రోకు పురాణం

రోకు పురాణం
***********

"రోసీరోయదు..." అంటూ మహాకవి ధూర్జటి తన బలహీనతల్ని పరమేశ్వరుని దగ్గర స్పష్టంగా ఒప్పుకున్నాడు.

రోకు గమ్మత్తైన పదం.
మోజు..వ్యామోహం..అనుకోవచ్చు.

కొందరికి కొన్ని వస్తువులు, పదార్దాల మీద ఉంటే మరి కొంతమంది కి వ్యక్తుల మీద రోకు ఉంటుంది.

నాకు తెలిసిన ఒక లెక్చరర్ గారికి ఇంగ్లీషు భాష మీద రోకు.
తనిక్కడ పుట్టవలసినవాడు కాదని ఇంగ్లాండు దొరల ఇళ్లలో పుట్టాల్సిన వాడిననీ అతగాడి ప్రగాఢ నమ్మకం.
ఇంట్లో కూడా వారి పద్ధతులే.
కొవ్వొత్తులను వెలిగిస్తాడు.
తడుముకోకుండా ఇంగ్లీషు మాట్లాడతాడు.
పెళ్లం తో కూడా- " యూ నో లొలితా ది మేకింగ్ ఆఫ్ చారు ఇన్ ఏన్షియంట్ డేస్..." అంటూ ఊదరగొడ్తాడు.
అతడే గనక ఆడదై ఉంటే ఈ పాటికే ఏ ఇంగ్లీషు బట్లరుతోనో లేచిపోయుండేవాడు.

ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద రోకు ఉంటుంది.
సన్నాసులకు కూడా గంజాయి మీదో మరో దానిమీదో రోకు ఉండి ఉండవచ్చు.

రా.నాలకు పదవులమీద...
ఛోటా నాయకులకు బడా పోస్టుల మీద...
ఆడవాళ్లకి నగల మీద...చీరలమీద..కబుర్లమీద..
కబుర్లంటే గుర్తొచ్చింది.
మనింటికి ఏ పంచదార కోసమో వచ్చిన వాళ్లు టైంలేదంటూనే పావుగంట మాటాడి గుమ్మం దాటేక- "అన్నట్టొదినా! మర్చేపోయాను..మొన్న మీ అన్నయ్య ఏం చేసేరనుకున్నావు...""
అంటూ మరో పది నిముషాలు గడిపి కాని వెళ్లరు.దీనికి నేను గేటు సంభాషణ/తలుపు సంభాషణ అని పేరు కూడా పెట్టాను.ఈలోగా
అవతల కాఫీకోసం ఎదురు చూస్తున్న బ్రాహ్మడి గుడ్లు గూటిలోకి వస్తాయి.

ఉద్యోగులకి ప్రమోషన్ ల మీద...
విద్యార్ధులకి రేంకుల మీద...
అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ మీద...
ఇహ రచయితలందరికీ పుస్తకాల రోకు...సభలు..సన్మానాలు రోకు..
డాక్టర్లకి అందమైన నర్సులంటే రోకు..లాయర్లకి ఫీజు లిచ్చే క్లయింట్ల రోకు..
స్కూటరు వాడికి కారు రోకు..కారు వాడికి విమానాల రోకు..
అబ్బాయలకి అపోజిట్ సెక్స్ మీద రోకు ఉండటం సహజం.
మా వీధిలో ఒకావిడకి పక్కవారి కబుర్లంటే ఇష్టం.
ఇంట్లోవాళ్లు ఏడ్చిగగ్గోలుపెడుతున్నా ఆవిడ విషయసంగ్రహణ పూర్తి కానిదే కదలదు.
మొగుడువాడు పాపం అలవాటైపోయి పట్టించుకోవడం మానేశాడు. పిల్లలు పెద్దవాళ్లయిపోయి వాళ్లపనులు‌వాళ్లే చేసుకోవడంతో ఆవిడని అడిగేవాడే లేకపోవడం తో పూర్తి స్థాయి ఆకాశవాణి గా మారిపోయింది.
బాతాఖానీ ఆవిడ రోకు.

ఇహ మైకు పురుషుల, స్త్రీల సంగతి చెప్పనఖర్లేదు.
సభల్లో సమావేశాల్లో టైం లేదంటునే తలంటుతారు.
మరికొంత మంది వ్యక్తి పూజాగ్రేసరులు.
వారికి వారికిష్టమైన వ్యక్తి దేవుడితో సమానం.అతగాడి లోపాలు కూడా వీళ్లు సుగుణాలుగా కవర్ చేసేస్తారు.
ఈగ వాలనివ్వరు వాళ్లమీద.అతగాడి....ఇంగువతో సమానం.
వాళ్లనేమన్నా ముందు వీళ్లు మీద పడిపోతారు.
నాలాంటి వాడికి ఇలాంటివన్నీ వ్రాయటం రోకు.
అంచాత జగత్సర్వం రోకు‌మయం.

Comments