వందేమాతరం

శ్రీమతి చదలవాడ లక్ష్మీ పద్మావతి గారి తండ్రి గారు కీ.శే.కోనేరు కృష్ణమూర్తి గారి సంస్మరణార్థం వారి సౌజన్యంతో భావుక కార్యనిర్వాహక వర్గం నిర్వహించిన సంక్రాంతి-2024 కథలపోటీ లో ₹1000 గెలుపొందిన నా కథ
పాఠకులందరికీ పండగ శుభాకాంక్షలు!

వందేమాతరం
*****************
     భారతమ్మ గతుక్కుమంది. చుట్టూ చూసింది. ఎదురుగా పెద్ద గేటు ...

     'సంజీవని వృద్ధాశ్రమం' అని వ్రాసుంది ఆర్చి మీద.
బయట లాన్లో చాలామంది ముసలి వారు కూర్చున్నారు. కొందరు పచార్లు చేస్తున్నారు. పనివాళ్ళు పనుల మీద హడావుడిగా బయటికి, ఇంట్లో కి తిరుగుతున్నారు.

   'తనెందుకు వచ్చిందిక్కడకి?' ఆమెకేమీ పాలుపోలేదు.
తను ఎక్కడికి ఎలా బయలుదేరి వచ్చిందో ,ఇక్కడికి ఈ తెలియని ప్రదేశానికి ఎలా చేరుకుందో గుర్తుకు రావడం లేదు.గమ్మత్తుగా తనెవరో తన   పేరేమిటో కూడా గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.జనాలు ఎవరి   పనుల్లో వాళ్లున్నారు...

     భారతమ్మ కి చికాగ్గా ఉంది. దాహంగా ఉంది.
అప్పటికి సాయంత్ర మైంది.గేటు దగ్గర గూర్ఖా  తనవేపు  మాటిమాటికి చూడ్డం గమనించి పైట భుజాల చుట్టూ వేసుకుని నగలు కనపడకుండా కప్పుకుంది.

    " బొద్దింక మీసాలు వీడూనూ..రాచిప్ప మొహంతో ఆడదాన్నెరగనట్టు అలా చూడటమేవిటో'!"మనసులో   తిట్టుకుంది.
    
     'ఏం చెయ్యడం!? చీకటి ముసుగు  కప్పుకోడానికి నగరం ఆయత్తమవుతోంది. వీధి దీపాలు కూడా వెలిగాయి.తనేం చెయ్యాలి?తనవారెవరూ తనకోసం రారేం?' పరిపరివిధాల ఆలోచిస్తోంది మనసు.
     
     అంతలో ఎవరో స్త్రీ తనని ఆశ్రమం గేటులోంచి చెయ్యూపుతూ రమ్మనడం కనపడింది.
రెండడుగులు అప్రయత్నంగా ముందుకు వేసింది.
గేటుదాటి బయటకి  వచ్చిన స్త్రీ కూడా తన వయసుదే. సాదాగా ఉందామె. మెడ బోసిగా, నుదుట బొట్టు లేకుండా, నేత చీరతో ఉంది.

     ఆమె దగ్గరగా వస్తూ చేతిని జాపి ఆప్యాయంగా పలకరించింది, "ఎవరమ్మా మీరు?"
     
     భారతమ్మ కంట నీరు తిరిగింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కాని నోట మాట రాలేదు. ఆవిడే  చొరవగా భారతమ్మ చేతిని అందిపుచ్చుకుని గేటుదాటించి లోపలకు తీసుకు వచ్చింది.
     
     వీళ్లిద్దరూ లోపలకు రాగానే బిలబిలలాడుతూ అక్కడున్న వారందరూ మూగారు. తలో ప్రశ్న వేస్తున్నారు. లోపలకు తెచ్చినావిడ చెయ్యెత్తి అందరినీ ఆగమని చెప్తూ, పనిపిల్లను పిలిచి మంచినీళ్లు తెమ్మంది.
     
     గ్లాసుడు చల్లటి నీళ్లు తాగేసరికి భారతమ్మ ప్రాణం తెరిపిన పడింది. ఆమెను తీసుకు వచ్చినావిడే
నెమ్మదిగా అడిగింది- "మీరెవరమ్మా...పేరేమిటి?"

     పసిపిల్లలా ఆమెను చూస్తూ, "తెలీదు." అంది మెల్లగా.
     
