ముందుచూపు

(కథామంజరి నవంబరు సంచికలో ప్రచురితమైన నా కథ)

ముందు చూపు
*************

చేతిలో బేగ్ తో ఎదురుగా కనపడ్డ పెద్ద భవనం గేట్ లోంచి లోపలికి నడిచాడు ఆనంద్.
గేట్ పైన ఆర్చి మీద "ధమ్మ గంగ" అని పెద్దక్షరాలతో వ్రాసి ఉంది.
కింద చిన్న అక్షరాలతో చిరునామా కూడా ఉంది.
కలకత్తా మహా నగరానికి ఉత్తరాన ఉన్న శోధ్ పూర్ అనే చిన్న గ్రామం.
ధ్యాన తరగతులు నడిపే బౌద్ధ కేంద్రం.
లోపలికి నడుస్తూ,చుట్టూచూసాడు అనంద్.
దాదాపు రెండెకరాల ప్రదేశంలో పరుచుకునుంది ఆశ్రమం.
గేటు నుండి రెండు ఫర్లాంగులదూరంలో పెద్ద భవనం..మెట్లు...
కుడివేపు బారక్స్ లా కట్టిన గదుల సముదాయం..
కాస్త ఎడంగా పగోడాని తలపిస్తున్న కట్టడం..
చెట్లు,పూలమొక్కలతో నిజంగానే ప్రశాంత ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తోంది.
ఎడం వేపు కూడా ఉన్న భవన సముదాయాలు కాస్త దూరంగా ఉన్నాయి. అవి స్త్రీల కోసమని తర్వాత తెలిసింది.
అసలు తనిక్కడకి రావాలనుకోవడమే గమ్మత్తు గా జరిగింది.
చిన్నదైన సుఖసంసారం...భార్య చదువుకున్నది..దగ్గర్లో ఉన్న స్కూల్ లో పనిచేస్తుంది.
ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు..మృదుల,విపుల బిటెక్ అయ్యాక పూనే లో పనిచేస్తున్నారు.

తనుఫ్రీలాన్స్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా చేసి ఈ మధ్యే విసుగుపుట్టి రిటైర్ అయ్యాడు.
స్వంతిల్లు...ఆర్ధిక సమస్యలు లేవు...
భార్య,తల్లి అత్తాకోడళ్లలా కాక తల్లీ కూతుర్లా కలసిమెలసి ఉంటారు.
అదో సుగుణం.
రిటైర్ అయ్యాక తను ఎన్నాళ్లుగానో అనుకుంటున్న తీరని కోరిక లు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఒకటి విపాశన అనే ధ్యాన కేంద్రం లో పదిరోజుల కోర్సు కి హాజరవడం...రెండవది ట్రెక్కింగ్.. 
అందులో భాగంగానే ఈ ప్రయాణం.
అసలు విషయానికొస్తే ఆనంద్ నాస్తికుడు.
అయితే విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటున్న ఆనంద్ కి భగవద్గీత చదవాలనిపించింది.
సంస్కృత, ఆంధ్ర అనువాదాల సైతంగా పూర్తిగా చదవడానికి అతనికి రెండేళ్లు పట్టింది.
అదే సమయంలో ధ్యానకేంద్ర ఆకర్షితుడై ఆన్లైన్లో వెతికి తనకు దగ్గరగా ఉన్న ఈ ధర్మ గంగలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
అనుకున్న ప్రకారం నిర్ణీత సమయానికి చేరాడు.
అలోచనల్లో ఉండగానే రిసెప్షన్ హాలు సమీపించడంతో ఆలోచనలు కట్టిబెట్టి అక్కడి ప్రక్రియ చూడటం మొదలు పెట్టాడు.
గమ్మత్తుగా అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉన్నారు.

పనులు జరుగుతున్నాయి కానీ ఎవరూ బిగ్గరగా మాట్లడటం వినపడలేదు.
అక్కడి వ్యక్తులు కాషాయ వేషభూషితులై ఉంటారనుకున్నాడు ఆనంద్.
కానీ మాములుగా పాంటు,షర్టు,బనీన్లతోనే ఉన్నారు.
దాదాపు అరవైమంది దాకా ఉన్నారు సాధకులు.
ఒక్కక్కరిని పిలిచి,వారి గుర్తింపు పత్రాలను చూసి ధృవీకరించాక -
నాయకుడిలాటి వ్యక్తి అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.-

