శుభోదయం.
కథలు-కథకులు
7
కథా సంఖ్య… 6
రామబాణం
భాగవతుల కృష్ణారావు.
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. కమల ఇంటి ముందు సంశయంగా నిల్చుంది. తలుపు కొట్టడానికి రెండుసార్లు ప్రయత్నించింది. చెయ్యి సహకరించటం లేదు. ఏదో తెలియని భయం ఆవరిస్తున్నాది.
'ఏం చెయ్యాలా?' అని ఆలోచిస్తూ ఓ అడుగు వెనక్కి వేసిన ఆ పద్దెనిమిది సంవత్సరాల మనసులో, చిన్నప్పుడు బామ్మ చెప్పిన రాముడి కథ మెదిలింది.
వనవాస సమయంలో రాముడు ఒకసారి విశ్రాంతి తీసుకుంటూ, ధనుర్భాణాలు పక్కన పెడుతూ, చేతిలో వున్న బాణాన్ని నేలమీద గుచ్చాడట. కాస్సేపటికి, బాణం ములికి దగ్గర రక్తాన్ని గమనించి, తన బాణపు ములికి, కప్పను గాయపరిచిందని తెలుసుకుంటాడు. దానికి స్వస్థత నిచ్చి, అరచి తన వునికిని చాటనందుకు మందలిస్తాడు.
అప్పుడా కప్ప-
"రామా! సర్వ లోక జగద్రక్షుకుడివి.. ఎవరికే యాపద కలిగినా నిన్నే స్మరిస్తారు. మరి నీ వల్లే ఆపద కలిగితే ఎవరిని వేడుకోవాలి? అందుకే మిన్నకున్నాను" అందట.
కొంచెం దైర్యం వచ్చి, వెనక్కి వేసిన అడుగు తిరిగి ముందుకు వేసింది !
తన ఇంటిముందే నిలబడ్డ కమల, గుమ్మం వైపు చూస్తోంది. భయం పూర్తిగా పోలేదు.
సరిగ్గా నెల కిందట, ఎవరికి చెప్పకుండా తాను ఆ ఇంట్లో నుంచి వచ్చిసింది. అప్పుడు తాను తప్పు చేస్తున్నట్లు అనిపించలేదు. ఇప్పుడు తనని ఇంట్లోకి రానిస్తారా?
ఇంట్లో వాళ్ల సంగతి తనకి బాగా తెలుసు. నాన్న దూర్వాసుళ్లా మండి పడతాడు. నోరులేని అమ్మ, తనని కాపాడే ప్రయత్నం చేస్తుందనే నమ్మకం కూడా లేదు. చేసినా, అవిడ మాట చెల్లదు. అన్నయ్యకి స్వతంత్రం లేదు. మామ్మ ఒక్కతే చేస్తే యేమయినా చెయ్యగలదు.
కానీ దుర్వాసుడు లాంటి కొడుక్కి అడ్డు చెప్ప గలదా!
నిజమే! తను చేసింది మహా ఘోరం.. క్షమార్హం కాదు!
పవిత్రమైన కుటుంబం లో పుట్టి, వూరూపేరు లేని వాడితో చెడతిరిగి, నెల్లాళ్ల తర్వాత వాడు మోజు తీర్చుకున్నాక వదిలేస్తే, దిక్కులేక నానా ఇబ్బందులు పడి తిరిగి ఇంటికి వచ్చింది.
కాని..తనకు ఆశ్రయం లభిస్తుందా! ఇంటి వాళ్లు తనని చేరదీసి అక్కున చేర్చుకుంటారా!
అలా జరగని పరిస్ధితుల్లో తనేం చెయ్యాలి?
కమల ఆలోచనలు ఎటో వెళ్తున్నాయి.
సరిగ్గా నెలకిందట..
తన యింటి ముందు జరుగుతున్న నిర్మాణం పనిలో చలాకీగా పనిచేసే హసన్ తనని ఆకర్షించాడు. ఇంటర్ చదువుతున్న తను అర్ధంకాని వ్యామోహంలో పడిపోయింది.
రోజు స్కూల్ కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, చూపులు, నవ్వులతో మొదలై, దొంగతనంగా కలుసుకోవడం.. ముక్కు మొహం తెలియని వాడితో, యిల్లు వదిలి పారిపోవడం వరకు సాగిపోయాయి. తనకి మరో ఆలోచన రాలేదు. ఇంట్లో పరిస్ధితులు, ఇంట్లోవారు.. ఇలా ఏది గుర్తుకు రాలేదు. అంతే... అతని మాటలు నమ్మి, మరో ఊరు వెళ్ళిపోయింది అతనితో!
మోజు తీరాక అతని అసలు రంగు బయట పడింది. రెండ్రోజుల క్రితం, తెల్లవారు జామున తనకి తెలివొచ్చి చూసేసరికి, పక్కన అతడు లేడు. అతను పని చేసే అన్ని చోట్ల వెతికింది. ఎక్కడా ఆచూకి తెలియలేదు. అప్పటికే ఆ ఇరుకుల సందు ఇళ్లల్లో వాళ్ల చూపులు తనని భయ పెట్టాయి. ఇక అక్కడ ఉండడానికి భయం వేసి బయటపడింది. అప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళి పోవాలనే ఆలోచనే వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఏఁవన్నా సరే.. తనకి మరో గత్యంతరం లేదు.
