మే(మీ)ల్స్ డే

అత్యాశారావు చాలా సరదాగా ఉన్నాడు.
రేపే అంతర్జాతీయ పురుష దినోత్సవం.
నిన్ననే భార్య తాయారు తో మాట్లాడి ఆమెను ఒప్పించాడు.
రేపాదివారం హాయిగా ప్లాన్ చేసుకోవాలి.
లేటుగాలేచి..తాయారు అందించే బెడ్ టీ తాగి,కాస్సేపు పేపర్ చూసి బాత్రూం పనులు ముగించుకుని వచ్చేసరికి వేడివేడి వెజిటబుల్ ఉప్మా రెడీగా డైనింగ్ టేబిల్ మీద ఉంటుంది.
టిఫిన్ చేసాక,ఫిల్టర్ కాఫీ తాగి డ్రెస్ చేసుకుని నిత్యానందం గాడింటికి వెళ్లాలి.అక్కడనుండి ఇద్దరూ కలసి పరాంకుశం దగ్గరకు వెళ్లాక  అసలు ప్రొగ్రాం ఫిక్స్ అవుతుంది.
విజిల్ వేసుకుంటూ , బెడ్ రూం వేపు నడిచాడు.

ఇక్కడ తాయారు గురించిన చెప్పాలి.

తాయారు తల్లిదండ్రుల గారాల ఏకైక కూతురు.
ఆమెకు ఏపని చెప్పక ముద్దుగా పెంచారు.
ముద్దుగా మొద్దులా పెరిగిన తాయారుకి ఇంటి,
 పనులేవీ వంటబట్టలేదు.
దానికో పెద్ద కారణం కుడా ఉంది.
దాదాపు రెండేళ్ల పిల్ల గా ఉన్న ప్పుడు వంటింట్లో పారాడుతూ అప్పుడే అక్కడ దిమచిన వేడినీళ్ల గిన్నె తోసేసి చతికిల బడిపోయింది.
హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లి బర్న్స్ వార్డులో పదిరోజులు ఉంచాక గాని నయంకాలేదు.అప్పట్నుంచీ ఆమెను వంటింటి ప్రాంతాలకు కూడా రానివ్వలేదు .ఒక్కతే కూతురు.అల్లారు ముద్దుగా పెంచారు.
చిన్నతనం వల్ల ఆమె కూడా వంటల వేపు మొగ్గు చూపలేదు.
అదీగాక అమె తల్చుకుంటే కొండ మీద కోతిని కూడా తెచ్చివ్వగల తల్లితండ్రుల ప్రవర్తన కూడా కొంతవరకు కారణం.
అసలేపనైనా శ్రద్ధగా నేర్చుకుంటే కదా వస్తుంది.
పెళ్లయ్యాక అత్వారింట్లో ఎలా అన్న ఆలోచన అటు పిల్లకి,ఇటు తల్లిదండ్రులకి కూడా రాలేదు.

అప్పటికీ పెళ్లిచూపుల్లో హింట్ గా తల్లి కూతురి పాకకళావైదుష్యం దాదాపు నిల్లే ననీ కాబోయే వియ్యపురాలితో చెప్పింది.
'సర్లే ఈ కాలం పిల్లలు.ఎంతసేపు.. త్వరగానే నేర్చుకుంటారు' అని సమాధాన పడిందావిడ.