"జిజ్ఞాసువులందరికీ దమ్మగంగ స్వాగతం చెబుతోంది.
మీరు చివరిసారిగా మీ కుటుంబంతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడుకోండి.
తర్వాత మీ ఫోను జమచెయ్యాలి...దానితో పాటు మీ పర్సు,వాచి,బంగారు నగలు,ఇతర విలువైన సామాను అంతా ఇక్కడి లాకర్లో పెట్టాలి.దానికి మీరు మీ తాళం వేసుకోండి.
మళ్లీ పదిరోజుల కోర్సు పూర్తయ్యాక మీ సామాను మీకు అప్పగించబడుతుంది.
మరో విషయం-
ఇప్పటినుండి మీరు పూర్తిగా మౌనధారణలో ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడటం,సౌంజ్ఞలు చేయడం నిషిద్ధం.
దీనినే 'ఆర్యమౌన్' అంటారు.
మీతో మాట్లాడే ఒకే వ్యక్తి మీ అధ్యాత్మిక గురువు లేదా గైడ్.
మరో ఇద్దరు సహాయకులు మీకు కావలసిన ఏర్పాట్లు చూస్తారు. వాళ్లతో కూడా అవసరాన్ని మించి మాట్లాడకూడదు.
ఇక్కడ వస్తువులు జమ కాగానే మీ చేతిసంచి తో పాటు మంచినీళ్ల సీసా ఒక్కటే మీరు మీకోసం కేటాయించిన రూంకి తీసుకువెళ్ల గలరు.
మీ ప్రశిక్షణ రేపటి నుండి ప్రారంభమవుతుంది.
ఇవాళ లంచ్ పూర్తయ్యాక మీరు ఇక్కడ భవన సముదాయం, తోటలు చూడవచ్చు.కానీ గేటు దాటి బాహ్య ప్రపంచం తో మీకు సంబంధం ఉండదు.
మీ కుటుంబ సభ్యుల కు ఇక్కడి నెంబరు తెలియజేయగలరు.
వారు మీకేదైనా సమాచారం ఇస్తే మేము అవసరాన్ని బట్టి మీకు తెలియజేస్తాం.
ఇహ గదిలో కూడా ఇద్దరు ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడరాదు.
వారి మొహాల్లో,కళ్లలోకి సూటిగా చూడరాదు.
ఇహ ఇక్కడి కార్యక్రమం వివరాలు-
వేకువ జామున నాలుగు గంటలకి గంట వినగానే నిద్రలేచిపోవాలి.
కాలకృత్యాలు తీర్చుకుని నాలుగు న్నరకి ధ్యాన కేంద్రం కి చేరాలి.
ఆరువరకు ధ్యానం.
అరునుండి ఆరున్నర వరకు జలపానం..అంటే బ్రేక్ ఫాస్ట్.. పూర్తిగా సాత్విక శాకాహారం.
టీ,కాఫీ,పాలు ఉంటాయి.
అదయ్యాక గదికి వచ్చి స్నానాదికాలు పూర్తి కానిచ్చి మళ్లీ ఎనిమిది గంటలకి ధ్యానమందిరం చేరుకోవాలి.
ఎనిమిది నుండి పదకొండున్నర వరకూ ధ్యానమయ్యాక లంచ్.
ఆ తర్వాత గంట విశ్రాంతి.
మళ్లీ ఒంటి గంట నుండి ఐదు వరకు ధ్యానం.
ఆ తర్వాత టీ స్నాక్స్.
అదే మీ డిన్నరు కూడా.
పది రోజులు ఇలాగే గడపాలి.
మీ ప్లేటు,గ్లాసు మీరే కడుక్కోవాలి.
మీగది మీరే శుభ్రం చేసుకోవాలి.అశ్రమ నియమాలు పాటిస్తారని ఆశిస్తాను"
ఇదే విషయం హిందీ,బెంగాలి ఇంగ్లీషు లో చెప్పారు.
అ తర్వాత అందరూ వారివారి ఫోన్లు, వాచీలు,ఇతర విలువైన సామాను చిక్కపు సంచి లాంటి దాన్లో పడేసి లాకర్ లో పెట్టడం జరిగింది.
సరి..
బాహ్య ప్రపంచం తో సంబంధం తెగిపోయింది.