ఇన్ని రోజులు సినిమాలా గిర్రున తిరిగిపోయాయి.
తీరా.. ఇప్పుడు యింటి దగ్గరకు చేరాక, భయం తనని ఆవహించింది! ఎలా? ఎం చెయ్యాలి?
ధైర్యాన్ని కూడకట్టుకుని తలుపు కొట్టింది. అప్పటికే ఇంట్లో వాళ్ళు లేచి, కాలకృత్యాలు తీర్చుకునే పనిలో ఉన్నట్టు అనిపించింది.
'ఎవరూ?' అంటూ తలుపులు తెరిచుకున్నాయి. ఎదరుగా తండ్రి!
కమల తల దించుకుని నిలబడింది.
ఆమెని చూస్తునే శివమెత్తిన వాడిలా అరిచాడు.
తల్లి వంటింటి పొగల్లోంచి గబగబా బయటకొచ్చింది. నాన్న పక్కనే నిలబడిపోయింది. కళ్ళల్లో ఉబికి వచ్చిన కన్నీళ్లు, తన అశక్తత చూపకనే చూపెడుతున్నాయి.
అన్నయ్య కిటికీ వూచల్లోంచి జాలిగా చూస్తునాడు.
అక్కలిద్దరు భయంగా చూస్తునారు.
మామ్మ నెత్తి మీద ముసుగు లాక్కుంటూ తండ్రిని సముదాయిస్తోంది.
అయిపోయింది... తనకిక యింట్లో స్థానం లేదు. తను చేసిన తప్పు చిన్నది కాదు. తండ్రి కేకల్ని తను తప్పు పట్టలేదు. ఏ తండ్రైనా అలాగే చేస్తాడు.
తనకీ వాళ్లకీ నేటితో రుణం తీరిపోయినట్టే! ఉన్న ఒక్క ఆశ అడుగంటి పోయింది. తీసిన తలుపుల్ని ఒక్క ఉదుటున మూసిసాడు. ఇక తనదోవ తను చూసుకోవాల్సిందే.
కాస్సేపాగి, కళ్లు తుడుచుకుని అనంత అంధకార లోకాల్లోకి సాగిపోయింది కమల.
ఎక్కడుందో! ఇప్పుడేం చేస్తోందో!
కాలం కదిలిపోతోంది నెలలుగా.. సంవత్సరాలుగా! కమల నాన్న, మామ్మ గతించారు.
తల్లి రాని కూతురు కోసం మంచం పట్టేసింది.
అక్కలు వాళ్ల కాపురాలు వాళ్లు చేసుకుంటూ వున్నారు. కమల ఏమైందో? ఏ నిప్పుల లోకాల్లో,గ్రీష్మారణ్యాల్లో దారి తప్పి తిరుగుతోందో? ఏ రాక్షసుల కబంధ హస్తాలలో చిక్కుకుందో!
స్వచ్చమైన లోకం పోకడ తెలియని పావురం లాంటి పిల్లని ఏ ఇనప డేగలు కబళించాయో… లేక.. ఏ అంధకార కూపాలో, రైలు పట్టాలు తమలో కలిపేసుకున్నాయో..
ఎవరికి తెలుసు..ఎవరు చెప్పగలరు!
ఎక్కడుందో!! ఏం చేస్తోందో!!
ఇరవై సంవత్సరాలు గడిచాయి.
కమల వాళ్ల అన్నయ్య కమలాకర్ ఆ రోజు ఆఫీసు పని మీద కలకత్తా వెళుతుంటే ఎందుకో అతనికి చెల్లెలు గుర్తుకు వచ్చింది!అతనికి పెళ్లయింది. మిగిలిన చెల్లెళ్ళు పెళ్లిళ్లు అయ్యాక తను చేసుకున్నాడు. అందరూ హాయిగా వున్నారు. కమల తప్ప.
తను కమల ఆచూకీ కోసం చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఆమె కనపడలేదు.
ఆరోజు కమల దైన్య వదనం, కళ్లకి కట్టినట్టు యీ నాటికీ కనపడు తోంది.
గతం కళ్ల ముందు కదలగానే... వెచ్చటి కన్నీటి చుక్కలు చెంప మీదకు జారేయి.