డిగ్రి పూర్తవకుండానే అత్యాశారావు సంబంధం రావడం ఆగమేఘాల మీదపెళ్లి జరగడం అయింది.
ఇంటికి కొత్తకోడలు వచ్చిందన్న మాటే గాని అత్యాశ మాతకు ఇంటిపనీ వంట పనీ తప్పలేదు.
పెళ్లయిన నెల రోజులకే బాంకుపని మీద తల్లీకొడుకులు బేంకుకి వెడుతూ కాస్త మిగిలిన వంట పని కొత్తపెళ్లికూతురికి అప్పజెప్పి వెళ్లారిద్దరూ.
అక్కడ పని పూర్తవకుండానే పక్కింటాయన ఫోను .
ఆందోళన పడుతూ ఉరకలు పరుగుల తో ఇల్లు చేరుకున్నారు.
ఇంటి ముందు ఫైరింజన్,వీధిలో మనుషులు.
గాబరాగా ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్లకు ఇల్లంతా యుద్ధరంగంలా కనిపించింది.
కుక్కర్ హేండిల్  విరిగి కిటికీ గాజు అద్దం పగలగొట్టి నంగనాచిలా ఓ మూల పడుంది.ఇల్లంతా పాలు,సాంబారు నదుల్లా ప్రవహిస్తున్నాయి.మూకుడ్లో వేగిన బంగాళా దుంప ముక్కలు చెప్తేగాని తెలియనంతగా రూపు మార్చుకుని నేలమీద సాంబారు నదిలో స్నానం చేస్తున్నాయి.
ఇల్లంతా పొగ,ఆవిరి..వలయాలు.
వీధిలో వాళ్లు చెప్పన దాని ప్రకారం తల్లీకొడుకులు బయల్దేరిన అరగంటకే ఇంట్లోంచి పెద్ద చప్పుడు విన పడిందట.
అందరూ వచ్చేసరికి కొత్తకోడలు బెదిరిపోయి పడకగది మంచం మీద కూర్చునుందట.
వంటింట్లో పేలుడు,మంటలు చూసిన వారెవరో ఫైరింజను కి ఫోను చేసేరట.
భార్యకి దెబ్బలేమీ తగల్లేదని గమనించాక భార్యని వంటింటి ఛాయలక్కూడా రానివ్వకూడదని నిశ్చయించుకున్నాడు అత్యాశరావు.తల్లి కూడా వంతపాడింది.
కొడుకుని అల్లరుముద్దుగా పెంచిన తల్లికి  వంట కష్టంగా ఉన్నా ఇష్టంగా చేయక తప్పలేదు.
అత్యశారావుకి చిన్నప్పటి నుంచీ తిండి పుష్టి ఎక్కువే.దానికి తోడు తల్లి పెట్టే నవకాయపిండివంటలు బాగా అలవాటైతిండి దగ్గర రాజీ పడటం ఇష్టం ఉండదు.
తల్లి దగ్గర చేరి అన్ని రకాల వంటలు బాగా తర్ఫీదయ్యాడు.
చేగోడీలు,జంతికలు ,మైసూర్‌ పాకు తల్లితో సమానంగా చేయగల నైపుణ్యం సంపాదించేడు.ఆవకాయ పెట్టినపుడు శ్రద్ధగా గమనించేవాడు.
ముక్కలపులుసు,సాంబారు,చారు పెట్టడంలో ప్రజ్ఞ సంపాదించాడు.
తనకిష్టమైన గుత్తొంకాయ కూర,దుంపల ఉప్మాకూర,చేమ దుంపల వేపుడు,మెంతికారం కరతలామలకమయ్యాయి.
భార్యకు కూడా నేర్పుదామని ప్రయత్నించాడుగానీ జరిగిన నష్టాలు చూసాక వంటింటి దరిదాపులక్కూడా ఆమె రావడం ప్రమాదకారకమని గ్రహించి,ఆప్రయత్నం మానుకున్నాడు.మరోసారి
పాలకూర పప్పు చేయడానికి తల్లి తరిగిన పాలకూరని అరలీటరు పాలలో వేసేసింది.
గంజి వార్చడంచేతకాక చేయి కాల్చుకుంది.'పొయ్యి మీదున్నవి
 పొంగకుండా చూడంటే 'అలాగే' అన్చెప్పి సెల్ ఫోన్లో ములిగిపోయేది.
తర్వాత వంటిల్లంతా పొయ్యి తోసహా తల్లీ కొడుకులు 'చచ్చినో'యని  శుభ్రం చేసుకునీవారు.

తాయారుకి బాధగా ఉన్నా చేసేదిలేక అందరూ  అలవాటు పడిపోయారు.
అయితే ఇంటికెవరేనా అతిథులు వచ్చినప్పుడు మాత్రం వీళ్ల యాతన పగవారిక్కూడా వద్దనిపిస్తుంది.
వాళ్లతో తల్లి మాటాడుతూ ఉంటే తను వంటింటిలోకి వెళ్లి కొంతపని చేసి వచ్చి కూర్చునేవాడు.కొడుకు రాగానే తల్లి వెళ్లి మిగతా పని పూర్తి చేసేది. ఇద్దరూ షిఫ్టుల ప్రకారం వచ్చిన అతిథులకి కాఫ్యాదులు,భోజనాలు వేళకి అందించేవారు.

