#ఆదివారం- చిన్న కథ
అర్ధాంగి
@@@@@
మిష్టర్ రవీ!
నిన్ను వదిలేసి వెళ్తునాను.
నీ సొత్తులేమీ తీసుకుని పోవడం లేదు.
నా బట్టలు, నాకు మా వాళ్లు పెట్టిన నగలు మాత్రమే తీసుకు వెళ్తున్నాను.
పెళ్లికి ముందు మనమనుకున్న వాగ్దానాలు గుర్తున్నాయో లేదో నాకు తెలీదు ..కానీ నీ తరపున నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించలేదన్న విషయం ఆత్మావలోకనం చేసుకుంటే నీకే అర్థమవుతుంది.
నా తల్లిదండ్రులకు నేనొక్కర్తినే.
వాళ్ల బాధ్యత నాకు చివరిదాకా ఉంటుందని ముందే చెప్పాను.
సరే' నన్నావు.
చేస్తున్న వుద్యోగం మానేయమన్నావు.
నేనున్నాను కదా అన్నీ చూసుకుంటానన్నావు.
సరే..
అన్నిటికీ తలవంచి నిన్నంగీకరించాను.
మీ యింటికి వచ్చాను.
మీ పద్ధతులలో ఇమిడిపోవాలని ,నాకు కష్టమైనా ప్రయత్నించేను.
మీ నాన్నగారికి డ్రెస్లు,నైటీలు నచ్చవంటే మానేసీ,కష్టమైనా బరువు చీరలే కట్టుకుని సహించాను.
భర్తనొదిలేసి,కొడుకు తో మన పంచ చేరిన ఆడడుచు ధాష్టికాన్ని,ఆవిడకు వత్తాసు పలికే మీ నాన్న ఆగడాల్ని సహించాను.
మాటిమాటికి పుట్టింటి వాళ్లతో 'ఏమిటా మాట'లంటే,ఫోన్ వాడకం తగ్గించాను.
మీ యింట్లో మడికి ,పనిమనిషి పనికి రాదంటే అలవాటు లేకపోయినా నేనే వంట,వడ్డనలతో పాటు అన్ని పనులూ చేసుకున్నాను.
ఆడపడుచు సాయం చెయ్య క పోగా మీనాన్న తో కలసి నన్ను అన్నిటికీ సాధిస్తున్నా సహించాను.
కారణం...
నువ్వు కనీసం నా కష్టాన్ని గుర్తిస్తావని..
నన్ను ఏకాంతంగా నైనా ఓదారుస్తావని..
కానీ...
నాకల కల గానే వుండిపోయింది.
నువ్వు మీ వాళ్లని పల్లెత్తు మాట అనలేదు.
వాళ్లనే సపోర్ట్ చేస్తూ వచ్చావు.
నేనేం తిన్నానో,ఎలా వున్నానో నీ కవసరం లేకపోయింది.
ఎంతసేపూ మీ అన్నాచెల్లెళ్లు తండ్రి తో కలసి నేను వినకుండా విడిగా గుసగుస లాడుకోవటం గమనించి అడిగితే-
"
నీకెందుకు?"
అన్నావు.
నాకెందుకా?
నేనెవరిని? నువ్వుఅగ్నిసాక్షిగా ,నలుగురి మధ్య పెళ్లాడిన ధర్మపత్నిని కానా?
అసలు నేనున్న యీ సంవత్సరకాలం లో నేను భార్యగా గుర్తింపు పొందానా?
నీ కసలు కావలసింది భార్య కాదు..
ఆడదిక్కు లేని మీ కొంపకి నమ్మకస్తురాలైన పని మనిషి..
అందుకే నలభై యేళ్లదాకావెతికి వెతికి నా షరతులన్నిటికీ గంగిరెద్దులా బుర్రవూపేసి హడావుడిగా నా వుద్యోగము రిజైన్ చేయించి పెళ్లి చేసుకున్నారు.
నా తల్లిదండ్రులతో యేమేం చెప్తానో నని భయపడి నా ఫోన్ కూడా లాక్కునీ దాచేసీ వారు.
