ముష్టిగోల

ముష్టిగోల
********
అన్నిటికన్నా సులువు ముష్టెత్తడం.
ప్రత్యేక ప్రహేళిక గళ్లుగీసి,పెన్సిలు,రబ్బరు పక్కనే పెట్టుకుని మొదలుపెట్టిన కాస్సేపటికే ఎందుకో లేచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
సరే అదయ్యక మళ్లీ కూర్చోబోతూ చూసేసరికి రబ్బరు.. అదేనండి ఇరేజర్ కనపళ్లేదు. చతుర్నేత్రాలతో ఎంత వెతికినా కనపడలేదు.
ఓపికలేక హోం మినిష్టర్ గారిని పిలిచి అడిగాను.
ఏమాటకామాటే చెప్పుకోవాలి.ఆవిడ వెతకడంలో సిద్ధహస్తురాలు.
మనకి ఎదురుగా ఉన్నవే కనపడి ఛావవు.
ఆ విషయమై పానిపట్టు యుద్ధాల లెవెల్లో తీవ్రంగా విభేదించినా ఆవిడే గెలిచేది.
తప్పు నా వేపే ఉండేది.
ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం ఆవిడ అలవాటు.
మనం దానికి క్వయిట్ ఆపోజిట్.
ఇంతకీ ఆవిడ వెతికినా దిక్కుమాలిన రబ్బరుముక్క దొరకలేదు.
ఇటువంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డజను పెన్సిళ్లు రెండు మూడురబ్బర్లు  కొని ఉంచుకున్నాను.
పోయినవి పోగా ఒకటేనా ఉండదా అని ఆశపడ్డాను.
కాని అక్కడా నిరాశే ఎదురైంది.
కిం కర్తవ్యం?
ఎదురుగా నాలుగోక్లాస్ చదువుతున్న లక్కీ కనపడ్డాడు.
వాడ్ని దగ్గరకి పిల్చి-
"ఒరే బాబూ! రబ్బర్..అదే ఇరేజర్ ఒకసారి తెస్తావా?"
అనడిగాను.
వాడు గెంతుకుంటూ వెళ్లి ఇరేజర్ తెచ్చి ఇచ్చాడు.

మనకి కావల్సిన వస్తువేదో సమయానికి దొరక్కపోతే గిజగిజలాడి చెయ్యి విరగ్గొట్టుకున్నంత పనవుతుంది.
వంటచేస్తున్న మేడమ్ కి సమయానికి నిమ్మకాయో,పచ్చిమిర్చో కనపడకపోయినా...
గ్రాఫ్ వర్క్ చేస్తున్న స్టూడెంట్ కుర్రాడికి రబ్బరు,పెన్సిల్ దొరకకపోయినా..
పేపరు చదువుతూ కళ్లజోడు ఎక్కడ పెట్టారో తెలియక వెతుక్కుంటున్న తాతగారికైనా...
అసహనంగా,చికాగ్గా ఉంటుంది.
అ ఒక్క వస్తువుకోసం బజారుకి వెళ్లడానికి బద్ధకంగా ఉంటుంది.

అలాంటి సమయాల్లో పక్కింటి ఆంటీలు,అంకుళ్లు,పిల్లలు మనకు ఎనలేని సాయం చేసే ఆపద్భాంధవులు గా కనిపిస్తారు.
పక్కింటాయన యాక్టివాకోసం-
పంకజం చీనీ,కందిపప్పుకోసం-
మూడో ఇంటాయన ఐరన్ కోసం..
ఎదురింటిపాప కరివేపాకు కోసం..
మిలిటరీ పెద్దాయన పేపరుకోసం..
మూలవీధి ముకుందం పత్రికల కోసం పంపే కథలు స్టేపుల్ చేయడాని వచ్చి టీ తాగడం కోసం..
ఇలా అరువులు...చేబదుళ్లు..
వీటిని చూసే ముళ్లపూడి అప్పుల అప్పారావులు బేంకుల దగ్గర కూడా అప్పులు విరివిగా వాడుకుని సుఖపడి మొండిచేయి చూపుతున్నారు.

ఈ బాధలు పడలేమనుకున్నవారుమానాభిమానాలకతీతంగా హాయిగా యాచక వృత్తిలోకి దిగజారిపోయారు.
కానీ పెట్టుబడి లేని వృత్తి.
ఈ మధ్య కొంతమంది యాచకుల దగ్గర చనిపోయాక వెతికితే వారి ముష్టి బొంతల్లోంచి లక్షలాది రూపాయల దొరికాయని పేపర్లో చదువుతూ ఉంటాం.
అందులో కొందరు పగలల్లా అడుక్కోవడం,రాత్రిళ్లు వడ్డీవ్యాపారాలు,ఇతర చీకటి పనులు చేయటం,విలాసవంతమైన జీవితం గడుపుతారని వినికిడి.
ఇతి ఋణసహస్ర పర్వపురాణం  సమాప్తః

Comments