అనంద్ తనకు కేటాయించిన గది వేపు నడిచాడు.
చుట్టూ చెట్లతో నిండిన ఆ వాతావరణం చల్లగా బావుంది. ఫిబ్రవరి నెల చలి తగ్గినా ఎక్కువ వేడి అనిపించలేదు ఇంకా.
గది లోకి అడుగు పెట్టి చుట్టూ చూసాడు.
పదీబై పన్నెండు గది.
ఒక లైట్, ఫాన్ ,అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్...
గది గోడలకి ఆనుకుని జైల్లోలా రెండు సిమెంట్ దిమ్మలు వున్నాయి. అంతే..
మరో వస్తువు లేదక్కడ.
తలుపు వార చీపురు కట్ట,చెత్త ఎత్తపోయడానికి చేట ఉన్నాయి.
బాత్రూం నీట్ గా ఉంది.
బయట వరండాలో అక్వా పిల్టర్ బిగించబడి ఉంది.
బాగ్ లో సీసాతీసుకుని ముందు నీళ్లు నింపిపెట్టుకున్నాడు ఆనంద్.
ఒక సిమెంట్ దిమ్మ మీద తలగడ,రెండు పల్చని దుప్పట్లు ఉన్నాయి.
తన పక్క సరి చేసుకుంటుండగా అనంద్ ఉన్న గదిలోకి ఒక కుర్రవాడు వచ్చాడు.
 బహుశా పాతికేళ్లుంటాయి .స్పురద్రూపి..బాగా చదువుకున్న వాడిలా కనపడ్డాడు.

'అతడే తన రూమ్మేటు కాబోలు' అనుకున్నాడు ఆనంద్.
గదికి వచ్చే ముందే బారక్స్ లో తొంగి చూసాడు. అక్కడంతా డార్మిటరీ లా బంకులు వున్నాయి.
అందరూ యువకులే ఉన్నారక్కడ.
తన అంచనా ప్రకారం అందరూ పెద్దవాళ్లే ఉంటారనుకున్నాడు..వానప్రస్థాశ్రమంలా.కానీ యువకులే ఎక్కువగా ఉన్నారు.
అరవైకి దగ్గర పడిన తనలాంటి వాళ్లు తక్కువమందే ఉన్నారు.
ఆడవారు కూడా ఉన్నారు గాని  వాళ్ల రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్లు విడిగా ఉంచబడ్డారు.
అంతలో లంచ్ కోసం గంట వినపడింది.
ఆనంద్ డైనింగ్ హాలుకి నడిచాడు.
అసలే ఆకలిగా ఉంది.సీల్డా స్టేషన్లో తిన్న సింగడాలు(సమొసాలు)టీ ఎప్పుడో అరిగిపోయాయి.
అకలి దంచేస్తోంది.
వీళ్లేం పెడతారో!
ఎది పెట్టినా కుమ్మేయాలి..
భోజనం బావుంది..
పప్పు..రెండు కూరలు..ఒక పచ్చడి..పెరుగు కావాలంటే అడగాలి.బెంగాల్ లో పెరుగు,మజ్జిగ అన్నాల్లో మనలా కలుపుకోరు.విడిగా తియ్యపెరుగుతింటారు.
అకలి మీద బాగా తిన్నాడు ఆనంద్.
భోజన మయ్యాక గదికి వచ్చి జైలు దిమ్మ లాంటి పడక మీద నడుం చేరేసాడు.
భుక్తాయాసం తగ్గాక లేచి కూర్చున్నాడు.
తన రుమ్మేటు లేడు.
గదిలో నిశ్శబ్దం భరించలేక తోటలోకి నడిచాడు.
పక్షుల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
కలకత్తా రొదలో ఇన్నాళ్లు గడిపి ఇక్కడి నిశ్శబ్ద వాతావరణం దుర్భరం గా ఉంది.

