తస్మాత్ జాగ్రత్త

తస్మాత్ జాగ్రత్త
*************
తాగుబోతులు తాగని  వారిని యద్దేవా చేస్తారు.
"గౌతమ బుద్ధుడ్రా "అని వెక్కిరిస్తారు.
అప్రయోజకుడిలా ,బబ్రాజమానం గాడిలా ,సోషల్ మూవ్మెంట్ తెలియని అనాగరిక పశువులా ట్రీట్ చేస్తారు.
అంతే కాకుండా వాడ్ని కూడా తమ గుంపులో లాగాలని విశ్వప్రయత్నం చేస్తారు.ప్రలోభాలు పెడతారు.
"కొంచెంతాగు..తర్వాత నువ్వే కావాలంటావు."
"జీవితంలో అన్నీ అనుభవించాల్రా నాయనా!"
"రేపు మీదకెళ్లాక దేవుడడిగితే జవాబు చెప్పుకోవాలా!"
"ఒట్టి డ్రింకే..కంపెనీ కోసం చప్పరించు"
ఇలా ఉంటుంది.
ఇలాగే లంచగొండులు లంచం తీసుకోని వారినీ, నాన్వెజ్జులు వెజ్జుల్నీ సతాయిస్తారు.
బలహీనులైనవారు వారి మాటల మాయాజాలంలో పడి వ్రతభంగం చేసుకుని వాళ్లదారిలో నడుస్తారు.
ఒకరో ఇద్దరో ఛాంధసులు నాలా మడి కట్టుకు కూర్చుంటారు.
మేం బెంగాల్లో ఉండే వాళ్లమని చెప్పాను కదా!
మా కు ఇరుగుపొరుగు అంతా మాంసాహారులే!
బెంగాలీ,బీహారీ,ఒరియా...
వాళ్లలో కూడా బ్రాహ్మణులు ఉన్నా వాళ్లు మత్స్యమాంసాలు తింటారు.
మేము కోడి గుడ్డు కూడా ముట్ట మంటే వాళ్లకు అంతులేని  హాశ్చర్యం!
ఎలా ఈ గడ్డిగాదం,పప్పుల మీదాధారపడి బతుకుతున్నామోనని  జాలి.
చేపలని జలపుష్పాలంటారు.
చేప శుభం.
కూతురి అత్తవారింటికి వెళ్లినపుడు చేప ముక్కుకి తాడు కట్టి వేలాడదీసుకుని వెళ్తారు.
ఇహపోతే-
మా పక్కింటి బెంగాలీ అమ్మాయి మహా గడుసుది.సూర్యకాంతానికి తక్కువ... ఛాయాదేవికి ఎక్కువ.
ఆమె కూతురు మా అమ్మాయి ఒకే వయసు వారు.
కలసి ఆడుకునేవారు.
ఒకసారి వాళ్లింట్లో ఆడుకుంటున్నప్పుడు తన కూతురికి ఉడకబెట్టినగుడ్డు  తినిపిస్తూ, పక్కనే ఉన్న మా అమ్మాయి నోట్లో ఓ పిసరు పెట్టింది.
మా అమ్మాయి గభాల్న నోట్లోంచి ఆ పదార్దం తీసి ఆవిడ చేతిలో పడేసింది.
అంతేకాక డోక్కోవడం మొదలు పెట్టింది.
మా ఇంటి కొచ్చి విషయం చెప్పి ఒకటే నవ్వడం తో మా అమ్మ గారు కోపంగా
"నీ చేతులు పడ..నీకేం పోయికాలం" అని తెలుగులో అనేసి మనవరాల్ని తీసుకుని పూజ గదిలో కి వెళ్లారు గంగనీరు జల్లడానికి.
తస్మాత్ జాగ్రత్త!

Comments