మీనర హృదయం
*****************
"ఇదేమన్నా బాగుందాండీ?
అంటే అన్నామంటారు!
మా ఘోష మేమెవరికి చెప్పుకోవాలండీ?
మీరు పెద్ద మనుషులు, మంచీచెడ్డా తెలిసిన వారు.
మీరైనా ఆలోచించాలి కదా తప్పెవరిదో!
మా మానాన మేము మాఇంట్లో కలో గంజో తాగుతూ ఎవరికీ ఏ అపకారం, హానీ చేసెరగం.
అలాంటిది వీడెవడో బలం ఉందికదాన్చెప్పి , తన మందని వెంటబెట్టుకొచ్చి, ఇలా రోజూ మాఇంట్లో జబర్దస్తీగా దూరి,
మా సామాన్లన్నీ చిందరవందర చేసి మమ్మల్ని మూల కూచోబెట్టడం అన్యాయం కాదా? మీరే చెప్పండి! రేపు మీ ఇంటి మీద పడితే...?
వాడి బలానికి జడిసి ఇలా కుక్కిన పేనుల్లా ఓమూలకి పోయి కనపడకుండా మొగుడు సచ్చిన ముండల్లా కూర్చున్నాం. దాదాపు గంటసేపు ఇల్లంతా అల్లకల్లోలం చేసి మరీ ఆ మంద కదిలింది.
అయినా వాళ్ల నాయకుడు కదలడే! ఎత్తుగా,బలంగా ఉన్నాడు. వాడి ప్రతాపం వాళ్లందరికీ చూపెట్టాలని గొప్ప కొద్దీ మరింత అల్లరి ప్రారంభించాడు.
బయట ఉన్న వాడి మందంతా కిసుక్కున సొట్ట నవ్వులు నవ్వుతుంటే వీడిక్కడ మరీ రెచ్చిపోసాగాడు.
మా వాడు ...మా చుట్టమే లెండి. మాలో కాస్త బలం ఉన్నవాడు...చూస్తూ ఊరుకోలేక గభాల్న వాడికాలు దొరక బుచ్చుకున్నాడు.
శెబాషనుకుని మేం దూరం నుంచే చూస్తున్నాం ఎందుకయినా మంచిదని.
అప్పుడు మొదలయిందండీ వాళ్లిద్దరి మధ్యా పెనుగులాట.
వీడు పీకటం, వాడు లాక్కోడం!
మావాడు కూడా పట్లలో వాడికేం తీసిపోడండోయ్.
అలా వాళ్లిద్దరి పెనుగులాట బయటినుంచి వాడి మంద కూడా చూసేరు గానీ వాళ్లెవరూ సాయం చెయ్యడానికి సాహసించలేదు.
ఇదీ మన మంచికే అన్చెప్పి మేము మావాడిని ఉత్సాహ పరిచాం.
చుస్తుండగానే మావాడిది పైచేయి అయింది. వాడికి నీరసం వచ్చేసింది. తేలగుడ్లు పడిపోయాయి.
చేతులెత్తి ఏదో గొణుక్కున్నాడు.
అదిగో..అలాంటి సమయంలో మీరు పిలవని పేరంటంలా వచ్చి, వెనకా ముందూ చూడకుండా మా వాడ్ని వేసేసారు.
మీరు పెద్దమనుషుల నుకున్నాము.
న్యాయం చేయవలసిన మీరు...
పురపురా వచ్చి సెటిల్మెంట్ జేయీస్సేరు. మావాడు మధ్యలో బలయిపోయాడు.
ఇదేవన్నా బాగుందా?
మీరే చెప్పండి సారూ!
వివరాలా..అన్నీవిన్నాకా ఇంకా అలా అడుగుతారేం తండ్రీ!
మీరే మా ప్రభువులు కాదా!
మీకన్నీ తెలుసు కదా!
సర్వాంతర్యాములు!!
మా మకరేశ్వర్రావుని వేసేసి, ఆ గజేంద్రుణ్ణి ఆనాడు కాపాడింది మీరు కాదా?
Comments
Post a Comment