అశోక వనంలో శింశుపా వృక్ష ఛాయలో కూర్చున్న సీతాదేవిని పరివార సహితంగా,అట్టహాసంగా,సర్వాలంకారాలతో రావణుడు వచ్చినపుడు అ తల్లి ఎలా ఉందో ఎలా వర్ణించారో చూడండి.
కేతుగ్రహగ్రస్త రోహిణి లా కాంతి విహీనంగా-
నిరంతరం రామునే ధ్యానించు శోక పరాయణ లా-
ముందుకు సాగలేక , ఉన్నచోటనే మెదలుచు
ఉన్న నాగవధువు లా-
సదాచార కులంలో పుట్టి పునఃసంస్కార యోగ్యమైన దుష్కులమందు అవతరించిన మగువ లా-
అసత్యమైన అపవాదముతో జారిన కీర్తి లా-
వేద సంబందము లేక శైథిల్యమొందిన బాహ్యవిద్య లా-
క్షీణించిన మహా కీర్తి లా-
అవమానింపబడిన శ్రద్ధ లా-
పరిక్షీణమైన పూజ లా-
నిష్ఫలమైన ఆశ లా-
ధ్వస్తమైన ధనలాభం లా-
పాలింపబడని ఆజ్ఞలా-
అపహృత ద్రవ్య అయిన పూజ లా-
త్రెంచిపారవైచిన పద్మిని లా-
శూరులు మరణించిన సేనలా-
చిక్కని చీకటి క్రమ్మిన కాంతి లా-
నీరులేని నది లా-
అనర్హులచే స్పృశింపబడిన యజ్ఞవేది లా-
అరిన అగ్ని జ్వాల లా
చంద్రునికి గ్రహణము పట్టిన పూర్ణిమ లా-
కరికరముచే అకృష్టమై రేకలు ఊడిన తామరపువ్వులతో కూడిన నీటి ప్రవాహము లేని ఎండిపోయిన నది లా-
నవరత్నఖచిత గృహాలలో నివసింప దగిన సుకుమారి,యూధపతికి దూరమై,స్తంభము నకు బంధించబడ్డ గజరాజ వధువు లా-
ఏకవేణి గా శోకాకార సీత ను కన్నులకు కట్టినట్లు దృశ్య చిత్రీకరణ గావించాడు వాల్మీకి మహాకవి.
Comments
Post a Comment