మా వాళ్లతో వొక్క రోజు సవ్యంగా మాట్లాడలేదు.
పాపం..వాళ్లని చూస్తే జాలేసేది.
నా పరిస్థితి అంతాకన్నా భిన్నంగా లేదు.
అందరి ముందు పట్టుచీరలతో,నగలతో షోకేసులో మీ భార్య హోదాలో నిలబడటమే తప్ప భార్య గా హక్కు ఏనాడు మీరుగాని,మీవాళ్లుగానీ నాకివ్వలేదు.
కన్నవారిని,వారి ప్రేమ ను యింటి పేరును వదిలేసి,మీ వంశాన్ని వుద్ధరించేందుకు వచ్చిన గృహలక్ష్మికి మీరిచ్చే హోదా పనిమనిషి బతుకా?
పెళ్లి మంత్రాలలో వల్లె వెసే మంత్రాలకి ,సంప్రదాయం అని కొట్టుకుపోయే మీకు అర్థం తెలుసా?
శెలవ్.
నా బతుకు నేను వంటరిగా నాకునచ్చిన రీతి లో బతకగలను.
మా వాళ్లను నేను వున్నంతకాలం చూసుకోగలను.
పెళ్లంటే విరక్తి పుట్టించిన మీ అందరికీ వొక పెద్ద నమస్కారం.
నీ ప్రవర్తన, మీ ఇంటివాళ్ల నడవడి మారేవరకూ మరే ఆడపిల్లా మీ ఇంటి గుమ్మం తొక్కదు.
ఇది నాశాపం కాదు. అక్రోశం.
మీ మాజీ పనిమనిషి కమ్ ఇల్లాలు.
లలిత
***
అప్పటికి పదోసారి చదివాడా వుత్తరాన్ని రవి.
ఇల్లంతా చీకటి గా తన బతుకు లాగే వుంది.
వారం కిందట లలిత యిల్లు వదలి వెళ్లిపోయింది.
ఏదో పనివుందని చెప్పి చిన్న బేగ్ తో వెళ్లిపోయింది.
తర్వాత వెతికినా ఆచూకీ దొరకలేదు.
మొదట్నుంచీ అత్తమామలతో సయోధ్య లేకపోవడంతో వాళ్లని డైరెక్ట్ గా అడిగే సాహసం లేకపోయింది.
నిన్న హటాత్తుగా తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు.
చెల్లెలు పని చెయ్యలేక గునుస్తోంది .
లలిత వుత్తరం యివాళే అల్మైరాలో కర్చీఫ్ కింద కనపడింది.
లలిత రాసిన ప్రతి అక్షరం రైటే.
చాంధసుడైన తండ్రి వల్ల తనతల్లి కూడా యెన్నో బాధలు పడింది చనిపోయే వరకూ.
చివరి రోజుల్లో తండ్రి నెందుకు కష్ట పెట్టడమని ఆయన మాటకు తందానతాన అనటం తన తప్పే.
తండ్రి యెదురుగా చెల్లెల్నేమనలేక భార్య ను బాధపెట్టేడు.
తనమీద,తన అశక్తత మీద తనకే కోపం వచ్చింది
ఇప్పటికయినా చెల్లెలను దూరంగా వుంచి కాపురం చక్క దిద్దుకోవాలి
బెటర్ లేట్ దేన్ నెవర్.
రవి తాళం వేసి బయటకు స్థిరంగా అత్తవారింటికి బయలుదేరాడు.
ఇంతకీ లలిత యేమంటుందో?
మావగారి ఇల్లు దగ్గర పడింది.
ఆ సందులోకి తిరిగితే మూడో ఇల్లే.
గబగబ నడిచాడు.
ఇంతకీ లలిత ఒప్పుకుంటుందా?
తను పెట్టే షరతలన్నిటికీ రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నాడు తను.
అయినా....
మనసు బితుకుబితుకు మంటోంది.
ఒక్క అవకాశం...
ఇంటి మెట్లేక్కేడు.
****
(స్వంతం.అముద్రితం.ఏ మాధ్యమాల పరిశీలనలో లేదు.)
Comments
Post a Comment