మనసునమనసై

#ఆదివారం- చిన్నకథ

మనసున మనసై..
**************.
సాయం సంధ్యా సమయం.
ముంబై చౌపాటీ బీచ్ లో ఏకాంత ప్రదేశంలో ఎప్పటిలా వాళ్ళిద్దరూ.
గత వారం రోజులు గా వారిని అక్కడ గమనిస్తున్నాను.
కథకోసం నేనక్కడికి సాయం కాలాలు గడపటం హాబీ గా మారింది.రోజల్లా ఎదురైన సంఘటన ల్లో, నా కథకు అవసరమైన ముడిసరుకు ను మరిచిపోకుండా నోట్ పాడ్లో క్లుప్తంగా 
నోట్సు గా వ్రాసుకున్నవన్నీ ,కథా రూపాలుగా మార్చే ప్రక్రియ అక్కడే జరుగు తుంది.
వాళ్లు నాకక్కడే పరిచయం.

మా మధ్య మాటలేం జరగలేదు.
నేను వెళ్లే సరికే వాళ్లక్కడ ఉంటారు.
ఒకరి చేతులు‌ఒకరు పట్డుకుని సాగరాభిముఖంగా కూర్చుంటారు.
మిగిలిన బీచ్ సందడి వాళ్లు పట్టించుకోరు.
అనంత విశ్వంలో వాళ్లిద్దరే ఉన్నట్లు,ఈ క్షణం జారిపోతే మరి దొరకదన్నట్డు కబుర్లు లో గొంతుకలో చెప్పుకుంటారు.
నేను వెళ్లిపోయాక వాళ్లు వెళతారు.
అందువల్ల వారెక్కడ ఉండేదీ నాకు తెలియలేదు.
కానీ వాళ్ల అన్యోన్యత మాత్రం నన్ను అబ్బురపరుస్తుంది.
నా శ్రీమతి ని కూడా నేనెన్నోసార్లు నాతో రమ్మన్నా ఆమెకు పనుల వల్ల కుదిరేది కాదు.
నేనొక గంటసేపు మాత్రమే గడిపి వెళ్లిపోతాను.
అవాళ వాళ్లు ఎక్కడ ఉండేది చూసే వెడదామని నిశ్చయించుకున్నాను.
మనసున మనసై బ్రతికే ఆ జంట ను చూసి ,జీవితాన్ని ఆనందంగా కలసి మెలసి గడుపుతున్న అదృష్టానికి కొద్దిగా అసూయ పడుతుంటాను.
సూర్యుడు మెల్లగా మొహం ఎర్రజేసుకుని సముద్రం లోకి జారుకుంటున్నాడు.
చీకటి లేచి ఒళ్లు విరుకుంటోంది.

ఆ జంట లేచారు.
నేను లేచాను.
వాళ్లకు తెలియకుండా వాళ్లని వెంబడించి వాళ్ల ఉనికి కనుక్కోవాలి.
వాళ్ళిద్దరూ లేచారు. చీకటిలో చేతిలో ఉన్న దేదో కదిలించడం కనపడింది.
కళ్లు చిట్లించి చూసాను పరీక్షగా.
అంధులు ఉపయోగించే తెల్లని చేతి కర్రలు.
*****

ఇది నా స్వంతమే నని అముద్రితమని తెలియజేస్తున్నాను.

Comments