 కూతుళ్లిద్దరూ 
మృదుల,విపుల పూనే లో ఎలా ఉన్నారో!
వాళ్ల గురించి తలుచుకోగానే భార్య రొద గుర్తొచ్చింది.
మృదుల కి సంబంధాలు వెతకమని సుధ పోరుపెడుతోంది.తనే....
పిల్లలిద్దరూ తమకు నచ్చిన కోర్సులు చదివి కొన్నాళ్లు ఉద్యోగం చేసి హాయిగా గడపాలనుకుంటున్నారు.
అలా స్వేచ్ఛగా ఉంటున్న వాళ్లని ఇంత తొందరగా పెళ్లి అనే పంజరం లో బంధించడం ఇష్టం లేదు తనకి.
వయసు మీరితే పెళ్లిళ్లు కావని సుధ భయం.
అంతకన్నా మరో పెద్ద భయం.. నేడు చుట్టుపక్కల విపరీతంగా కనపడుతున్న కులాంతర,మతాంతర ప్రేమ వివాహాలు...
ఎప్పుడు ఎవర్ని ప్రేమించి ఇంటికి తెచ్చేస్తారోనని సుధ భయం.
సుధ కి ఛాందస భావాలెక్కువ.మడి,తడి కావాలి.
తనకి అలాంటి పట్టింపులు లేవు.
అందుకే కూతుళ్లు తనతో చనువుగా ఉంటారు.
ఈ పది రోజుల కోర్సు పూర్తయ్యక
సీరియస్ గా వెతకాలి సంబంధాల కోసం.
అమ్మ నడుం నొప్పి ఎలా ఉందో?
పనిమనిషి రాకపోతే సుధకి
ఇబ్బందే!
పదిరోజుల పాటు తనకీ జైలు జీవితం తప్పదు.
కోరి తెచ్చుకున్నదే!
స్త్రీల పరిసరాలకు మగవారి నివాసాలకు అడ్డు గోడలున్నాయి.
ధ్యాన మందిరం, పగోడా చూసాడు.
ధ్యాన మందిరం చాలా పెద్ద హాలు.
చెట్ల మధ్య ఉంది.
హాలులో చిన్నచిన్న నలుచదరాల వంటి మార్వాడీ పరుపులు,దిళ్లు వరుసగా పేర్చి వున్నాయి.
కిందకుర్చోలేని వారికోసం ఎత్తుగా పీటల వంటివి ఉన్నాయి.
రేపటి నుంచి తను ఇక్కడే అత్యధిక సమయం గడపాలి అనుకున్నాడు ఆనంద్.
తిరిగి ఐదు గంటల ప్రాంతం లో గదికి వచ్చాడు.
టీ కోసం బెల్ మోగింది.
గబగబ డైనింగ్ హాల్ కి బయల్దేరాడు.
డైనింగ్ హాల్లో  మరమరాలు,దోసకాయలతో పాటు గిన్నెలో పలహారం ,టీ ఇచ్చారు.
రాత్రి డిన్నర్ ఉండదని చెప్పిన మాట గుర్తుకు వచ్చినా ఎక్కు తినలేక పోయాడు అనంద్.
టీ తాగి కాస్సేపు అటు ఇటూ తిరిగి పచార్లు చేసాడు.
ఎలాగో కాలంగడిచి ఎనిమిది అయ్యాక గదికి వచ్చాడు. 
అప్పటికే తన రూమ్మేటు పడుకోడానికి ప్రయత్నం చెయ్యడం గమనించాడు ఆనంద్.
భారంగా అరగంట గడిచింది.
కళ్లుమూతలు పడలేదు.
ఎదో వెలితి.
కడుపు ఖాళీ.
ఆకలిగా అనిపించింది.
తన సహవాసి అప్పుడే నిద్రపోయినట్టున్నాడు.
మెల్లిగా పక్కన ఉన్న బేగ్ తెరిచాడు.
పొద్దున్న సీల్డా స్టేషను దగ్గర కొన్న ఆపిల్,స్నిక్కర్ ఉన్నాయి.
బయటకు తీసాడు.
తినడానికి  భయం.
కుర్రాడు లేస్తే...
అసహ్యంగా ఉంటుంది. 
తినకుండా డస్ట్బిన్ లో పారేసాడు న్యూస్ పేపరు చుట్టి.
తిరిగి గదిలోకి వచ్చి మంచి నీళ్లు తాగి నిద్రపోవడానికి ప్రయత్నం చేసాడు.
ఈసారి నిద్ర పట్టింది.

 
*****
నాలుగు కల్లా గంట మోగింది.
శబ్దం వినగానే నిద్రలేచాడు.
.
త్వరగా తయారై మొదటి రోజు ధ్యాన మందిరం లో అడుగుపెట్టాడు ఆనంద్.
సహాయకుడు తనకు చూపిన పరుపు మీద కూర్చున్నాడు.
అప్పటికే చాలావరకు సభ్యులు వచ్చిఉన్నారు.
అందరూ వచ్చాక
స్పీకర్లో ఇలా మాటలు వినపడ్డాయి.
"అందరూ సుఖాసనం లో కూర్చోండి.
మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి.
వేరే ఆలోచనలు వస్తే రానివ్వండి.
కానీ మీ ధ్యాస శ్వాస మీదే ఉండాలి.
గంట మోగే వరకూ ధ్యానం కొనసాగించండి"
అందరూ శ్వాస ధ్యాసలో పడ్డారు.
రకరకాల ఆలోచనలు.

