వన్ ప్లస్ టూ ఆఫర్
*****************
మా లక్ష్మీ అపార్ట్మెంట్ లో ఆరోజు పొద్దున్న తొమ్మిదయ్యేసరికి ఆటోలో బాంబే డైయింగ్ దుప్పట్ల వాడు సరుకుదింపాడు
ఫోల్డింగ్ టేబుళ్లు పరచి ,తెచ్చిన దుప్పట్ల పాకెట్లు స్వీట్ బాక్సుల్లా పేర్చాడు.
రెండు ప్లాస్టిక్ కుర్చీలు వాచ్మన్ ఇస్తే కూర్చుని జనాల రాక కోసం ఎదురు చూస్తు,సెల్ ఫోన్లో కాలక్షేపం చేస్తున్నాడు.
హడావుడంతా నేను ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి చూస్తున్నాను.
అంతకు ముందు రోజు సెక్రెటరీ వాట్సాప్ లో దీని విషయమై పోస్ట్ పెట్టాడు.
ఎందుకేనా మంచిదని నేను అమెజాన్ లో వాటి రేట్లు చూసాను.ఐదువందల నుంచి వేలదాక ఉన్నాయి.
"అలా నిలబడి చూడక పోతే వెళ్లి ఎలా ఉన్నాయోచూడొచ్చుగా"
వంటింటి కేకతో కర్తవ్యబో(బా)ధితుడనై మెల్లగా మేకలా వెళ్లాను.
నన్ను చూస్తునే -"ఆయియే సాబ్! "అంటూ ఆహ్వానించేడా రాజస్థానీ వణిజుడు.
పొద్దునే దొరికాడో వెర్రివెధవ..అనుకుని ఉంటాడు మనసులో.
ఒకటి కొంటే రెండు ఫ్రీట.
చాలా శ్రేష్ఠమైన చేనేత దుప్పట్లట.మాల్ కెడితే ఒకోటి రెండువేల దాక ఉంటుదట.
కానీ స్కిము ప్రకారం ఏ సైజు తీసుకున్నా మూడు దుప్పట్లు మూడు వేలేనట.
కొత్తగా తయారవుతున్న స్టేషను లో వాళ్లకో దుకాణం ఉంటుందట.ఈ రేట్లు అప్పుడుండవట.
అన్నీ విని-
నా అంబులపొదిలో ఉన్న అమెజాన్ రేట్ల అస్త్రం వదిలాను.నమ్మకం కోసం ఫోన్లో రేటు చూపించాను కూడా.
చూసాక వాడో వంకర నవ్వు నవ్వి-" వాటి కవుంట్ చూడండి సార్." అన్నాడు
140 ఉందక్కడ.
"మాది చూడండి 240.ఫుల్ కాటన్.గేరంటీ."
అన్నాడు.
ఈ లోగా మా అమ్మి ఎప్పుడు వచ్చిందో అప్పుడే తనక్కావల్సిన డిజైన్,రంగుల దుప్పట్లు మూడు తీసి పెట్టుకుని నా వేపు ఫార్మల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తోంది.
అప్పటికే ఆమెకు దుప్పట్లను చూపిస్తున్న రెండో సహాయకుడు ఊదరగొట్టేస్తున్నాడు.
చివరి ప్రయత్నంగా-
"అసలు ఆఫర్ లేకుండా సింగిల్ దుప్పటి ధర ఎంత"
అని మరో అస్త్రం వదిలాను.
'నీలాటి బోడి లింగాలెన్నో గతం లోనే చూసాన్లె'. అన్నట్టు సియస్సార్ లా శకుని నవ్వు నవ్వి-
"క్యాసాబ్! డిస్కౌంట్ కమ్ హోజాయేగా.ఆప్కో నుక్సాన్ హోగా! సింగిల్ దుప్పటి పన్నెండువందలు పడుతుంది " అన్నాడు.విధిలేక
"మరి బేరం లేదా?"అని వీలైనంత జాలిగా అడిగాను.
మా అమ్మి అప్పుడే వచ్చిన పొరుగావిడకి రంగులు డిజైన్ల ఎంపికలో సహాయపడుతోంది.
నా వేపు చూడనుకూడా లేదు.
'ఒక్కడు నీ మొర నాలకింపడు' అనుకుంటూండగా-
అతడు తలదించి,గొంతు తగ్గించి -"ఇంతకు ముందు ఇద్దరికి మూడువేల ఐదువందలకి ఇచ్చాను.మీకు మూడువేలే.ఎవరితో అనకండి"
అన్నాడు.ఇదే మాట ప్రతి కస్టమర్ తో అంటాడని తెలిసినా మాయామోహితులమవుతాము మనమేదొ స్పెషల్ కేటగిరిలా..
శిఖండిని చూసి అస్త్రసన్యాసం చేసిన భీష్ముని లా ఫోన్ తీసి మూడు వేలకి గూగుల్ పే చేసి మా అమ్మితో మూడు దుప్పట్ల పేకట్లతో ఇంటిదారి పట్టాను.
నెల గడిచాక ఒక ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్లినపుడు చూసాను.
బాంబే డైయింగ్ అదే డిజైన్ కింగ్ సైజ్ దుప్పటి ఎనిమిది వందలకే ఇస్తున్నాడు.
అంటే ఆఫర్ పేరుతో ఆరువందలు...
Comments
Post a Comment