     అ మాటతో  ఆశ్చర్యం కనిపించింది అందరి కళ్లలో.
"ఎక్కడనుంచి వస్తున్నారు?" మళ్లీ అడిగింది.

     "గుర్తు రావటం లేదు." అంది భారతమ్మ.
     
     "మీ వారు...?" మంగళసూత్రాల వేపు చూసి అడిగింది ఆమె.
     
     కళ్లు చిట్లించి, "ఏమో!" అంది.
     
     "పిల్లలున్నారా?"
     
     తల ఊపుతూ విసుగ్గా,      "తెలీదు. నాకేం గుర్తులేదు." అంది భారతమ్మ.
     
     ఆమె పట్టు చీర, నగలు గమనించిన వారు ఎవరో పెద్దింటి ఆడపడుచే మతిస్థిమితం కోల్పోయి తిరుగుతోందని గ్రహించి మరి ప్రశ్నలు వేయకుండా
" పరవాలేదండి.మీరిక్కడే ఉండండి.మీకేం భయం లేదు." అన్నారు.
     
    భారతమ్మ భారంగానిట్టూర్చింది. జరుగుతున్నదంతా కలలా ఉందామెకు. ఎవరో లోపలికి తీసుకువెళ్లారు. భోజనం పెట్టారు. బావులేక కాబోలు బలవంతం చేస్తే నాలుగు మెతుకులు కతికింది. మంచం మీద పక్క వేసి పడుకోమంటే అలసట వల్ల చేరబడింది. ఆమె నిద్ర లోకి జారుకున్నాక  మిగిలిన వృద్ధులంతా చేరి ఆమె గురించి మాటాడుకోసాగేరు.
    
     "ఎవరో గొప్పింటి వాళ్లే. మతిస్థిమితం లేదని ఇక్కడ వదిలేసి పోయుంటారు." అంది ఒకామె.
     
     "అదే అయ్యుంటుంది.కానీ ఇన్ని నగలతో వదిలేస్తారా?" అనుమానం వెలిబుచ్చింది మరొకావిడ.
     
     "అదేమీ కాదర్రా.ఏ బజారుకో వచ్చి దారి మరిచి పోయుంటుంది." అన్నాదింకో స్త్రీ.
     
     "నేననుకోడం ఈవిడికి మతిమరుపు జబ్బేదో  ఉందేమొ. అందుకే తన వారి పేర్లు, అడ్రసు చెప్పలేక పోతోంది పాపం."
అంది భారతమ్మను లోనికి తీసుకు వచ్చినావిడ.

     "సరే! రేపు చూద్దాం. ఆమె తాలూకు వారెవరైనా వెతుక్కుంటూ వస్తారేమో. ఇక పడుకుందాం పదండి."
అంటూ నాయకురాలు లేవగానే అందరూ వారి వారి పక్కలు దగ్గరికి చేరారు.
.                            ****
     తెల్లవారింది!
     
     అందరితో పాటు భారతమ్మ కూడ లేచి యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకుని అందరితో పాటు డైనింగ్ హాల్ లోకి నడిచింది. పెద్ద హాలు , మధ్యలో భోజనాల బల్ల!పని వాళ్లు వంట  పదార్దాలు తెచ్చి అందరికీ వడ్డిస్తున్నారు.
     
     ఆమె చుట్టూ చూసింది.

     సువిశాల ప్రాంగణంలో కట్ట బడ్డ రెండంతస్తుల భవనమది. ఎవరో ఎన్నారై దాతృత్వంతో,  విరాళాలతో నడుస్తున్న ఆశ్రమం.కింద పెద్దహాలు,వెనకాల  ముప్ఫై వరకూ రెండు వరసల్లో గదులు! అలాగే పై అంతస్తులో 
హాలు నానుకునే ఒక పక్క పెద్ద కిచెన్!

     భారతమ్మకి అక్కడి వంటలు నచ్చలేదు.
పెరుగు పల్చగా మజ్జిగనీళ్లలా ఉంది.కూరలలో రుచీ పచీ లేదు. రుచికరమైన భోజనానికి అలవాటు పడ్డ ఆమెకి ఈ నాసిరకం వంటలు తినబుద్ధి కావడం లేదు.

     మొహం చిట్లించుకుని అనాసక్తంగా రాళ్లలాటి ఇడ్లీలని, నీళ్లలాంటి సాంబారు లో ముంచుకు తింటున్న బారతమ్మని జాలిగా చూసారు అక్కడి వారు.
     
