పోలిక

పోలిక
******
(ఇంతకు ముందు వచ్చిందే గానీ మరోసారి)
ఏమనుకోండి... ఆడవాళ్లు చీరల్ని,నగల్ని, మనుషుల్ని మనకన్నా బాగా గుర్తుపడతారు.
మనం మాత్రం-

కొందర్ని కొన్ని ప్రదేశాల్లో ఎలా చూస్తూ వుంటామో వారిని అలాగే చూస్తేనే గుర్తించగలం.

వాళ్లే మరోచోట మరో వస్త్ర ధారణతో కనిపిస్తే గుర్తు పట్టలేం.

ఉదాహరణకు పెట్రోల్ పంపు కుర్రాడు.. గేసబ్బాయి..స్కూల్ ప్యూన్..మాల్ లో పనిచేసే కుర్రాడు..ఎంత గింజు కున్నా వాళ్లని మరో చోట కనిపిస్తే గుర్తు పట్టలేం.

శ్రావణ శుక్రవారం బొబ్బట్లు,పులి హోర సమేత పాయస భక్ష్యాదుల నారగించి, భుక్తాయాసంతో కాస్సేపు నడుం వాల్చి..కాస్త సర్దుకున్నాక లేచి ఫోనందుకుని కుర్చీ లో కూల బడ్డాను.
అప్పటికే పనులన్నీ చక్క బెట్టుకుని సాయంత్రం పేరంటానికి తయారీలో వున్న ఆవిడ తీక్షణంగా తాలిబాన్ నాయకుళ్లా చూస్తూ-

" అలా నిద్రమొహంతో సెల్లు పట్టుక్కూచోకపోతే, కాస్త మొహం కడుక్కుని,తలదువ్వుకుని ఆ పొట్ట మీద కురచ బనీను కనపడకుండా ఓ చొక్కా వేసుకోవచ్చుగా.
పేరంటాళ్లు వచ్చే వేళవుతోంది.." అన్న వార్నింగ్ జారీ చేసి తన తయారీ హడావుడి లో పడింది.

"అవును కదూ! " అని నాలిక్కరుచుకుని,లేచి మొహం తొలిచి,తలదువ్వి,ఇస్త్రీ షర్టు వేసుకుని యథాస్థానం గ్రహించాను.

అరగంట వ్యవధిలో ఒక్కొక్కరూ రావడం ప్రారంభించారు. హాల్లో వున్న నన్నోసారి విష్ చేసి లోపలికి వెళ్లారు.

మొదటావిడ అరవమామి.
తర్వాత పంజాబీ డ్రెస్..ఆవిడ పక్కన పరికిణి ,జాకెట్టు తో వాళ్ల పాప..
దాదాపు గంట సేపు చీరల,డ్రెస్ ల ప్రదర్శన చూసాను. 

గమ్మత్తుగా పిల్లలందరినీ సంప్రదాయ దుస్తులు ధరింపజేసిన మాతలు మాత్రం డ్రెస్ ల్లోనే దర్శన మిచ్చారు.

అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది..
ఎవరో తెలిసిన మొహమే..కానీ గుర్తు పట్టలేక పోయాను.

ఆలోచిస్తూ  కుదరక మా ఆవిడనే అడగాలని డిసైడ్ అయ్యాను.
ఆఖరి ముత్తయిదువని కూడా పంపించాక మా ఆవిడ' హమ్మయ్య' అంటూ నాపక్కన కూలబడింది.

నాందిగా-
" ఈ చీర చాల బావుందోయ్..నీకు బాగా నప్పింది. కంచిలో కొన్నదేనా!" అన్నాను.
చురుగ్గా నా వేపు చూసి -
"ఫోటోగ్రఫిక్ మెమరీ అంటారు.. నా చీరలే గుర్తుండవు.
మద్రాసు లో మా వదిన కూతురి పెళ్లికి పెట్టిన చీర."
అంది.
సర్దుకుంటూ- అవును కదూ..అసలు అమ్మవారి కి ధారపోసిన చీరే కట్టుకోవచ్చు కదా!'"
అన్నాను.
"ఏడిసినట్టుంది.దానికి పాల్స్,జాకెట్ రెడీ చెయ్యకుండా ఎలా కడతాను.అయినా కొత్త కాటన్ చీర   బుంగలా వస్తుంది.ఒకసారి తడిపాక గానీ కట్టుకోలేం."
నాలిక మరోసారి తెగేటట్టు కరుచుకొని,
" అవునవును..అది సరేగాని చివర్లో వచ్చిన అమ్మాయెవరు? ఎప్పుడూ చూడలేదే!" అన్నాను.
రాజనాల ఎన్టీ రామారావు ని చూసినట్టు..చురచుర లాడుతూ చూసి-

"మన పక్కింటి వాళ్ల పద్మ ..
మొదటిసారి చీర కట్డింది.
ఎప్పుడూ గౌన్లో వుంటుంది కదా..పేరంట మని చీర కట్టుకోమంది వాళ్ల అమ్మ."
"ఔరా!" అనుకుంటూ హౌరా బ్రిడ్జి లా నోరు తెరిచి హాశ్చర్యపోయాను.

Comments