నిశ్శబ్దం అంతటా.
గంట మోగింది.
ఆరయి ఉంటుంది.
అందరూ ధ్యానంలాంటి నిద్రలోంచి బయటపడి డైనింగ్ హాల్ కి నడిచారు. వేడి ఇడ్లీలు...కాఫీ...
ఆత్మారాముడు శాంతించాక గదికిపోయి చీపురు తో గది శుభ్రం చేసి బాత్రూం లో దూరి స్నానం పూర్తి చేసాడు ఆనంద్.
ఆనంద్ బయటకు వచ్చాక అతడి రూమ్మేటు దూరాడు.
ఉతికిన లో దుస్తులు ఎండ వేసి కాస్త సేదతీర్చుకునేసరికి ధ్యాన మందిరం గంట మోగింది.
మళ్లీ అదే స్థలం..అదే ధ్యానం..
పదకొండున్నరదాకా ఎలా గడిచి పోయిందో రకరకాల ఆలోచన లతో.
లంచ్ గంట కొట్టేలోగా ఆనంద్ ధ్యాస లో బంగాళా దుంపల వేపుడు,పప్పు పులుసు ఊరిస్తూ కనిపించాయి.
ఎలాగో గంట వినపడింది.అనంద్
త్వరగా డైనింగ్ హాల్ కి  చేరాడు
కానీ ఆరోజు మొసరపప్పు ,తోటకూర,ఆనపకాయ కూరలు కనపడ్డాయి.
ఇష్టం లేని వంటకాలతో తప్పని సరిగా తిని లేచాడు.
గంటన్నర
 రెస్ట్ అయ్యాక మళ్లీ ధ్యానం.
ఐదు వరకు ఎలాగో గడిచింది.
.
టీ టైమ్‌లో కూడా పెద్దగా తినలేకపోయాడు ఆనంద్.
అవాళ నిద్రపట్టడం ఆలస్యమైంది ఆలోచనలతో.
మరో రెండు రోజులు ఇలాగే గడిచాయి.
మధ్యలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు కూడా ఆనంద్ ని బాగా నిరుత్సాహ పరిచాయి.
అతడి రూమ్ కి దగ్గర్లో ఒక దేవీ ఉపాసకుడు,మరో చిన్న వయసు వ్యక్తి ఉంటున్నారు. రాత్రళ్లు వాళ్ల గదుల నుండి బిగ్గరగా మాటకు వినపడేవి
రూల్స్ కి వ్యతిరేకంగా మాటలు వినకూడదనుకున్నా వినపడేవి.
ఉపాసకుడు వీరి ధ్యాన పద్ధతులను హేళన చేసేవాడు.అతడితో ఉండే కుర్రాడు రెండేళ్ల పసిపాప తండ్రి.
మూడు రోజుల తర్వాత కుర్రాడు కనపడలేదు.
తర్వాత తెలిసినదే మిటంటే కోర్సు మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని.
అదే గదిలో ఉన్న ఉపాసకుడు మాత్రం ఒక్కడే ఆ గదిలో ఉండేవాడు.
ఒకరోజు ఆనంద్ నిద్రపట్టక పచార్లు చేస్తుంటే ఆ గదిలోంచి మూలుగులు వినపడ్డాయి.
తలుపులు తీసి లోపల కు పోయి చూస్తే జ్వరం తో మూలుగుతూ అపస్మారక స్థితిలో కనపడ్డాడు.అప్పుడే అతనికి ఒక కాలు లేదని,పక్కన ఉన్న కర్రకాలు చూస్తే తెలిసింది.
వెంటనే సహాయకుల ద్వారా అతగాడికి వైద్య సహాయం అందజేయడం జరిగింది.
ఈ సంఘటన జరిగాక అనంద్ కి కూడా ఇంటిధ్యాస పట్టుకుంది.
ధ్యానమందిరంలో సందేహాలు నివృత్తి చేసే గైడ్ ని పట్టుకుని తను ఇంటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పాడు.
గైడ్ ఆనంద్ వంక చూసి-
"మరొక రెండు రోజులు ఉండి చూడండి. అప్పటికి అలా అనిపిస్తే మీరు వెళ్లి పోవచ్చు" అని సలహా ఇచ్చాడు.
ఆనంద్ సరేనని తలూపాడు.
ఆరవరోజు ధ్యాన మందిరం లో ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా జరిగిందది.

ఒళ్ళంతా తేలికగా మారినట్టు,ఆలోచనలు ఆవిరై నట్టు, ఒంట్లో కొత్తశక్తి నూతన ప్రసారం జరుగుతున్నట్టు,ఒక అద్భుత అలౌకిక భావన...