     "బావులేదా?"ఎవరో అడిగిన ప్రశ్నకి భారతమ్మ తలెత్తింది.
     
     " ఇలాంటి చోట ఇంతే నమ్మా!ఇంట్లో జరిగినట్టు ఇక్కడ  జరగదుకదా తల్లీ? ఆ మాట కొస్తే మాకు ఇంట్లో కూడా ఇంతకన్నా దరిద్రంగా ఉండేది.మమ్మల్ని పట్టించుకునే  వారే లేరు.నానారకాలుగా సాధించి సాధించి చివరకు  ఇక్కడ పడేసి చేతులు దులుపుకు పోయే వారే అందరూ.
ఒకర్నని యేం లాభం?మన బంగారం మంచిది  కానప్పుడు?" కళ్లొత్తుకుంటూ చెప్పిందావిడ.

     బారతమ్మ కళ్లు పెద్దవయ్యాయి."అదేం లేదు. మా ఇంట్లో నన్ను బాగా చూసుకుంటారు. మా వాళ్లు మంచివాళ్లు!" అంది ఆవేశంగా.
     
     విస్తుపోయి, "మరి మీరెందుకు వచ్చారమ్మా ఇక్కడికి?" అందావిడ తిరిగి.
     
     జవాబు  చెప్పడానికి మాటలు దొరక్క, "నేను...  నేను.." అంటూండగా బయట కారాగిన చప్పుడు! ఎవరో వస్తున్న అలికిడికి అందరూ బయటికి వచ్చారు.
అప్పుడే కారు దిగి లోపలికి వస్తున్న ఆరడుగుల యువకుడి ని సంభ్రమంగా చూసి, "బాబూ! " అంటూ తన వృద్ధాప్యాన్ని వెనక్కు నెట్టి చిన్నపిల్లలా ముందుకి పరిగెత్తింది భారతమ్మ.

     అ యువకుడు రెండు చేతులూ సాచి సజల నయనాలతో తల్లిని పొదివి పట్టుకున్నాడు.చూస్తున్న  అందరి కళ్లలో సంభ్రమం!ఏదో అపురూపంగా ఎనిమిదో వింత చూస్తున్న వాళ్లలా ఉండిపోయారందరూ కొయ్య బొమ్మల్లా. 
వాళ్ల ఇన్నాళ్ల నిస్సార జీవితాలలో  తమని దగా చేసి ఈ కూపం లో పడేసిన వారే గానీ ఆదరంగా తిరిగి తమని అక్కున చేర్చుకున్న వారే లేరు కదా!
తల్లిని అలాగే జాగ్రత్తగా మళ్లీ తప్పిపోతుందేమోనన్నట్టు  పట్టుకుని వారందరి వేపు తిరిగి, " మా అమ్మని చూసుకున్నందుకు మీ అందరికీ  ధన్యవాదాలు.
ఈమెకు అల్జీమర్స్ ట్రీట్మెంట్ జరుగుతోంది.
నిన్నటి డోసేజి టాబ్లెట్ లు వేసుకోకపోవడం...అలాగే బజారుకి వెళ్లడంతో వస్తున్నప్పుడు ఇంటి దారి మరిచి పోయింది.
ఆటో వాడు అడ్రసు తెలీక చిరాకు పడుతుంటే మీ ఆశ్రమం దగ్గర పరిసరాల్లో దింపేయమందిట.
తన పర్సు, మొబైల్ కూడా దుకాణం లో మరిచి పోయింది.
ఎలాగో మీదగ్గర చేరి క్షేమంగా ఉంది. పోలీసులు దుకాణం దగ్గర సిసీటీవీ ఫుటేజి చెక్ చేస్తే, తనెక్కిన ఆటో నెంబరు బట్టి,ఆటోవాడిని పట్టుకుంటే ఈ పరిసరాల్లో దిగిందని, మతిస్థిమితం లేని గొప్పింటి మనిషి కావడంతో తన బాడుగ కోసం గొడవ చెయ్యలేదని చెప్పేడు. అందుకే ఇక్కడికి ఒకసారి చూసిపోదామని వచ్చాను.
మీ అందరికీ అనేక ధన్యవాదాలు. మా అమ్మని బాగా చూసుకున్నారు.
మాకు సెలవిప్పించండి.ఇంటి దగ్గర అంతా కంగారు పడుతున్నారు. నాన్నగారైతే నిన్నటినుంచీ పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. పిల్లలు సరేసరి..."
తల్లిని పొదివిపట్టుకుని మెల్లగా కారుదాకా నడిపించుకుంటూ వెళ్తున్న వారిద్దరినీ అపురూపంగా  చూస్తూ ఉండిపోయారు ఆశ్రమ వాసులు. వారి కళ్లల్లో ఆనందాశ్రువులు ఉబికాయి.
*****
      ఒక వారం గడిచింది.
సంజీవని ఆశ్రమం గేటు ముందు ఒక కారు వచ్చి ఆగింది.