క్రమంగా కొన్నాళ్లకు అత్యాశరావు తల్లి జబ్బుచేసి,కొడుకు మీద దిగులు తో కళ్లు మూసింది.
అత్యాశరావుకి తల్లి పోయిన దుఃఖం తోపాటు వంట పుట్టి ఉద్యోగం కూడా మీద పడింది.
అలాగే పడుతూ,లేస్తూ పొద్దున్నే లేచి ఇంటి పని, వంటపనీ చేసుకుని ఆఫీసుకి వెళ్లేవాడు.
మళ్లీ రాత్రి వచ్చి డిన్నరు తయారు చేసేవాడు.
ఇంతలో మరో సమస్త తలెత్తింది.
రోజూ రకరకాల వ్యంజనాలను లంచ్ టైంలో రుచిచూసిన కొలీగ్స్,ఆఫీసరు తెగమెచ్చుకునేవారు.
తన నలభీమత్వానికి కారణం వాళ్లతో పంచుకుని సాంత్వన పొందేవాడు.
కొన్నాళ్ళకు విసుగెత్తి వంటమనిషిని పెట్టాడు.
ఇంటిపనికి పనిమనిషిని కూడా చూసాడు.
వాళ్లకు తన పద్ధతులు నేర్పడానికి నెలరోజులు .

పట్టింది.
ఇప్పుడు అంతా సక్రమంగా ఉంది.
అందుకే పురుషుల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఎవరో వచ్చిన చప్పుడు వినిపించి బయటకు వచ్చాడు.
భార్య అప్పటికే తలుపు తీసింది.

పని మనిషి కొడుకు.
వాళ్లమ్మకి ఒంట్లో బావులేదట.ఇవాళ రాదట.
"పర్వాలేదు మీరు వెళ్లండి."అంది తాయారు వాడిపోయిన భర్త మొహం జాలిగా చూస్తూ.

తలూపి బయటకు రాబోతున్న వాడల్లా ఎదురుగా వస్తున్న వంట మనిషిని చూసి గతుక్కుమన్నాడు.
దగ్గరకు వచ్చి- "సర్ నేను అర్జెంటుగా మాఊరు వెళ్లాలి. మా అమ్మకు బావులేదు.
వారం రోజులు పడుతుంది."
అందావిడ బాంబు పేలుస్తూ.
ఒక్క క్షణం చొక్కా చింపుకుంటున్న సుత్తి వీరభద్రరావు గుర్తుకొచ్చాడు అత్యాశరావుకు.
బేలగా తాయారు వేపు చూసాడు.
తనను ఇన్నాళ్లు సుఖపెట్టిన భర్త మీద ఆపేక్ష ఎక్కువైన తాయారు
అతన్ని దగ్గరకు తీసుకుని-
"పరవాలేదు. మీరు మీ ప్రొగ్రాం కి వెళ్లండి.నేను ఒక్కరోజు ఎలాగో గడిపేస్తాను."
అంది.
"స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో.సాయంత్రం కల్లా వచ్చేస్తాను." అని ముందుకు నడిచాడు.
అనుకున్న ప్రకారం అందరితో కలసి ఆఫీసు చేరాడు.
సాయంత్రం వరకూ పురుషదినోత్సవ వేడుకలు విందువినోదాల్తో గడిచింది.
సాయంత్రం అందరూ కలసి అత్యాశరావు ఇంటికి వచ్చారు.
తలుపు తీసిన తాయారు అంతమందిని చూసి అప్రతిభురాలైంది.
లోపలికి వెళ్లి అందరూ కూర్చున్నాక లేడీ ఆఫీసరు లేచి తాయారు దగ్గరకు నడచి -
"మీ వారి పాకకళావైభవానికి అసలు కారణమైన మీరు నిజంగా సన్మానికి అర్హులు"
అంటూ తాయారు మెడలో దండవేసింది.

Comments