935 భీష్మ ఏకాదశి నాడు పుట్టి,1990 మార్గశిర శుద్ధ షష్టి ..సుబ్రహ్మణ్య షష్టి నాడు నిష్క్రమించిందామె.

యా దేవీ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

Comments