      కారులోంచి ఒక వృద్ధుడు,భారతమ్మ, కొడుకు గా పరిచయమైన యువకుడు దిగారు. అందరూ ఆశ్చర్యం తో చూస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ ముగ్గురూ ఆఫీసు రూమ్ వైపు నడిచారు.
అక్కడ నిర్వాహకులు వీరిని సాదరంగా ఆహ్వానించారు.
తమని పరిచయం చేసుకున్నాక వృద్ధుడు గొంతు సవరించుకుని-
"అయ్యా! నా భార్యకు ఒకటిన్నరరోజులు ఆశ్రయం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఆశ్రమాన్ని నెలకొల్పి, ఈ అనాథ వృద్ధులకు ఆశరా కల్పిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నాను.
అయితే ఆమె మాటల ద్వారా ఒక విషయం తెలిసింది. ఇక్కడ లభిస్తున్న భోజన సదుపాయాలలో నాణ్యత కొంత కొరవడుతున్నట్టు తెలిసుకున్నాను. బహుశా, తగినన్ని వనరులు లేకపోవడం వలన ఆ పరిస్థితి కలిగి ఉండవచ్చు. నాకు భగవంతుని దయవల్ల కొంత ఆర్థిక స్తోమత ఉంది. నేను పాతిక లక్షలు ఈ ఆశ్రమానికి విరాళంగా 
 ఇవ్వదల్చుకున్నాను.
అయితే మూలధనం పోకుండా దాన్ని ఫిక్స్ డిపాజిట్ చేసి దానిమీద వచ్చే వడ్డి ప్రతినెలా మీకు అందే ఏర్పాటు చేస్తాను.
దానితో వీరందరికి ఉన్నతమైన ప్రమాణాలతో రుచికరమైన భోజన సౌకర్యాలు కలిగించండి.
వారు తమ వారిచేత నిరాదరింపబడ్డ వృద్ధులు.
సంజీవని పేరుతో ఉన్న ఈ ఆశ్రమం జాతిని తీర్చి దిద్దే తరాన్ని ప్రసాదించిన ఈ మాతృమూర్తులకు సంతృప్తి కరమైన ఆహారం   పెట్టే ఒక మాతృమూర్తి కావాలనే మా తలంపు! అంతే కానీ ఎటువంటి భేషజాలకు మేము పోవడం లేదు. మీరు చేపడుతున్న సేవకు మేము తలపెట్టేది ఓ అనుబంధ చర్య మాత్రమే!  
కాబట్టి దయచేసి తగిన ఏర్పాట్లు చేయించండి.
ఇహపోతే మధ్యలో మా మనుషులు వచ్చి పర్యవేక్షిస్తారు.
మేము కూడా వస్తుంటాము."
అన్నాడు. ఆయన మాటలకు 
నిర్వాహకులు తల పంకించారు. ఆయన కోరిన విధంగానే  భోజనాల విషయం లో నాణ్యత పాటిస్తామని చెప్పేక బయటకు వచ్చి తమతో తెచ్చిన పళ్లు,ఫలహారాలు అక్కడ ఉన్న వారందరికీ పంచి పెట్టారు.
భారతమ్మ కూడా తన పాత స్నేహితురాళ్లతో కలసి ముచ్చటించింది.
తిరిగి వెడుతూ నెలకోసారైనా వస్తానని వాగ్దానం చేసింది.
కారు వెడుతున్నంతసేపూ ఆశ్రమ వాసుల చూపులు అటే ఉన్నాయి.
వారి కళ్లల్లో కొత్త అనందం మెరిసిపోతూ కదలాడింది.

******

Comments