 
మునుపెన్నడూ ఇలా జరగలేదు.
ఇదే సమాధి స్థితా?
దీనికోసమే మునులు తపస్సు చేస్తారా?
ఆరోజు గంట త్వరగా కొట్టినట్టనిపించింది.
అకలి,తిండియావ కూడా బాగా తగ్గింది.
మనసంతా ప్రశాంతంగా అలజడిలేని కొలనులా మారింది.
లోకమంతా కొత్తగా కనపడింది.
పనిలో పనిగా తీరిక సమయాల్లో పగోడాలో ఉన్న  వెలుతురు లేని చిన్న గదుల్లో కూడా ధ్యానం చేసినప్పుడు ఇలాంటి అనుభవాలు కలిగాయి.
చూస్తుండగా పది రోజుల కోర్సు పూర్తయింది.
గదిని వదిలిపెట్టి రిసెప్షన్ హాలుకి చేరుకుని లాకర్లో వస్తువులు తీసుకున్నాక,
బాకీ పడ్డ బిల్లులు చెల్లించాడు.
అయితే కోర్సు నిమిత్తం వాళ్లు ఎటువంటి రుసుము అడగలేదు.
"ఇదొక జ్ఞాన భిక్ష.మీ ముందువారు ఇచ్చిన విరాళాలతో మీకు విద్య నేర్పడమైంది.అలాగే మీరిచ్చిన విరాళంతో మరొకరు నేర్చుకుంటారు.
ఇచ్చినా ,ఇవ్వకపోయినా పరవాలేదు." అన్నాడు నాయకుడు.
ఆనంద్ లో ని మధ్యతరగతి మనిషి పదిరోజుల తిండికి,వసతికి రోజుకి ఐదువందల చొప్పున పదిరోజుల కి అయిదువేలు కావచ్చని కార్డు ద్వారా పేమెంటు చేసి రసీదు తీసుకున్నాడు.
అక్కడ కనపడిన తన రూమ్ మేటుతో మొదటిసారి గా మాట్లాడేడు.తన పేరు అక్షయ్ జైన్ ట.
అతను మార్వాడీ. అతని అమ్మానాన్నా కలకత్తా బాలీ గంజ్ లో ఉంటారు.వ్యాపార వేత్తలు.
ఇతను అహమ్మదాబాద్ లో ఐఐఎమ్ చేసి పూనే లో మృదులచేస్తున్న కంపెనీ లో పెద్ద హోదాలో ఉన్నాడు.
మాటల్లో తను మృదుల గురించి చెప్తే -
"యాయా ఐ నో హర్" అన్నాడు.కాస్సేపు ఎమ్ ఎన్ సీ కంపెనీల గురించి  మాటలయ్యాక 
బై చెప్పిగేటు బయటకు వచ్చి రిక్షా ఎక్కాడు ఆనంద్.అతడి మాటల ద్వారా చాల ఫోకస్ ఉన్న వ్యక్తి గా గ్రహించాడు ఆనంద్.
కొత్త అనుభవం తో పాటు కొత్తవ్యక్తితో పరిచయం కూడా ఆనంద్ లో కొత్త ఉత్సాహం నింపుతోంది.
కుర్రాడు బుద్ధిమంతుడే..
గదిలో రూమ్మేటుగా ఉన్నప్పుడు అతగాడి ప్రవర్తన 
ఎంత సంస్కారయుతంగా ఉండేది...
ఒకరోజు తను తుడవటం చూసి మర్నాడు తనకన్నా ముందు లేచి గది ఊడ్చేవాడు.
తమ మధ్య మాటలు లేకపోయినా అతగాడి ప్రవర్తన, అలవాట్లు మెచ్చుకోకుండా ఉండలేక పోయేవాడు.
చదువుకుని పెద్దహోదాలా ఉన్నాడు.
ఛటుక్కున ఒక ఆలోచన మెదిలింది.

ఇవాళా రేపు కులాలు గోత్రాలు ఎవరు చూస్తున్నారు....
మృదుల కోసం ...ఆనంద్ పర్ఫెక్ట్ మేచ్... ఆలోచనలు పరిగెడు తున్నాయి.

బాలీగంజ్ పోయేందుకు ఆటో ఎక్కిన అక్షయ్ జైన్ మొత్తం వివరాలన్నీ మృదులకు ఫోన్లో చెప్తున్నాడు.

******

Comments