ఆఫీసు పని ముగించుకుని, దగ్గరలోనే ఉన్న గెస్టుహౌస్ కి నడిచి వెళ్తున్న అతని కళ్ళు, తన ముందు గబగబ నడుస్తున్న ఆమె మీద పడ్డాయి. అరే.. తన చెల్లెలు కమల్లా ఉందే! అంతలోనే అమే అక్కడే ఉన్న ఆటో ఎక్కిసింది. అప్పుడు ఆమే మొహం కనబడింది.. ఆమే కమలే! అంతే అక్కడే ఉన్న మరో ఆటో ఎక్కి, ఆ ఆటో వెంటా వెళ్లమని చెప్పాడు. 'వాళ్లు ఎక్కడుంటారో తెలుసులెండి' అన్నట్టు ఓ నవ్వు నవ్వి ఆటో పోనిచ్చాడు. ఓ పదినిమిషల్లో ఆటో సందుల్లో తిరిగి తిరిగి ఓ ఇంటి ముందు ఆగింది. "ఇక్కడే సార్ వాళ్ళు ఉంటారు!" అంటూ ఆటో ఆపాడు.
ఆటో దిగిన అతడు ఎక్కడికొచ్చడో అర్ధం అయి షాక్ కు గురైయ్యడు. కలకత్తాలోని కుఖ్యాత వేశ్యావాటిక సోనాగచి!
సందులు..గొందులు..వాహనాలు.. త్రాగుబోతులు, తిరుగు బోతులు.. దేహ వ్యాపారులు.. నరకానికి ప్రతిరూపంలా వుందక్కడి వాతావరణం..
ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తూ నడుస్తున్నవాడల్లా... హఠాత్తుగా ఆగిపోయాడు. కుడి వైపు మేడమీద ఆ తెల్లపిల్ల.. కమల లాగే వుంది.
ఆమె కూడా యిటే చూసి గిరుక్కున వెను తిరిగింది.
కమలే.. తను గుర్తు పట్టేడు. బహుశా కమల కూడా గుర్తు పట్టే వుంటుంది. అందుకే తనని చూడగానే గభాల్న వెనక్కి తిరిగి వెళ్ళి పోయింది. చెల్లెలు కనపడినందుకు సంతోషించాలో, యిలాంటి పరిస్థితులలో వున్నందుకు బాధపడాలో అర్థం కాని అనిర్వచనీయమైన స్థితిలో వున్నాడు.
అదే సమయంలో చిన్నప్పుడు తమందరినీ చుట్టూ కూచోబెట్టుకుని రామాయణంలో కథలు చెప్పే బామ్మ గుర్తొచ్చింది. అందులో రాముని బాణం గుచ్చుకున్న కప్ప కథ గుర్తుకు వచ్చింది.
ఒక్క ఉదుటున ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోపల్నుంచి ఓ ఇద్దరు ఎదురు వస్తూ.. ఏవేవో ప్రశ్నలు అడిగారు. కమల తనని పోలిక పడితే, అక్కడ అడుగు పెట్టినందుకు అసహ్య పడుతుంది. తను ఎందుకు వచ్చాడో ఆమె వేరొలా అనుకుంటుంది. పోనీ అమెని బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కు పోవడానికి తనొక్కడ వలన జరిగే పని కాదు. అక్కడ కాపలాగా కనీ కనబడకుండా ఓ పదిమంది రౌడిలు ఆ ఇరుకు సందులో పచార్లు చేస్తున్నారు.
అప్పటి వరకు చెల్లెల్ని చూసిన ఆనందంలో, తన ఉనికినే మర్చిపోయిన అతనికి, షడన్ గా తానో అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసర్ గా ఓ కేసు పరిశోధన కోసం కలకత్తా వచ్చిన విషయం ఙ్ఞాపకం వచ్చింది.
చెల్లెల్ని యెలాగైనా ఆ పాపకూపం నుండి విడిపించాలన్న కృత నిశ్చయంతో లాల్ బజార్ పోలీస్ స్టేషన్ వైపు నడిచాడు కమల అన్న కమలాకర్!
—-------------
విశ్లేషణ—
కృష్ణారావుగారు సీనియర్ రచయిత. వారి కథలన్నీ పాఠకులకు సందేశాన్నిస్తాయి.
పశ్చాత్తాపం అన్ని వేళలా పని చేయదని ఈ కథ చెప్తుంది. తెలిసీ తెలియని లేత వయసులో ఆకర్షణకి లోనై, చేసిన తప్పు అమ్మాయిల జీవితాలని ఏ విధంగా నాశనం చేస్తుందో చెప్తుంది.
కథాంశం అన్ని కాలాలలోనూ కనిపించేదే.. తల్లిదండ్రులు అంత కఠినంగా ఉండకూడదని, తప్పుచేసిన కూతుర్ని మరింత దిగజారకుండా కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని తెలియజేస్తుంది. కథనం అలవోకగా సాగింది. ముగింపు కాస్త ఊరటకనిగిస్తుంది.
కమలని ఉదాహరణగా తీసుకుని, అమ్మాయిలని అనుక్షణం గమనించుకోవాలని సూచిస్తారు రచయిత.
కథంతా సర్వసాక్షి చెప్తున్నట్లుగా సాగిపోయింది. చాలా అచ్చుతప్పులు ఉన్నాయి. అంతకంటే ఇంకేమీ కనిపించలేదు.
—---------------
Comments
Post a Comment